పోలవరం అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, వైకాపా కుట్ర ;సీఎం

రాష్ట్రంలో నదులు అనుసంధానం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులు అనుసంధానం వల్ల రాష్ట్రానికి సాగు, తాగునీటి కొరత తీరడమే కాకుండా పరిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. సోమవారం పోలవరం  ప్రాజెక్టును సందర్శించిన ఆయన పనుల ప్రగతిని పరిశీలించారు. అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎగువ కాపర్‌ డ్యామ్‌ జట్‌ గ్రౌటింగ్‌ పనులకు పూజలు నిర్వహించారు. స్పిల్‌వే, ఎగువ కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌, గేట్ల తయారీ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ, వైకాపా పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే ధోరణితోనే కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్ర చేపట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. కొత్త అగ్రిగేటర్‌ కూలింగ్‌ ప్లాంట్‌ వల్ల రోజుకు 5000 వేల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయడానికి వీలవుతుందని వెల్లడించారు. ఈ ప్లాంట్‌ వల్ల స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పుంజుకుంటాయన్నారు. డయాఫ్రం వాల్‌ పనులు అనుకున్న లక్ష్యం మేరకు సాగుతున్నాయని తెలియజేశారు. రాష్ట్రంలో 29 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి లక్ష్యం నిర్దేశించుకోగా… ఇప్పటికి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామని, మరో 8 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం 5 ఫేజ్‌ల ద్వారా పూర్తి చేస్తామని.. దీనివల్ల  రాష్ట్రం సుభిక్షం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *