‘జన్మభూమి-మాఊరు’ ను విజయవంతం చేద్దాం- సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5వ విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంతో మంగళవారం ప్రజల వద్దకు వెళుతోంది. పదిరోజుల పాటు కొనసాగే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం సందర్భంగా పాలనా యంత్రాంగమంతా అంతా ప్రజల ముంగిటకు తరలి వెళ్లనుంది. జనచేతనకు, సమస్యల తక్షణ పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీయ గళంతో ధ్వనిముద్రితం చేసి విడుదల చేసిన శ్రవణ సందేశ పాఠం ఇలా ఉంది.

అందరికీ నమస్కారం…

‘జన్మభూమి-మా ఊరు’తో ఐదోసారి ప్రజల వద్దకు ప్రభుత్వం వస్తోంది.ఈ పది రోజులూ, పాలన మొత్తాన్ని మీ ముంగిటకు తీసుకువస్తున్నాం.ఈ అతిపెద్ద కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘ సభ్యుల దగ్గర నుంచి ప్రభుత్వాధికారుల వరకు పాలనా వ్యవస్థలోని అందరూ మీ ఊరిలో మీకు అందుబాటులో వుంటారు.కుటుంబంలో ప్రతి ఒక్కరూ బావుంటేనే ఊరు సంతోషంగా ఉంటుందని నా నమ్మకం.రాష్ట్రంలో కనీసం 80 శాతం ప్రజల్లో సంతృప్తి కలగాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం.దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆర్ధిక అసమానతలు తగ్గించే దిశగా ప్రతి కుటుంబం నెలకు కనీసం పది వేల రూపాయలు తగ్గకుండా ఆదాయం సంపాదించుకునే మార్గాలు చూపించాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం.కుటుంబ వికాసం, సమాజ వికాసానికి నిరంతరం కృషి చేస్తున్నాం.‘ప్రజలే ముందు’ అనేది ప్రభుత్వ విధానం.అవినీతి రూపుమాపడానికి, సత్వరం సమస్యలు పరిష్కారం చెయ్యడానికి ‘1100’ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం.దేశంలో ఎక్కడా లేని విధంగా ‘రియల్ టైమ్ గవర్నెన్స్’తో పాలనలో పారదర్శకతను, వేగాన్ని పెంచాం.మన రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘ఫైబర్ గ్రిడ్’ ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం.ఇది ప్రభుత్వాన్ని మీకు మరింత దగ్గర చేస్తుంది. ప్రతి ఇంటిని విజ్ఞాన ఖనిగా మారుస్తుంది.‘జన్మభూమి-మాఊరు’లో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తాం. ‘చంద్రన్న బీమా’ కింద రక్షణ కల్పిస్తాం.రైతన్న రుణం తీర్చుకునేందుకు మూడోవిడత ‘రుణ ఉపశమనం’ కూడా చేస్తున్నాం. డ్వాక్రా సంఘ సభ్యులకు వడ్డీయే కాకుండా, పెట్టుబడి సహాయం కూడా అందిస్తున్నాం.‘జన్మభూమి-మాఊరు’లో వచ్చిన ఫిర్యాదుల్ని పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులకు లబ్ది జరిగేలా చూడటం, లబ్ధిదారులకు సాయం చేయడం, ఫిర్యాదులు స్వీకరించడం, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం ప్రభుత్వం ముందున్న కర్తవ్యం.

‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం లక్ష్యం అదే.

సంక్షేమం-సంతృప్తి, ఆరోగ్యం-ఆనందం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, విద్య-వికాసం, మౌలిక సదుపాయాలు, సహజవనరులు-అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధరంగాల అభివృద్ధి, సుపరిపాలన-టెక్నాలజీ వినియోగం, విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్-పేదరికంపై గెలుపు ఇలా అన్నీ కలిపి మొత్తం 9 అంశాలు – ఒక్కోరోజు ఒక్కో అంశంపై దృష్టిసారిద్దాం. సమగ్ర చర్చ చేద్దాం. ప్రణాళికలు రూపొందించుకుందాం. చివరిరోజు ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన వారికి, విజేతలకు పురస్కారాలిచ్చి ‘ఆనందలహరి’ని జరుపుకుందాం.2017లోని మంచి చెడులను విశ్లేషించుకుని నూతన సంవత్సరం-2018లోకి అడుగుపెట్టాం.కొత్త ఏడాదిలో మన మనసును, మన పరిసరాలను, సమాజాన్ని మరింత స్వచ్ఛంగా వుంచుకుందాం. వినూత్నంగా ఆలోచించి సరికొత్త ఉత్సాహంతో ముందడుగు వేద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ముందు నిలవాలనేదే మన ఆశయం.ఇందుకు మనందరం చేయిచేయి కలిపి సాగుదాం, కష్టపడదాం. మనందరి పవిత్ర కర్తవ్యంగా భావించి ‘జన్మభూమి-మాఊరు’లో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని ఫలవంతం చేద్దాం.

మీ అందరికీ నూతన సంవత్సర – సంక్రాంతి శుభాకాంక్షలు.

జైహింద్.. జై జన్మభూమి..

మీ
ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *