నవ్వించే ‘ఇ ఈ’

103
E Ee Movie Press Meet Stills

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు మంచి ఆదరణ వుంది. అందుకే తమిళంలో అంత బాగా హిట్లు వస్తుంటాయి. తెలుగులో ఇది కొంత లోపించింది. రొటీన్ కథలనే ఎంచుకుని బోల్తా పడుతుంటారు. ఈ మధ్యనే కాస్త కొత్త దర్శకులు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలను తెరకెక్కించి హిట్లు కొడుతున్నారు. అలాంటి వారికి ఇండస్ట్రీలో కూడా మంచి భవిష్యత్తే వుంది. నిర్మాతలు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా మరో కొత్త దర్శకుడు ‘ఇ ఈ’ అనే ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకొచ్చాడు. లక్ష్మణ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు రామ్ గణపతి రావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఓ డిఫరెంట్ ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకుల్ని అలరించిందో చూద్దాం పదండి.

కథ: సిద్ధు (నీరజ్ షా) ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని బాస్ ఎన్.కె.(సుధాకర్) కి అత్యంత విధేయుడు. ఇదిలా ఉంటే… అమ్మాయిలకు మాత్రం బాగా దూరం. వారంటే అస్సలు పడదు. తన జీవితంలోకి ఎలాంటి అమ్మాయి రాకూడదని దేవుళ్లకు మొక్కుతుంటాడు. ఓరోజు అనుకోని పరిస్థితుల్లో ఉన్నత కుటుంబానికి చెందిన హాసిని (నైరా షా) గొడవతో పరిచయం అవుతుంది. ఆమెనే అతనికి బాస్ అవుతుంది. అంటే ఎన్.కె కూతురు. హాసినికి, సిద్ధూకు తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలో భాగంగా తపస్సు చేస్తున్న స్వామి ఎదురౌతాడు. అమ్మాయిలు మనసులో మాట్లాడుకునే మాటలు సిద్ధుకు వినపడేలా శపిస్తాడు. కొంతకాలం ఈ శాపాన్ని తనకు పాజిటివ్ గా మలుచుకుంటాడు సిద్ధు. అలా హాసినితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. అయితే ఈ మనసులోని మాటలే తనకు సమస్యల్ని తెచ్చిపెడతాయి. మళ్లీ సాధువు దగ్గరికి వెళ్తాడు. సిధ్దు సోల్ ని హాసిని లోకి… హాసిని సోల్ ను సిద్ధులోకి పంపించి మాయమౌతాడు. అలా ఇద్దరి సోల్స్ మారిన తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. మళ్లీ తమ సోల్స్ యాథాస్థితికి వచ్చేందుకు ఏం చేశారు. సాధువు మళ్లీ కనిపించాడా… తనను లోబర్చుకునేందుకు ట్రై చేస్తున్న అమ్మాయి నుంచి సిద్ధు ఎలా తప్పించుకున్నాడనేది అసలు కథ.

కథ.. కథనం విశ్లేషణ: దర్శకుడు రామ్ గమపతి రావ్ స్వతహాగా యానిమేటర్ కావడంతో… ప్రతీ సీన్ ను చాలా చక్కగా తీర్చిదిద్దగలిగాడు. క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ ను బ్యూటిఫుల్ గా మలిచాడు. కెమెరా వర్క్ బాగుండడంతో తాను అనుకున్న ఔట్ పుట్ వచ్చింది. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ. సెకండాఫ్ లో ప్రేక్షకులు ఊహించని సోల్స్ ఎక్స్ చేంజ్ అవ్వడం మేజర్ హైలైట్. ప్రథమార్థంలో హీరో హీరోయిన్స్ గొడవ పడడం… అమ్మాయిలు తమ మనసుల్లో ఏమనుకుంటున్నారో హీరోకు తెలియడం లాంటి సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయి. అమ్మ సెంటిమెంట్ ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. హీరో తల్లితో, హీరో చెల్లితో వచ్చే సన్నివేశాల్ని దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. తాను రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చేసీన్స్ అందరికీ సర్ ప్రైజింగ్ గా ఉంటాయి. సోల్స్ మారడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. బాడీలు మారకుండా సోల్స్ ఎక్స్ చేంజ్ అయితే ఎలాంటి మార్పులు వస్తాయి. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందో బాగా చెప్పాడు. మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఐటమ్ సాంగ్ తో వేడెక్కించాడు. ఓవరాల్ గా దర్శకుడు రామ్ గణపతి రావ్ ఓ విభిన్నమైన ప్రేమ కథను అందించి ప్రేక్షకుల్ని మెప్పించాడు. టెక్నికల్ గా అమర్ కెమెరా వర్క్ బాగుంది. కృష్ణచేతన్ టి.ఆర్ అందించిన పాటలు రీ రికార్డింగ్ బాగుంది. నరేష్ జొన్న ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. రామాంజనేయులు డైలాగ్స్ సందర్భాన్ని బట్టి బాగా రాశాడు. నిర్మాణాత్మక విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. పలు లొకేషన్స్ లో షూట్ చేయడంతో… భారీ బడ్జెట్ సినిమాను తలపించింది.
హీరో నీరజ్ షా… కన్నడలో సినిమాలు చేయడంతో… అతనికి నటన ఈజీనే అయ్యి ఉంటుంది. తెర మీద మధ్యతరగతి కుర్రాడి పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అమ్మాయిలంటే ఇష్టంలేని మధ్య తరగతి కుర్రాడిగా సహజంగా నటించాడు. ప్రథమార్థంలో గెటప్ కు ద్వితాయర్థంలో గెటప్ కు సంబంధం ఉండదు. కానీ పాత్రల్ని బట్టి తనను తాను మార్చుకున్న తీరు బాగుంది. ఓ దశలో అమ్మాయి మ్యానరిజమ్స్ కూడా చూపించాలి. వాటిని బాగా ప్రదర్శించగలిగాడు. ఇక ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ హీరోయిన్ నైరా షా. జెనీలియా, హెభా పటేల్ లోని ఎనర్జీని చూపించింది. ప్రతీ సీన్ లో హీరోని డామినేట్ చేసేందుకు ట్రై చేసింది. అటు అందం, ఇటు గ్లామర్, అభినయంలో పూర్తి మార్కులు కొట్టేసింది. నైరా షా ఈ సినిమాతో అందరికీ నచ్చేస్తుంది. డబ్బింగ్ తానే చెప్పిందా అన్నట్టుగా పెర్ ఫార్మ్ చేసింది. ఈ సినిమా తర్వాత నైరా షాకు మంచి పేరొస్తుంది. సుధాకర్ చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. దర్శకుడు మంచి హుందాతనం ఉన్న పాత్ర రాశారు. ఆ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు.
కామెడీ పరంగా అభయ్ కామెడీ నవ్వులు పండిస్తుంది. నీటిగా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారో దర్శకుడు రామ్ గణపతి బాగా రాసుకున్నారు. టాయిలెట్ కి వెళ్లి కడుక్కోకపోవడం.. జామకాయ్ సీన్ హిలేరియస్ గా ఉంది. ఇక హీరో పెళ్లి చూపుల కోసం వెళ్లినప్పుడు గజలక్ష్మి తో సీన్స్ బాగా పండాయి. కథ ఎమోషనల్ గా సాగుతున్న సమయంలో గజలక్ష్మి కామెడీ హైలైట్ గా నిలిచింది. సమీర్ మరో కీలక పాత్రలో నటించాడు. తాగుబోతు రమేష్ మరోసారి తాగుబోతుగా నటించి మెప్పించాడు. రెండో హీరోయిన్ గా నటించిన సాషా ఎక్స్ పోజింగ్ తో పిచ్చెక్కించింది. ఈమెకు మంచి ప్లస్ అయ్యే సినిమా. అన్నపూర్ణ టైం దొరికినప్పుడల్లా నేటి జనరేషన్ మీద పంచులేసింది. హీరోయిన్ పనిమనిషి బాబూ… అంటూ వేసిన డైలాగ్స్ కి అందరూ నవ్వుతారు. దర్శక నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నట్టుగా… తెలుగు తెరకు ఇది కొత్త సినిమానే. విభిన్నమైన కథ, వింత పాత్రలు. ప్రేక్షకుల ఊహకందని స్క్రీన్ ప్లే, హిలేరియస్ కామెడీ, అమ్మ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్, హీరో హీరోయిన్స్ నటన, గ్లామర్ పార్ట్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రంగా నిలుస్తుంది. రెగ్యులర్ లవ్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదిరిస్తారు. ఇ ఈ కూడా అదే కోవలోకి వస్తుంది. సో.. తప్పక చూసి.. సరదాగా నవ్వుకోండి.
రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here