20న సీఎం చంద్రబాబు ‘ధర్మపోరాట దీక్ష’

30

Revised
పత్రికా ప్రకటన

ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం తీరు వల్ల ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 20 వ తేదీన ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరోజు నిరశన దీక్ష చేయనున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ నిరశన దీక్షలో పాల్గొంటున్నారన్నారు. 68 ఏళ్లలో వయస్సులో సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్న ఈ సాహస కార్యక్రమానికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మపోరాట దీక్ష కార్యక్రమం విజయవంతానికి సచివాలయంలోని తన కార్యాలయంలో పలు శాఖలకు చెందిన అధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన నారా లోకేష్, దేనినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రతో కూడిన నలుగురు మంత్రుల ఉప సంఘం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ‘ధర్మపోరాట దీక్ష’ నిర్వహణకు ఆయా శాఖల అధికారులకు మంత్రుల ఉప సంఘం దిశానిర్దేశం చేసింది. ముందుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, నలుగురు మంత్రుల ఉప సంఘం అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబునాయుడు నిరశన దీక్ష చేయనున్నారన్నారు. ఈ దీక్ష ఏర్పాట్ల బాధ్యతలను కృష్ణా జిల్లా కలెక్టర్ కు లక్ష్మీకాంతంకు మంత్రి కళా వెంకట్రావు అప్పగించారు. పలు పార్టీల నేతలు, అఖిలపక్ష నేతలు హాజరుకానున్నారని, రెవెన్యూ, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండు వేదికలు ఏర్పాటు చేయాలని, ఒకదానిపై సీఎం చంద్రబాబు దీక్ష బూనుతారని, మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రధాన వేదికపై 150 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం పరుపులు వేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను ఆయన ఆదేశించారు. వేదికగా ఎదురుగా 10 వేల మంది సభికులు ఆశీనులయ్యేలా కుర్చీలు వేయాలన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలు దృష్టికి తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబునాయుడు నిరశన దీక్ష చేయనున్నారన్నారు. దీక్ష ఉద్దేశాన్ని తెలియజేసేవిధంగా వేదికను రూపొందించాలన్నారు.

రాష్ట్ర ఐటీ, గ్రామీణాభృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ధర్మపోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలనూ, అఖిలపక్ష నేతలనూ ఆహ్వానిస్తున్నామన్నారు. వారితో పాటు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, వాణిజ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, బార్ అసిసోయేషన్, ట్రేడ్ యూనియన్లు, రిక్షా, ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలతో పాటు డాక్టర్లు…ఇలా అన్ని వర్గాల ప్రతినిధులకూ దీక్షలో పాల్గొనాలంటూ లేఖలు రాయనున్నామన్నారు. పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్ ను ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. ప్రత్యేక గీతాలతో కూడిన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ధర్మపోరాట దీక్ష కు సంబంధించి విశేష ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా హోర్డులింగ్ లు ఏర్పాటు చేయాలని, మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని అన్నారు. రెండు వేదికలతో పాటు సభికులు కూర్చునే ప్రాంగణంతో పాటు స్టేడియం బయటా టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. వేదికలతో పాటు మైక్, ఇతర సౌండ్ సిస్టమ్ ల ఏర్పాట్లు 19 వ తేదీనాటికే పూర్తి చేయాలన్నారు. సభా స్థలితో పాటు స్టేడియం బయటా ఎల్ఈడీ స్క్రిన్లను ఏర్పాటు చేయాలన్నారు. దీక్షా సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు అన్ని సంఘాల ప్రతినిధులు మాట్లాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని 68 ఏళ్ల వయస్సులో సాహస దీక్ష చేస్తున్నారని, అదే సమయంలో ఢిల్లీలో కదలిక రావాలని ఈ పవిత్ర కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి, ధర్మపోరాట దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర యుజన సర్వీసులు, క్రీడలు, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, దీక్షకు తరలొచ్చే వారి కోసం తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, పొలిటికల్ సెక్రటరీ నాగులాపల్లి శ్రీకాంత్, సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, సెర్ప్ సీఈవో కృష్ణమోహన్, మెప్మా ఎండి చినతాతయ్య, విజయవాడ పోలీసు కమిషనర్, విజయవాడ, గుంటూరు ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here