ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా..రాధాకృష్ణన్ నియామకం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్‌ను హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం గురువారం సిఫారసు చేసింది. ఇంతకు ముందు ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దిలీప్ భోసాలే 2016 జూలై వరకు పనిచేశారు. ఆ తరువాత ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది.

అప్పటి నుంచి ఉమ్మడి హైకోర్టుకు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను కొలీజియం నియమించింది. హైదరాబాద్ హైకోర్టుతో పాటు మరో నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, కేరళ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లను కొలీజియం ఖరారు చేసింది.
కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్యను ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్‌ను హిమాచల్‌ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ అభిలాషా కుమారిని మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఇక కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆంటోనీ డామినిక్‌ను అదే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *