రివ్వ్యూ: ‘C/O గోదావరి’ ప్రేమకథ బాగుంది

162

Godavariతారాగణం: రోహిత్ ఎస్, శ్రుతి వర్మ, దీపు నాయుడు, సుమన్ తదితరులు
సంగీతం: రఘు కుంచె
నిర్మాతలు: తూము రామారావు, బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల
దర్శకత్వం : రాజా రామ్మోహన్
రేటింగ్: 3.25
గోదావరి నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపు అన్నీ హిట్టయ్యాయి. అక్కడ పల్లెటూరి వాతావరణం.. మాస్.. క్లాస్ ఆడియన్స్ ను ఇట్టే కట్టిపడేస్తుంది. అందుకే గోదావరి నేపథ్యంలో ఎన్ని సినిమాలు తెరకెక్కినా.. కొత్తగానే వుంటాయి. సరైన కథను ఎంచుకుని.. మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన సినిమాలన్నీ ఇదివరకే బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకున్నాయి. తాజాగా విడుదలైన ‘C/O గోదావరి’ ‘కాప్షన్ పెట్టాలంటే పోస్టర్ చాలదండోయ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ రిలీజైంది. మరి ఇది కూడా ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దామా?
స్టోరీ: గోదావరి ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో నివసించే సుబ్బు(రోహిత్)… అతని స్నేహితులు కలిసి అల్లరి వేషాలు వేస్తూ కాలం గడిపేస్తూ వుంటారు. ఇది వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ వుంటుంది. పైగా సుబ్బు తమ గ్రామ పెద్ద కూతురు సునంద(దీపు నాయుడు) ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని సరదాగా ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. ఇది సునంద అన్నయ్యకు తెలుస్తుంది. దాంతో సుబ్బును చావ బాది గ్రామం నుంచి తరిమేస్తాడు. అలా ఊరి నుంచి తరిమేయబడిన సుబ్బు చివరకు ఎలా మంచి వాడిగా మారి.. నలుగురికి ఉపయోగపడ్డాడు.. అతను గోదావరి ప్రాంతంలో చేపల పెంపకంపై ఆధారపడి జీవించే రైతులకు ఎలా సహాయ పడ్డాడనేదే మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: ఇదో యూత్ ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలను చాలానే చూసున్నా… ఇందులో ప్రధానంగా ఎంచుకున్న స్టోరీలైన్ మాత్రం కొంత ఆసక్తి కలిగించేదే. ఎందుకంటే… మనం నిత్యం వింటుంటాం.. ‘పుస్తెలు అమ్మి అన్నా.. పొలసు చేప తినాలని’. అంత కాస్ట్లీ అన్నమాట పొలసు చేప. వర్షాకాలంలో గోదావరికి ఎదురీదే ఈ చేప అర కిలో విలువ.. ఐదు వైలకు పైమాటే అంటే.. నమ్మగలమా? అలాంటి పొలసు చేప టేస్టు ఇంచు మించు వుండేలా ఓ సైంటిస్టు బ్రీడ్ ను కనిపెట్టే సమయంలో దానిని సొంతం చేసుకొని సొమ్ము చేసుకోవడానికి విలన్ ఎలా ప్రయత్నించాడు? దానిని హీరో ఎలా ఎదుర్కొని రైతులకు దక్కేలా చేశాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఆసక్తిగా తెరకెక్కించాడు దర్శకుడు.
ఇలా మత్స్య పరిశ్రమ నేపథ్యంలో.. ఓ విలువైన చేపల పెంపకం గురించి తెరకెక్కిన సినిమా ఇప్పటి వరకు రాలేదనే చెప్పొచ్చు. అలాంటి సినిమాను దర్శకుడు తెరకెక్కించాలనుకోవడం.. దానికి నిర్మాతలు ముందుకు రావడాన్ని నిజంగా అభినందించి తీరాలి. చాలా మందికి పొలసు చేప.. కేవలం కొత్తనీటికి ఎదురీదితేనే అలా మారుతుందనేది తెలుసు. అలాంటి చేపను కూడా మిగతా చేపల్లాగే పెంచుకునే బ్రీడ్ ను కనిపెట్టొచ్చనే ఓ ఆలోచనను మత్స్య పరిశ్రమపై పరిశోధనలు చేసే సైంటిస్టులకు ఆలోచన వచ్చేలా చేయడం నిజంగా అభినందనీయం.
ఇక ఈ సినిమాలోని బలాల్లో ప్రధానమైనది నిర్మాణ విలువలు. ఒక చిన్న గ్రామంలో సినిమాను తీసిన విధానం చాలా బాగుంది. కొన్ని ప్రధానమైన పాత్రలను ఎంచుకున్న తీరు, ఆ పాత్రల్లో నటీనటుల నటన బాగున్నాయి. ఫస్టాఫ్ లో గోదావరి యాసతో పండించిన కామెడీ బాగుంది. విలన్ పాత్రలో నటించిన నటుడి నటన బాగా ఆకట్టుకుంది. ఇంటర్వెల్ సన్నివేశం… స్నేహితుల మధ్య పండించిన హాస్యం బాగున్నాయి. ఫస్టాఫ్ అంతా మంచి డైలాగ్స్, ఎమోషన్ తో, సరదా సన్నివేశాలతో తెరకెక్కి.. సెకెండాఫ్ మరింత అంచనాలను పెంచింది. అందుకు తగ్గట్టుగానే సెకెండాఫ్ కూడా వుండటంతో.. ఈ చిత్రానికి యూత్ బాగా కనెక్ట్ అవుతారు. పోసాని కృష్ణ మురళి తన పాత్రతో సినిమాను వివరించిన విధానం బాగుంది.
సంగీత దర్శకుడు రఘు కుంచె అందించిన పాటలు బాగున్నాయి. కానీ వాటిని సినిమాలో అనవసరమైన సందర్భాలలో వాడటం జరిగింది. గోదావరి యాసలో రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ కథనం బాగున్నా సెకండాఫ్ కు వచ్చే సరికి అది పూర్తిగా నెమ్మదించి క్లారిటీ లేకుండా తయారైంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడి విషయానికొస్తే అతను ఎంచుకున్న కథ.. కథనం బాగుంది. ఇంకాస్త గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకుని వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here