ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్క;సీఎం చంద్రబాబు

47

ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కని, ఆర్థిక సంఘం పేరుతో కావాలనే ప్రధాని మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన నగరదర్శిని సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను యూటర్న్ తీసుకోలేదని.. రైటర్న్ తీసుకున్నానని, కేంద్రమే యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ఏపీపై కుట్రలు, కుతంత్రాలు పన్నారని, తాను అప్పుడు, ఇప్పుడు ఒకటే చెబుతున్నారని, ఏపీకి అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని కోరానని, న్యాయం చేయకపోతే రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పానని, దేశానికి కూడా మంచిది కాదని హెచ్చరించానని సీఎం పేర్కొన్నారు. దేశమంతా టీడీపీతో ఉందని, బీజేపీ తప్ప అన్నిపార్టీలు టీడీపీతో ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీతో కలిసి ఉండేది ఒక్క వైసీపీ తప్ప.. వేరే పార్టీ లేదని ఆయన అన్నారు. పోరాడతాం… సాధిస్తాం…, వచ్చే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. మళ్లీ దేశంలో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పుతుందన్నారు. ప్రధానమంత్రిని నిర్ణయించేది మనమేనని ఆయన అన్నారు. మనకు పదవి ముఖ్యంకాదని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, రాష్ట్రానికి న్యాయం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, కేసుల మాఫీ కోసం కేంద్రంతో లాలూచీపడి రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయడంలేదని, మోదీ కాళ్లు పట్టుకునే పరిస్థితికొచ్చారని సీఎం విమర్శించారు. జగన్‌ను నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుందని.. ఆ పరిస్థితి రాష్ట్రానికి రానీయనని చంద్రబాబు అన్నారు. తాము ధర్మపోరాటం చేస్తున్నామని, ధర్మమే గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు జాతి సత్తా ఏంటో నిరూపిస్తామని, వెనుదిరిగి వెన్నెముక చూపించే పరిస్థితే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here