491 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగింత

31

సెంట్రల్ యూనివర్సిటీ అనగానే ఒక మంచి ప్రాంగణం, అందమైన వాతావరణంలో చదువుతున్నామనే భావన ఉంటుంది..ప్రస్తుతం మీరు ఆ భావనను మిస్ అవుతున్నారు.. స్వంత భవనాలు, మంచి వాతావరణం లో సెంట్రల్ యూనివర్సిటీ లో చదువుతున్నామన్న విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం బుక్కరాయసముద్రం మండలం లోని జంతలూరు గ్రామం వద్ద ప్రభుత్వం నుంచి సెంట్రల్ యూనివర్సిటీ కి భూమి అప్పగింత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎంపీ తలారి రంగయ్య, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ ఆలూరు సాంబశివారెడ్డి, జెసి ఢిల్లీ రావు, ట్రైనీ కలెక్టర్ జాహ్నవి, సెంట్రల్ యూనివర్సిటీ డీన్ ఇంచార్జ్ బండి కామయ్య తదితరుల సమక్షంలో బుక్కరాయసముద్రం మండల తహశీల్దార్ మహబూబ్ బాషా, సెంట్రల్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ సర్దార్ సింగ్ కు భూమిని అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, ప్రస్తుతం యూనివర్సిటీలో 219 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారన్నారు. దేశంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని, గతంలో కొంత వెనుకబడినా ప్రస్తుతం ముందుకు వెళ్తున్నామని, రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల మాదిరిగా సెంట్రల్ యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరలో యూనివర్సిటీ భవనాలను నిర్మించేందుకు యూనివర్సిటీ అధికారుల కు తగిన సహకారం అందిస్తామన్నారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు యూనివర్సిటీలో చదువుకుంటున్న జ్ఞాపకాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటీ చుట్టూ 8 కిలోమీటర్ల ప్రహరీ గోడ నిర్మాణం చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 3 కిలోమీటర్లు నిర్మించామని మిగిలిన 5 కిలోమీటర్ల గోడను మార్చ్ 31 లోపు పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీలో విద్యాబోధనకు మంచి ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ లను నియమించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, ఆయన అడుగుజాడలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, అందులో భాగంగానే యూనివర్సిటీకి భూములను స్వాధీనం చేశామన్నారు. ఇప్పుడున్న మొదటి, రెండవ బ్యాచ్ విద్యార్థుల చదువు పూర్తిఅయ్యేలోపు భవనాలు పూర్తవుతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధికి యూనివర్సిటీ మార్గదర్శి
: ఎంపీ తలారి రంగయ్య

జిల్లా అభివృద్ధికి సెంట్రల్ యూనివర్సిటీ మార్గదర్శిగా మారనుందని ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. రాష్ట్రం విభజన సమయంలో సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు చేయగా అది మన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఎంతో ముఖ్యమైన సెంట్రల్ యూనివర్సిటీ సింగణమల నియోజకవర్గములో ఏర్పాటు కావడం అదృష్టం గా భావిస్తూ దీన్ని గొప్పగా తీర్చిదిద్దేన్దుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇక్కడ ఏవైనా సమస్యలు ఉత్పన్నం అయితే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలన్నారు. ఈ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, దీని ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. చాలామందికి పరోక్షంగా కూడా జీవనోపాధులు లభిస్తాయని తెలిపారు.

ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరైనా పనులు వేగంగా జరగలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలోనే ఇక్కడ భవన నిర్మాణాలను చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ఇందుకు నిధులు మంజూరు చేయడంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేశారన్నారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ డిల్లీ రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అదేశాలమేరకు సెంట్రల్ యూనివర్సిటీ కి భూములు అప్పగింతకు వేగవంతంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ విద్యాలయాలు దేవాలయాలు అన్న పెద్ద వారి సూక్తులను గుర్తు చేశారు.. వాటిని మననం చేసుకుంటూ, ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు కృషి చేయాలన్నారు. రిజిష్ట్రార్ సర్ధార్ సింగ్ మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కు జిల్లా యంత్రాంగం మంచి సహకారాన్ని అందింస్తోందన్నారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ కోసం తమ భూములు అభివృద్ధి చేసిన 4 రైతులకు 18 లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్, ఎంపీలు అందజేశారు. అనంతరం రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి, బుక్కరాయసముద్రం ఎంపిడిఓ తేజోష్ణ, యూనివర్శిటీ ఉద్యోగులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here