ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు !

145

కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా టీటీడీ అందించనున్న సహాయ సహకారాల గురించి శనివారం ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. పనుల్లేక అర్ధాకలితో జీవిస్తున్న పేదలకు, అనాధలకు, లాక్ డౌన్ కాలంలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ సిబ్బందికి టీటీడీ రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. శనివారం 20 వేల ప్యాకెట్లను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆదివారం నుంచి సుమారు 50 వేల ప్యాకెట్లు సిద్ధం చేయనున్నట్లు వైవీ తెలియజేశారు. తిరుపతి పద్మావతి మహిళా కళాశాలలో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తామన్నారు. అవసరమైన వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను స్విమ్స్ నుంచి అందిస్తామన్నారు. స్విమ్స్ లో అవసరమైన మేరకు వెంటిలేటర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తిరుచానూరు పద్మావతి నిలయాన్ని క్వారంటైన్ వార్డు కింద ప్రభుత్వానికి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు టీటీడీ, ప్రభుత్వ అధికారులు శనివారం ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సు కోసం శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో 26 నుంచి నిర్వ‌హించిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శ‌నివారం మ‌హా పూర్ణాహుతిలో ఘ‌నంగా ముగిసినట్లు పేర్కొన్నారు. ఆపత్కాలంలో ప్రజలను ఆదుకునేందుకు టీటీడీ అన్ని విధాలా సహకారమందిస్తుందని సుబ్బారెడ్డి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here