29న ‘వనం-మనం’-‘ఎన్టీఆర్ జలసిరి’

120

chandrababunaidu-k9SC--621x414@LiveMintరాష్ట్రంలో 50%గ్రీన్ కవర్ రావాలి, ఈనెల 29న ‘వనం-మనం’-‘ఎన్టీఆర్ జలసిరి’ కార్యక్రమం కింద చేపట్టిన కోటి మొక్కలు నాటడంలో 5కోట్లమంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలి, హరిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం రూపొందాలని’’ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. సోమవారం విజయవాడలోని తననివాసం నుంచి 4600 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నాటిన ప్రతిమొక్క జియో ట్యాగింగ్ చేయాలని, టీంలీడర్లు ఎప్పటికప్పుడు దాని పెరుగుదలను పరిశీలిస్తూ నాటిన అన్ని మొక్కలను సంరక్షించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్చందసంస్థల ద్వారా వాటికి ట్రీగార్డులు ఏర్పాటుచేయాలని కోరారు. ప్లాంటేషన్, పంటసంజీవని, సీసీ రోడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలన్నారు.
నరేగా కింద ‘నీరు-చెట్టు’ పనులు వేగవంతం చేయాలన్నారు. సిమెంటు రోడ్లు, పంటసంజీవని, నీరు-చెట్టు తదితర పనులకు అందుబాటులో ఉన్న రూ.635 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నరేగా నిధులు రూ.8వేల కోట్లను పూర్తిగా వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. హార్టీకల్చర్ పనులు మరింత వేగవంతం కావాలని ఆదేశించారు.
గ్రామాలు, పట్టణాలలో ఇనిస్టిట్యూషనల్ సోక్ పిట్స్ తవ్వకాన్ని స్థానికసంస్థలు చేపట్టాలని, ఏఊళ్లో పడిన వర్షపునీరు ఆఊళ్లోనే భూగర్భంలో నిక్షిప్తం అయ్యేలా శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. సీఎం డ్యాష్ బోర్డు తరహాలోనే డిస్ట్రిక్టు డ్యాష్ బోర్డు, డిపార్ట్ మెంట్ డ్యాష్ బోర్డు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాల మధ్య, శాఖల మధ్య సమన్వయలోపం, సమాచార లోపం అనే సమస్యలు ఉత్పన్నం కారాదన్నారు. కమాండ్ ఏరియా, నాన్ కమాండ్ ఏరియా అనిగాకుండా ఎక్కడ భూగర్భ జలాల లభ్యత ఉందో అక్కడ ‘ఎన్టీఆర్ జలసిరి’ చురుకుగా చేపట్టాలన్నారు. ఈ ఏడాది చివరికల్లా అన్ని పథకాల లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అంగన్ వాడీ భవనాల నిర్మాణం, వర్మికంపోస్టు ప్లాంట్ల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు మందకొడిగా జరగడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవన్నీ మనిషి చేసిన తప్పిదాల వల్ల ఉత్పన్నమైన సమస్యలంటూ వాటిని మనమే పరిష్కరించాల్సి ఉందన్నారు. ఏపని కూడా అసాధ్యమనే భావనే ఎవరిలో రాకూడదంటూ, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరికీ ఎటువంటి ఇబ్బందిలేకుండా ఆనందంగా పనిచేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లు,వీడియో కాన్పరెన్స్ లు, ఇంటర్ నెట్ వంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పరిపాలన మరింతగా ప్రజలకు చేరువ కావాల్సివుందన్నారు. పరిపాలన మొత్తం ఒక గొలుసుకట్టు చర్యగా (చైన్ గా) పేర్కొంటూ, ఎక్కడ బ్రేక్ వస్తే అక్కడ పనులు నిలిచిపోవడమే కాకుండా మొత్తం చైన్ పై దాని ప్రభావం పడుతుందన్నారు. పైనుంచి దిగువ స్థాయివరకు ఎక్కడా చైన్ బ్రేక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here