రివ్యూ: ధర్మయోగి… ఓ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్!

263

రేటింగ్: 3.35
నటీనటులు: ధనుష్, త్రిష, అనుపమ పరమేశ్వరన్, శరణ్య తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: వెంకటేష్
నిర్మాత: సి.హెచ్.సతీష్ కుమార్
దర్శకత్వం : ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌

రఘువరన్ బి.టెక్. నుంచి తెలుగులో కూడా ధనుష్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే.. ఇప్పుడు తమిళంలో ఏ చిత్రం తెరకెక్కినా.. టాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ధర్మయోగి పేరుతో తన కొత్త చిత్రం ‘కోడి’ తెలుగులో రిలీజ్ అయింది. తమిళంలో నిన్ననే విడుదలైన ఈ చిత్రం ఓ రోజు ఆలస్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ‘ధర్మయోగి’గా ధనుష్ ఏమాత్రం ఆకట్టుకున్నాడో చూద్దాం

స్టోరీ: ధర్మ…యోగి(ధనుష్ ద్విపాత్రాభినయం) అనే ఇద్దరు కవల పిల్లల్లో.. ధర్మ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంటాడు. యోగి పొలిటీషియన్ గా చెలామణి అవుతుంటాడు. అయితే అనుకోకుండా తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో యోగి.. తన ప్రియురాలు అగ్నిపూల రుద్రమదేవి(త్రిష) పోటీలో నిలబడతారు. ఇంతలో యోగి హత్యకు గురవుతాడు. యోగి హత్యకు గురి కావడంతో.. అతని స్థానంలో ధర్మ పోటీకి దిగి.. ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు. తన అన్నను(యోగిని) ఎవరు హత్య చేశారు? మరి రుద్రమదేవి ఎన్నికల నుంచి ఎందుకు తప్పుకుంటుంది? చివరకు తన అన్న హత్య మిష్టరి ఎలాంటి మలుపులు తీసుకుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్టోరీ విశ్లేషణ: ధర్మ… యోగి అనే ఇద్దరు కవల పిల్లల ఆధారంగా తెరకెక్కిన ఈ స్టోరీ.. ఓ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు దురై సెంథిల్ కుమార్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా… రాసుకున్న కథను తెరకెక్కించి దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సాధారణంగా సినిమా మధ్యలోనే హీరో చనిపోవడం ఆడియన్స్ కు రుచించదు. అయితే.. డ్యుయెల్ రోల్ వున్న కారణంతో.. ఓ పాత్రను మధ్యలో ఎండింగ్ చేసేసి… ఆ తరువాత పిరికితనంతో కూడిన మరో పాత్రను పవర్ ఫుల్ గా చూపించడానికి ఆడియన్స్ కు చెప్పిన కారణం.. ఆ తరువాత ఆ పాత్ర ముందుకు పోయే తీరు తెన్నులు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. పొలిటీషియన్ గా ఎదగాలనుకునే పాత్రలో త్రిష బాగా నటించింది. ఇప్పటి దాకా త్రిషా కేవల్ గ్లామర్ పాత్రలనే పోషించింది. ఈ మూవీలో మాత్రం తన విశ్వరూపాన్నే చూపించింది. ఓ వైపు ప్రేయసిగా… మరో వైపు పొలిటీషియన్ గా.. మరో వైపు విలనిజం వున్న పాత్రలో జీవించేసింది. సాధారణంగా… నేటి తరం హీరోయిన్లలో ఇలాంటి పాత్రను చేయడానికి ఎవరూ సాహసించలేదు. దర్శకుడు ఈ పాత్రను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించడం వల్ల ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది త్రిష పాత్ర.
ద్విపాత్రాభినయంలో ధనుష్ నటన అదుర్స్. యోగి పాత్రలో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా… ధర్మ పాత్రలో అమాయక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా యోగి పాత్రలో గెడ్డెం లుక్ లో స్టైలింగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక త్రిష పాత్ర కూడా ధనుష్ పాత్రకు ఏమాత్రం తీసిపోకుండా తెరమీద కనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరన్ పాత్ర చాలా చిన్నదే అయినా… చాలా ఫన్నీగా వుంటుంది. ఆమెకిచ్చిన పాత్రకు బాగానే న్యాయం చేసింది. మిగతా పాత్రల్లో శరణ్య తల్లిగా నటించి పర్వాలేదనిపించింది.
ఓ గ్రిప్పింగ్ స్టోరీని ఎంచుకుని తెరకెక్కించడంలో దర్శకుడు దురై సెంథిల్ కుమార్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కథ.. కథనాలు బాగుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ధనుష్, త్రిషలను బాగా చూపించాడు. ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్ గానే వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here