రివ్యూ : అనుష్క ‘భాగమతి’

418
నటీనటులు: అనుష్క, ఉన్నికృష్ణన్, జయరాం, ప్రభాస్ శ్రీను, ధన్ రాజ్, విద్యుల్లత తదితరులు
సంగీతం: థమన్ యస్.యస్
సినిమాటోగ్రఫీ: మధి
ఆర్ట్: రవీందర్
నిర్మాణ సంస్థ: UV క్రియేషన్స్
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: అశోక్
టాలీవుడ్లో అనుష్కకు ఎంత క్రేజ్ వుందో అందరికీ తెలిసిందే. సోలోగా నటించిన అరుంధతి, రుద్రమదేవి చిత్రాలతో ఆమె ఒక్కసారిగా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ పేరుతెచ్చుకున్నారు. వాటితో పాటు బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు భాగాలతో దేవసేనగా ఎంత గుర్తింపు పొందిందో.. తాజాగా విడుదలైన బాగమతి ప్రమోషన్స్ తో అంతే పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. మరి బాగమతిగా అనుష్క ఏమాత్రం అలరించేదో చూద్దాం పదండి.
కథ: ఎంతో మంచి పేరున్న కేంద్ర జలవనురుల శాఖ మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జయరామ్) దగ్గర ఐఏఎస్ అధికారి అయిన చంచల (అనుష్క) పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుంది. అయితే అతను ఓ మంచి నిజాయతీపరుడని… అతని నిజాయతీ, మంచితనం ఓర్వలేని పార్టీ అధిష్టానం ఈశ్వరప్రసాద్ ఇమేజ్ దెబ్బతీసి ఆయనపై కేసులు పెట్టేలా సీబీఐని ఉసిగొలుపుతుంది. అందుకు జైలులో ఉన్న చంచల సహాయం తెలుకొని మంత్రికి ఉచ్చు బిగించాలని సీబీఐ భావించి.. చంచలాను జైలు నుంచి ఊరి చివరనున్న పాడుబడ్డ బంగ్లాకు తీసుకెళ్లి వివరాలను రాబట్టడానికి ప్లాన్ చేస్తుంది. మరి చంచల … మంత్రికి ఉచ్చు బిగించేందుకు అవసరమైన ఆధారాలను సీబీఐకి ఇచ్చిందా? అసలు పాడుబడ్డ బంగ్లాలో అంచలను ఎవరు ఆవహించారు? చంచల జైల్లో ఎందుకు ఉంది. తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణ: భాగమతిని హారర్ సినిమా అనేకంటే… దర్శకుడు చెప్పినట్టు స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అనొచ్చు. అంత బాగా నడిపించాడు కథనాన్ని. ఎక్కడా బోరింగ్ లేకుండా.. ఆద్యంతం కొంచం భయపెడుతూ.. next ఏమౌతుందో అని ఆసక్తి కలిగేలా, కథలో లీనమయ్యేలా తెరకెక్కించారు. మొదటి హాఫ్ లో అనుష్క ఫ్లాష్ బ్యాక్ ను కొంచెం కొంచెం రివీల్ చేస్తూనే..కథను పాత బంగ్లాకు తీసుకెళ్లి.. అక్కడ కొంత వరకు ప్రేక్షకులను భయపెట్టే థ్రిల్లింగ్ అంశాలను తెరకెక్కించాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగులో భాగమతిని రివీల్ చేసి.. ఆ పాత్రపై మరింత అంచనాలు పెంచేశాడు. ఇక ద్వితీయార్థంలో వచ్చే ప్రతి ఎపిసోడ్ ను ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టి చూస్తారు. అంతలా స్క్రీన్ ప్లేను రాసుకున్నాడు. ఎక్కడా కథను గెస్సింగ్ చేయకుండా ప్రీ క్లైమాక్స్ దాకా కథ.. కథనాలను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక క్లైమాక్స్ కొంత వరకు తేలిపోయినట్టు అనిపించినా… చివరకు అనుష్క ఇచ్చే ట్విస్టుతో కనెక్ట్ అయిపోతారు. కొంచెం భయం.. కొంచెం థ్రిల్లింగ్.. అక్కడక్కడ నవ్వులు పూయించి భాగమతి ఈ వీక్ లో దూసుకుపోవడం ఖాయం అనిపిస్తోంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. అనుష్క పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. గతంలో వచ్చిన అరుంధతిలో ఆమె నట విశ్వరూపాన్నే మనం చూశాం. ఇందులో కూడా ఇంచు మించు అలాంటి పాత్రే కావడంతో మరోసారి అనుష్క తన స్టామినాను చూపించింది. కథ.. కథనాలు అక్కడక్కడ కొంత నెమ్మదించినా… అనుష్క తన నటనతో ఆయా సీన్లకు ప్రాణం పోసింది. దాంతో ఈ సినిమా కూడా ఆమె కెరీర్లో ఓ మంచి చిత్రంగా మిగిలిపోవడం ఖాయం. అలానే విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు జయరాం కూడా కేంద్ర మంత్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఓ వైపు మంచితనం.. మరోవైపు పేదల పొట్టకొట్టే కన్నింగ్ విలనిజాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసి తన నటనను చూపించారు. అలానే జనతాగ్యారేజ్ లో నటించిన ఉన్నికృష్ణన్ కూడా పేదలకోసం పోరాడే ప్రజానాయకుడు శక్తి పాత్రలోనూ… అనుష్క ప్రేమికుడిగా చక్కగా నటించారు. ఇక మిగతా పాత్రల్లో నటించిన ధన్ రాజ్, ప్రభాస్ శీను, విద్యుల్లత తదితరులంతా భయపడుతూ నవ్వించడానికి ట్రై చేసి.. తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… దర్శకుడు అశోక్.. మరో భిన్నమైన జోనర్ ను టచ్ చేసి మెప్పించాడు. గతంలో పిల్ల జమిందార్ తో అందరినీ ఆకట్టుకున్న ఆయన.. ఇసారి పూర్తిగా కాంట్రాస్ట్ జోనర్ ను ఎన్నుకుని మెప్పించారు. దర్శకుడి కథ..కథనాలు సాదా సీదాగా సాగకుండా వుండటానికి థమన్ అందించిన నేపథ్య సంగీతం బాగా దోహదపడింది. కొన్ని హారర్ సీన్లలోనైతే.. ప్రేక్షకులు ఉలిక్కిపడేలా చేశాడు. అలాగే మధి సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రతి ఫ్రేమును రిచ్ గా.. ఓ రకమైన థీమ్ తో బంగ్లాలోని ప్రతి సన్నివేషాన్ని తెరపై చూపించారు. ఈ చిత్రానికి మరో ముఖ్యమైన పిల్లర్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. పూరాతన బంగ్లాను తీర్చిదిద్ది… అందులోనే దాదాపు ముప్పావు వంతు సినిమాను చిత్రీకరించారు. ఎక్కడా రిపీటెడ్ సీన్లు లేకుండా వుండేలా బంగ్లాను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగా షార్ప్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.
రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here