అక్కడ ఒకే రూమ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు..!

24

చదువు బాటలో సాగాల్సిన యువత పక్కదారి పట్టింది. విలాసాల రన్ వేపై పరుగులు పెడుతోంది. డబ్బులు తేలికగా సంపాదించే అవకాశాలు, మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఆకర్షణలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇదంతా జరుగుతోంది ఓ మహానగరంలో అనుకుంటే పొరపాటే. ఇంతకీ ఆ ఊరు పేరేంటి..? అక్కడ ఏం జరుగుతోంది..? శృంగవరపు కోటలో జరుగుతున్న రహస్య తంతుపై స్పెషల్‌ స్టోరీ.
ఇదిగో.. ఇది విజయనగరం జల్లాలోని ఓ పట్టణం.. పేరు శృంగవరపుకోట. ఎస్‌ కోట అని కూడా అంటారు. ఇక్కడి నుంచి కాస్త ముందకు వెళ్తే అందాల అరకు కనిపిస్తుంది. వెనక్క వస్తే విశాఖ మహానగరం. నియోజకవర్గం కావడం.. ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే ఏకైక పట్టణం కావడంతో ఎస్‌కోటలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాడ్డాయి. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లే కాదు.. కేజీ టూ పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు ఇక్కడే ఉన్నాయి. విశాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇక్కడే దొరకుతుండటంతో.. పక్కనే ఉన్న ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఏం కావాలన్నా శృంగవరపు కోటకే వస్తుంటారు. అరకు, పాడేరు, అనంతగిరి, డుంబ్రిగూడ, హకుంపేట.. మండలాల్లోని విద్యార్థినీ విద్యార్థులు ఇక్కడికే వచ్చి చదువుకుంటారు.
అప్పటివరకు ఏజెన్సీ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు.. ఒక్కసారిగా శృంగవరపు కోటకు వచ్చేసరికి కొత్త అనుభూతికి లోనవుతున్నారు. కొత్త బంగారు లోకంలో అడుగుపెట్టినట్లు ఫీలవుతున్నారు. ఇన్నాళ్లు ఇంటి దగ్గర, తల్లిదండ్రుల భయంతో ఉన్నవాళ్లు కూడా ఇక్కడికి వచ్చేసరికి స్వేచ్ఛ ప్రపంచంలోకి వచ్చినట్లు ఫీలవుతున్నారు. అందుకే టీనేజీలో అనవసర ఆకర్షలకు లోనవుతున్నారు. అయతే వీరి అమాయకత్వమే కొందరికి పెట్టుబడి అవుతుంది. చదువు కోసం ఇక్కడే హాస్టళ్లలో ఉండే యువకులకు డబ్బు ఆశ జూపి.. అక్రమమార్గాల్లో నిషేధిత సరకులను సరఫరా చేయిస్తున్నారు. ఏజెన్సీలో పండిస్తున్న గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్‌, చెన్నైకి తరలిస్తున్నారు.
ఓ హ్యాండ్ బ్యాగ్, లేదంటే బ్యాక్ ప్యాక్… అదీ కాకుంటే సూట్ కేస్‌లో గంజాయిని తీసుకెళ్తే.. ఒక్కొక్కరికి 5 నుంచి 10 వేల రూపాయల డబ్బు ముడుతుంది. బ్యాగ్‌లో ఏముందో తీసుకెళ్లే వారికి తెలియదు. డబ్బులు వస్తున్నాయి కదా అని వాళ్లు అమాయకంగా చేసేస్తున్నారు. అయితే భారీగా డబ్బులు వస్తుండటంతో.. యువకులు పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రులు అవసరం లేకుండానే.. సొంతంగా బైకులు, స్మార్ట్‌ ఫోన్లు వాడుతూ.. అమ్మాయిలను ఆకర్షిస్తున్నారు. స్నేహం, ప్రేమ ఇంకా హద్దులు దాటి.. లివింగ్‌ టూ గెదర్‌ అంటున్నారు. ఇపుడు శృంగవరపు కోటలోని రూమ్‌లలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసే ఉంటున్నారు. ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం చదవుతున్న అమ్మాయిలు ప్రేమంటూ హద్దులు దాటుతున్నారు.
కలిసి తిరగడమే కాదు.. ఒకే రూమ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి జీవిస్తున్నారు. ఇంటి ఓనర్లు అడిగితే బంధువులమంటూ కవర్‌ చేయడం.. ఇంకాస్త గట్టిగా అడిగితే ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసుల పేరు చెప్పి బెదిరించే స్థాయి వరకు వెళ్తోంది అక్కడ వ్యవహారం. గత రెండు, మూడేళ్లుగా ఈ విపరీతం మరింత పెరిగింది. అమ్మాయి, అబ్బాయిలు కలిసి తిరిగే దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణం. అర్థరాత్రి సమయంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి షికార్లు కొడుతూ కనిపించారని చెబుతున్నారు పోలీసులు. ఇలా దొరికిన ప్రతిసారి వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు శృంగవరపు కోట ఎస్సై అబ్దుల్‌ రజాక్‌. ఇటీవ గంజాయి తరలిస్తూ ఏకంగా 20 మంది విద్యార్థులు పట్టుబడ్డారని.. అలా వచ్చిన డబ్బుతోనే ఇలా పెడదోవ పడుతున్నారని చెప్పారు.
నిజానికి చదువకునేందుకు అమ్మాయిలు శృంగవరపు కోటకు వచ్చి హాస్టళ్లలో చేరుతున్నారు. కానీ తర్వాత పరిస్థితి మారుతోంది. కొత్త కొత్త పరిచయాలు, అందివచ్చే అవకాశాలు వారిని పక్కదారి పట్టిస్తున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పరిచయమైన అబ్బాయిలతో కలిసి వారికి రూమ్‌కు వెళ్లడం.. ఒక్కోసారి అక్కడే ఉండిపోవడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. ఎవరని ఇంటి ఓనర్‌ అడిగితే.. బంధువనో.. ఇంకేదో అని తప్పించుకుంటున్నారు. హాస్టళ్లలో సీటు దొరకలేదని.. చదువు మధ్యలో ఆగిపోకుండా.. ఇక్కడ ఉంటున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. తల్లిదండ్రులు ఇటు వైపు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక హాస్టళ్లలో ఉండే అమ్మాయిలైతే.. బంధువు వచ్చాడంటూ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రెండు, మూడు రోజులు చెప్పపెట్టకుండా వెళ్లిపోతున్నారు.
అయితే పెడధోరణి.. అమ్మాయిలు గర్భం దాల్చే వరకు వెళ్తోంది. విదేశాలు, నగరాల్లో కనిపించే ఈ విష సంస్కృతి.. శృంగవరపు కోటలోని యువతను చెడగొడుతోంది. విచ్చలవిడి వ్యవహారంతో అవాంఛిత గర్భధారణతో ఆస్పత్రులకు వచ్చే యువతుల సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. వాటితో పాటు గర్భనిరోధక మాత్రల అతివాడకం వల్ల దుష్ఫరిణామాలతో మరికొంత మంది ఆసుపత్రులకు వస్తున్నారని చెబుతున్నారు డాక్టర్‌ వరలక్ష్మీ. ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకుంటాం కదా అని తిరిగి.. తీర గర్భం దాల్చాక అబార్షన్‌ చేయాలంటూ వస్తున్నారని చెబుతున్నారు. అబార్షన్‌ కోసం వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here