కేంద్రం సహకారం అందించినా.. అందించకపోయినా ఏపీ అభివృద్ధి మాత్రం ఆగదు: చంద్రబాబు

88

కేంద్రం సహకారం అందించినా.. అందించకపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.అభివృద్ధికి సహకారం అందిస్తారని పొత్తుపెట్టుకుంటే భాజాపా నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లడని వ్యక్తులు తనపై విమర్శలు చేసేందుకు మాత్రం ముందుకు వస్తున్నారని జగన్, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి విమర్శించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించిన ముఖ్యమంత్రి.. ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఫైబర్ నెట్ సాయంతో ప్రసంగ వేదిక వద్ద నుంచే విశాఖ, అనంతపురం జిల్లాల్లో లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒకే మారు 3 లక్షల ఇళ్లను నిర్మించి గృహప్రవేశం చేసిన ఘటన చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో వచ్చే జనవరిలో మరో మూడు లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. ప్రస్తుత లక్ష్యం కంటే అదనంగా మరో ఐదు లక్షల ఇళ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ పూరి గుడిసెల్లో ఉండేందుకు వీల్లేదని.. అందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.ప్రతి వ్యక్తి సొంతింటి కలని తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు.గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లన్నీ మురికికూపాలుగా తయారు చేశారని సీఎం వ్యాఖ్యానించారు.పట్టణ ప్రాంతాల్లో ప్రణాళిక అనుమతి లేకుండా మినహాయింపు ఇచ్చామన్నారు. విశాఖలో రూ.10,600 కోట్ల విలువైన ఇళ్ల స్థలాన్ని పేదలకు ఇచ్చిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని సీఎం వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా కేంద్రంపైనా విమర్శలు గుప్పించారు. కోటి ఇళ్లు కడతామన్న కేంద్రం.. కనీసం దేశ వ్యాప్తంగా 35 లక్షల ఇళ్లను కూడా కట్టలేక పోయిందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందన్నారు. సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పటం అన్యాయమన్నారు. ప్రజలు కట్టే పన్నులతో బతుకుతున్న కేంద్రం.. ఏపీ అభివృద్ధి కోసం పైసా విదల్చటం లేదన్నారు. ఆస్తి వివాదాలు వస్తే కుటుంబ సభ్యులకు సమాన వాటాలుంటాయి కానీ ఏపీ విషయంలో అన్యాయం చేశారని సీఎం వ్యాఖ్యానించారు. పవన్, జగన్ లు మోడీకే వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాపై చెప్పులు విసిరారని ఆరోపణలు చేస్తున్నారని.. తమ పోరాటం పార్టీలు పైనే గానీ వ్యక్తుల పై కాదని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here