2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు

64

ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం సాగిస్తామని, విభజన చట్టం ఆమోదం పొందుతున్న నాడు రాజ్య సభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు జరిపేదాకా విశ్రమించబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఆరు దశాబ్దాల శ్రమను, కష్టాన్ని, సృష్టించిన సంపదను హైదరాబాద్‌లో వెచ్చించి, కట్టుబట్టలతో, అప్పులతో బయటికి వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలనా మండలి సమావేశాలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి…

విభజనచట్టం అమలు, రాష్ట్రంలో కేంద్ర ప్రాజెక్టులు, పథకాల అమలు ప్రస్తావనాంశాలు, చర్చనీయాంశాలపై గురువారం సచివాలయంలో అధికారులతో సమగ్ర చర్చలు జరిపారు.

2022 నాటికి దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబరాల వేళ మనదేశం మరో 8% వృద్ధిరేటు సాధించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

దేశంలో అనేక రాష్ట్రాలు ఇంకా 10% నుంచి 12% వృద్ధి రేటు సాధించాల్సి ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎన్నో అవరోధాలను అధిగమించి,

కేంద్ర సహాయ నిరాకరణను తట్టుకుని అద్భుతాలు సాధించిందని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రమైనా, అవరోధాలున్నా, స్వీయ వ్యూహాలతో ఉద్యోగుల సహకారం, తమ కష్టంతో గత నాలుగేళ్లలో రాష్ట్రానికి 10.5% సగటు వృద్ధిరేటు సాధించిపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

‘సమాఖ్య స్ఫూర్తి ఏమైంది?

ప్రధాని చెప్పిన టీమ్ ఇండియా స్పిరిట్ ఏమైంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రాభివృద్ధి అంటే దేశాభివృద్ధిలో భాగమేనని, కేంద్రం కూడా కో-ఆపరేటివ్ ఫెడరలిజం మేరకు ఎదుగుతున్న రాష్ట్రాలకు అండగా నిలవాల్సి ఉందన్నారు.

అవరోధాలు, ఆటంకాలను తట్టుకుని సుస్థిరంగా అభివృద్ధిని సాధిస్తున్న రాష్ట్రాలపై కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి కానీ, ఉదాశీనంగా, కక్షసాధిస్తున్న తరహాలో వ్యవహరించడం వాంఛనీయం కాదని ముఖ్యమంత్రి చెప్పారు.

విభజననానంతరం నవ్యాంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం పూర్తిగా లోపించిందని అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా తలసరి ఆదాయం పెంచుకుని, అభివృద్ధిని సాధించేదాకా కేంద్రం అండగా నిలవాల్సి ఉందన్నారు.

నాటి కేంద్ర ప్రభుత్వం హేతుబద్ధత లేకుండా చేసిన విభజనతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, విభజన చట్టం అమలు చేయకుండా నేటి ప్రభుత్వం అడ్డుకుటోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు.

ఆదాయాన్ని, ఆస్తులను తెలంగాణకు, ఆర్ధికలోటును, అప్పులను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారన్నారు. ఎక్కడ ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయన్న వాదనతో ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందన్నారు.

అరవై ఏళ్లపాటు కష్టపడి సంపద సృష్టించి హైదరాబాద్‌లో ధారపోశామని, విభజన తర్వాత అటువంటి రాజధానిని వదులుకుని వచ్చినందుకు, మూల్యంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు.రావాల్సినవే అడుగుతున్నాం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సినవే తాము అడుగుతున్నామని, 11 విద్యాసంస్థలకు, 8 మౌలిక సదుపాయ సంస్థలనే తాము కోరుతున్నామని అన్నారు. కేంద్రం 9 విద్యాసంస్థలను ప్రారంభించడమైతే ప్రారంభించిందని,

కానీ రూ.11673 కోట్లకు గాను కేవలం రూ.638 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

పోలవరానికి ఖర్చుచేసిన రూ.1,892 కోట్లు ఎప్పుడిస్తారు?
2019 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరిస్తామని, కేంద్ర ప్రభుత్వ పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోందని,

2019కి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని, కష్టపడి పనిచేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రం కోరిన వెనువెంటనే కేంద్రం స్పందించి పోలవరానికి నిధులను విడుదల చేయడంలేదని, అందువల్ల ఆర్ధికంగా కష్టాలున్నప్పటికీ, రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టుకు ముందుగా

రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు ఖర్చు పెట్టి కేంద్రం నుంచి రాబట్టుకోవాలన్న పద్ధతిలో ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.

ఇప్పటికీ రూ.1,892 కోట్లను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

ఎన్ని అడ్డంకులు ఉన్నా, కేంద్రం సహకరించకపోయినా స్వీయ పర్యవేక్షణలో పోలవరం 55% ప్రాజెక్టు పనులు  డయాఫ్రం వాల్ నిర్మాణం రికార్డు సమయంలో పూర్తిచేసి చరిత్ర సృష్టించామన్నారు.

ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవడం ఎక్కడి చోద్యం?

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర సాయంలో భాగంగా రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు, మొత్తం 7 జిల్లాల అభివృద్ధికి కేంద్రం 428 కోట్లు కేటాయించిందని, అదే బుందేల్ ఖండ్ కు రూ.4000 కోట్లు కేటాయించిందన్నారు.

అందులో కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ350 కోట్లు అక్కౌంట్లో వేసి తిరిగి వెనక్కి తీసుకొందని అన్నారు.
ద్రవ్యలోటు రూ.16,078.76 కోట్లు

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు రూ.16,078.76 కోట్ల ద్రవ్యలోటు ఉందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్పష్టం చేసిందన్నారు.

హోదాపై రాజీ లేదు..ఏపీ భవన్ విభజనలోనూ సహాయనిరాకరణ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని రాజ్యసభలో హామీ ఇచ్చారని, కానీ చిత్రంగా ప్రత్యేక హోదాను, హామీలను అమలు పర్చడానికి కేంద్రం నిరాకరిస్తోందని ముఖ్యమంత్రిఅన్నారు. ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజీపడబోరన్నారు.

తొమ్మిది, పది షెడ్యూల్స్ ప్రకారం ఆస్తుల విభజనకు ఇంకా ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. రూ. 2 లక్షల కోట్ల విలువైన ఆస్తిగా అంచనా వేసిన ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనలో కేంద్రం తాత్సార వైఖరి వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోతోందన్నారు.

ఆస్తుల విభజనలో సుప్రీంకోర్టు సూచనలనూ పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు.
జీఎస్టీ విధానాల అమలు లోపం, ఖాళీ ఏటీఎంలతో నరకం

కేంద్ర నగదు ఉపసంహరణ (demonetisation) పథకం వల్ల ప్రజలకు కొత్త అవస్థలు వచ్చాయని, గంటల సమయం ఏటీఎంల దగ్గర క్యూకట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. నగదు ఉపసంహరణ,

జీఎస్టీ వల్ల వ్యాపారులు బాగా దెబ్బతిన్నారని, ప్రజల కష్టాలు నానాటికీ పెరగుతన్నాయని అన్నారు.

జీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం పద్ధతిలేకుండా వేర్వేరు తేదీల్లో చెల్లించడం వల్ల రాష్ట్రానికి ఆర్ధికంగా వ్యయప్రణాళిక రూపకల్పనకు అవరోధంగా మారిందన్నారు. కేంద్ర విధానాల వల్ల రాష్ట్రం మీద ఆర్ధిక భారం పెరిగిందని చెప్పారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి చెల్లింపులు జరపడం ద్వారా నష్టపోతున్నామన్నారు.

అడ్డుకుంటున్నా కష్టంతో ఎదిగాం: చంద్రబాబు
కేంద్రం అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నా, తమ కష్టంతో ఆంధ్రప్రదేశ్‌ను ఇవాళ దేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టినట్లు,

సగటున 10.5%తో వరుసగా నాలుగేళ్లుగా రెండంకెల వృద్ధి రేటు సాధిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఆర్ధికంగా లోటుతో ఉన్నా గత నాలుగేళ్లుగా అరకోటి మందికి పెన్షన్లు ఇస్తున్నామని, రూ.20,790 కోట్ల సామాజిక భద్రత పెన్షన్లిస్తున్నామని, రైతులకు రూ.15,038 కోట్ల మేర రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి స్థానంలో ఉందని చంద్రబాబు ఉదహరించారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాల్సి ఉందన్నారు.

కేంద్ర సహకారం లేకున్నా నాలుగేళ్లలో 10.5 % వృద్ధి రేటు సాధించాం: ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కష్టాలు, అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతున్నా వరుసగా మూడేళ్ల నుంరచి కష్టపడి పనిచేసి రెండంకెల వృద్ధి రేటు నమోదు చేశామని, ఆదాయం లేని రాష్ట్రం. అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పోటీ పెట్టాలి కానీ, కేంద్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, అభివృద్ధికి సహకరించాలి తప్ప ఇలా అడ్డుకోవటం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు.

పన్నులు చెల్లిస్తున్నా న్యాయబద్ధంగా మనకు ఇవ్వాల్సింది కేంద్రం ఇవ్వటం లేదని చంద్రబాబు అన్నారు. పోలవరంలో లెక్కలు సమర్పించిన తర్వాతనే నిధులు విడుదల చేస్తున్నారని, నిధుల ఖర్చు అథారిటీ చూసుకుంటుదని అన్నారు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంలో రాష్ట్రం ఖర్చుచేసిన నిధుల విడుదలలో జాప్యం సరికాదన్నారు.

ప్రత్యేక హోదా ఇస్తాం అంటేనే ఒప్పుకున్నామని, హైదరాబాద్ ను వదులు కొని వచ్చామని, కానీ అప్పుడిస్తాం, ఇప్పుడిస్తాం అని కాలయాపన చేశారని, చివరికి మోసగించారని కేంద్రం వైఖరిని చంద్రబాబు దుయ్యబట్టారు.

నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించే అంశాల్లో ప్లానింగ్ విభాగం సెక్రటరీ సంజయ్ గుప్తా ఇచ్చిన ప్రజెంటేషన్ లో ముఖ్యమంత్రి మార్పులు, చేర్పులు సూచించారు.

మరోపర్యాయం సమావేశమవుదామని చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శులు ఎ.వి. రాజమౌళి, గిరిజాశంకర్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here