కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల జీవితాల్లో వెలుగులు!

139

అనంతపురం ప్రజల దశాబ్దాల కల నిజం కాబోతుంది. గొంతు తడుపుకోవడానికి కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వెళ్తున్న భైరవాని తిప్ప ప్రాజెక్టుతో..ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు త్వరలోనే దాహం తీరనుంది. ఓ వైపు కరవుతో , మరో వైపు వలసలతో ఎక్కడెక్కడో బ్రతుకుదెరువుకోసం వెళ్లిపోతున్న సీమకు చెందిన అనంత ప్రజలను తిరిగి రప్పించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి అడుగు ముందుకేశారు. అందులో భాగంగా, హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను భైరవాని తిప్ప ప్రాజెక్టుకు తరలించేందుకు అవసరమైన రూ. 968.89 కోట్ల రూపాయలను ఈ ఏడాది జనవరిలోనే ముఖ్యమంత్రి కేటాయించారు. తద్వారా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి 61.32 కిలోమీటర్ల పొడవుతో కాలువల నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేశారు.

భైరవాని తిప్ప జలాశయం చరిత్ర :

అతి త్వరలో పూర్తి కావాలన్న లక్ష్యంతో ముందుకెళ్లనున్న భైరవాని తిప్ప ప్రాజెక్టుకు చాలా చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ..1951, డిసెంబర్ 28న భైరవాని తిప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. తుంగభద్ర నది ఉపనదిగా పిలిచే వేదావతిపై 1961వ సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తయింది. కానీ, నిర్మాణ లక్ష్యం పూర్తయిన ఆశయం నెరవేరలేదు. కర్ణాటకలో సుమారు 221 కిలోమీటర్ల దూరం వేదవతి ప్రవహించి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతోంది. అయితే….కర్ణాటక రాష్ట్రం ఎగువ భాగంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కొన్ని, అనుమతితో కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మించడంతో భైరవాని తిప్పకు నీటి రాక పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో 15 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు చుక్కనీరు రాలేదు.

ఇలాంటి సాంకేతిక ఇబ్బందులకు తోడూ..అనంతపురం జిల్లాకు దురదృష్టం కొద్దీ ప్రకృతి ద్వారా సహజంగా వచ్చిన వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు క్షీణించడం లాంటి సమస్యలు ఆ జిల్లా ప్రజలను కరవుబారిన పడేశాయి. దీంతో అనంతపురం జిల్లాను, ఆ ప్రాంత ప్రజలను ప్రత్యేకంగా చూసే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే కరువు జిల్లా అనంతను సస్యశ్యామం చేస్తానంటూ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తపించారు. శ్రమించారు. హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను భైరవాని తిప్ప ప్రాజెక్టు కు విడుదల చేసి… ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి, వలసలను అడ్డుకోవాలన్న మంత్రి కాల్వ శ్రీనివాసులు కృషి నేటికి ఫలించింది.

అనంతపురం జిల్లా కరువు ఒక ఎత్తు…..కేవలం గుమ్మగట్ట మండలంలో కరువు మరో ఎత్తు. . ఆంధ్రప్రదేశ్ లో 70 శాతం మంది వలసలు వెళ్లే ప్రాంతం ఇదే. కరువు కాటును తట్టుకోలేక పొట్ట కూటి కోసం గ్రామాలకు గ్రామాలు వలస బాట పట్టాయి. గత పదేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరస్థితుల కారణంగా ఈ వలసలు మరింత పెరిగాయి.

ఇలాంటి వారందరినీ ఆదుకోవాలంటే గ్రామాల్లోని చెరువులకు నీరివ్వాల్సిందే. ఇదే విషయాన్ని రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, స్థానిక రైతులు మంత్రి కాల్వ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల చెరువులకు కృష్ణా జలాలను తరలిస్తే మండలానికి పునరుజ్జీవం కలిగించవచ్చని భావించిన మంత్రి వెంటనే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను భైరవాని తిప్పకు తరలింపుకు అవసరమైన రూ. 968.89 కోట్ల రూపాయలను ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి కేటాయించారు. తాజాగా ప్రాజెక్టుకు కాల్వల ద్వారా నీరు అందించే పనులకు శ్రీకారం చుట్టారు.

ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. తమ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కృషి ఫలితంగా తమ జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగ సముద్రం చెరువు కింద 700 ఎకరాల ఆయుకట్టు, కొత్తపల్లి చెరువు కింద 200 ఎకరాల ఆయుకట్టుకు నీరు అందుతుందని రైతులు ఆనందంగా చెబుతున్నారు. వలసలు ఆగుతాయని, పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన తమ కుటుంబసభ్యులు సొంతూళ్లకు తిరిగి వచ్చేస్తారని గుమ్మగట్ట మండల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

జీడిపల్లి-భైరవాని తిప్ప-కుందుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ వివరాలు:

భైరవాని తిప్ప ఎత్తిపోతల ప్రాజెక్టు త్వరగా సివిల్ పనుల ప్రక్రియ పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే మొదటి దశలో భాగంగా నీటిని 7 చోట్ల ఎత్తిపోతల ద్వారా 88.70 మీట్లర ఎత్తుకు తోడిపోసేదిశగా పనులు సాగనున్నాయి. ఆ నీటిని ఒకే కాలువ ద్వారా గరుడాపురం గ్రామం వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు మళ్లించనున్నారు. జీడిపల్లి జలాశయం నుంచి 3.70 టీఎంసీల నీటిని 14 చోట్ల ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తారు. అందులో 2.00 టీఎంసీల నీరు అంటే సింహభాగం, భైరవాని తిప్ప ప్రాజెక్టుకు, 1.70 టీఎంసీల నీటిని కల్యాణ దుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు తోడి పోస్తారు. గరుడాపురం గ్రామ పరిధిలో మరో 7 చోట్ల ఎత్తిపోతల ద్వారా 86.40 మీటర్ల ఎత్తుకు నీటిని తోడి కుందుర్పి గ్రామం వరకు ఉన్న అన్ని చెరువులను నింపుతారు. దీనివల్ల జిల్లాలోని రెండు ప్రధాన మండలాల ప్రజలకు త్రాగునీరు , రైతాంగానికి సాగు నీరు అందనుంది. ఇక జీడిపల్లి – భైరావాని తిప్ప – కుందుర్తి పథకం ఎత్తిపోతల ప్రాజెక్టు ఎత్తు 175.10 మీటర్లు. జీడిపల్లి నుంచి గరుడాపురం గ్రామం వరకు ప్రతిపాదించిన కాలువ పొడవు 28.70 కిలోమీటర్లు. కాల్వ సామర్థ్యం 13.464 క్యూసెక్కులు. గరుడాపురం గ్రామం నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టు వరకు ప్రతిపాదిత కాల్వ పొడవు 32.625 కిలోమీటర్లు కాగా, కాల్వ సామర్థ్యం 8.82 క్యూసెక్కులు. గరుడాపురం నుంచి కుందుర్పి వరకు కాల్వ పొడవు 32.250 కిలోమీటర్లు కాగా కాల్వ సామర్థ్యం 3.10 క్యూసెక్కులు.

ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు :

భైరవాని తిప్ప పథకం వల్ల రాయదుర్గం, కల్యాణ దుర్గం నియోజకవర్గాల్లో సుమారు 22 వేల ఎకరాలకు ఆయుకట్టుకు నీరు అందనుందని అంచనా. కల్యాణ దుర్గం నియోజకవర్గం కిందకు వచ్చే 5 మండలాల్లోని 114 చెరువుల కింద ఉన్న ఆయుకట్టుకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. గుమ్మగట్ట మండల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో వెయ్యి మీటర్ల మేర భూగర్భ జలాలు పెరగనున్నాయ్. నీరు తరలింపు పూర్తయితే …గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడిచే అవస్థ తప్పుతుంది. జిల్లాలో చాలా వరకు కరువు ఎద్దడి తీరుతుంది. అనంతపురం కరవు తీర్చడంలో ఈ ప్రాజెక్టు పాత్ర కీలకంగా మారనుంది.

జారీ చేసినవారు : సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here