జన్మభూమితో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాం;సీఎం

ఈ జన్మభూమి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది, ప్రజల్లో విశ్వాసం పెంచింది, సంతృప్తి స్థాయిని అధికం చేసింది. శాశ్వతమైన, మెరుగైన జీవన ప్రమాణాలకు ఈ జన్మభూమి నాంది పలికింది ’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం జన్మభూమి నిర్వహణపై నోడల్ అధికారులు, జిల్లాల కలెక్టర్లతో ఉండ‌వ‌ల్లిలోని త‌మ నివాసం నుంచి సీఎం చంద్ర‌బాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత‌ మూడున్నరేళ్లుగా అభివృద్ధి, ఆర్ధిక అసమానతల తగ్గింపుపై దృష్టి పెట్టామన్నారు. స్వల్పకాలిక, మధ్య తరహా, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేసిన‌ట్లు గుర్తుచేశారు. ఇప్పటివరకు 9,51,822 ఫిర్యాదులు రాగా 6,85,104 అప్‌లోడ్ చేశారని, 2,16,272 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారని సీఎం వివరించారు. విద్యార్ధులు నెలకోసారి గ్రామాలను సందర్శించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఐఎస్‌వో 9001 సర్టిఫికేషన్ సాధించిన కృష్ణా జిల్లా కలెక్టర్ బి.ల‌క్ష్మీకాంతంకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా స్ఫూర్తితో ప్రతి కలెక్టరేట్‌లో ప్రమాణాలు పెరగాలని సూచించారు. అత్యున్నత ప్రమాణాలు, ఫిర్యాదుల పరిష్కారం, ప్రజా సంతృప్తిలో కృష్ణా జిల్లా ముందుందని సీఎం అభినందించారు. ‘‘2022 నాటికి దేశంలో మూడవ అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం కావాలి. 2050 నాటికి ప్రపంచంలో అత్యన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి’’ అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆకాంక్షించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు సి.కుటుంబరావు, వికలాంగుల సంస్థ ఛైర్మన్ జి.కోటేశ్వరరావు, రియల్ టైం గవర్నెన్స్, గ్రామీణాభివృద్ధి, ప్రణాళికా శాఖ అధికారులు అహ్మద్ బాబు, రామాంజనేయులు, సంజయ్ గుప్తా, సెర్ప్, రైతుబజార్ల సీఈవోలు కృష్ణమోహన్, రమణమూర్తి, వివిధ జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *