13న ఒంగోలులో జగన్‌ ‘సమర శంఖారావం’

98

చంద్రబాబు రుణ మాఫీ చేయకుండా రైతుల్ని, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. బడ్జెట్లో అంకెల గారడితో మరోసారి మోసానికి పాల్పడతున్నారు. వీటన్నింటిని తిప్పికొట్టేందుకే జగన్‌ సమర శంఖారావం పూరించినట్లు వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో అసెంబ్లీ సమన్వయకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మోసాలపై అవగాహన కల్పించేందుకు 13న జగన్‌ ఒంగోలు వస్తున్నట్లు తెలిపారు. ఉదయం మేథావులు, తటస్తులతో సమావేశమవుతారని చెప్పారు. మధ్యాహ్నం నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసే బూత్‌ కమిటీ సభ్యులతో సభ జరుగుతుందన్నారు. రైతుల రుణ మాఫీకి సంబంధించి రూ.8,100 కోట్లు బడ్జెట్‌లో చూపించకుండా ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా అన్నదాతా సుఖీభవ అంటూ మరో మోసపూరిత పథకాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం ఎన్నికల్లో బయటపడేందుకు రెండుమూడు నెలలు ముందుగా తాయిలాలు ప్రకటించడం మోసం కాదా అని నిలదీశారు. పింఛన్ల పెంపు, రైతులకు పెట్టుబడి రాయితీ, రుణామాఫీ చేస్తామని రెండేళ్ల క్రితమే జగన్‌ నవరత్నాల్లో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను మాట తప్పకుండా నెరవేర్చే జగన్‌ కావాలో.. మాయమాటలతో వెళ్లబుచ్చే చంద్రబాబు కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీలో చేరికలపై సజ్జల స్పందిస్తూ.. పార్టీ విజయం కోసం అక్కడక్కడా మార్పులు తప్పవని చెప్పారు. దాదాపు 150 స్థానాల్లో ఇప్పుడున్న వాళ్లే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారని చెప్పారు. కేవలం 25 నుంచి 30 స్థానాల్లోనే స్పష్టత రాలేదని వివరించారు. ముందస్తుగా జాబితా విడుదల చేసే ఆలోచన లేదన్నారు. బీ ఫారం ఇచ్చేదాకా సస్పెన్స్‌ కొనసాగుతుందని ఆయన వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసి దానికనుగుణంగా సరైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి తప్పదని చెప్పారు. సమావేశంలో మాజీమంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, నియోజకవర్గాల సమన్వయకర్తలు అన్నా రాంబాబు, టీజీఆర్‌ సుధాకర్‌బాబు, రావి రామనాధంబాబు, బాచిన చెంచు గరటయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాదాసి వెంకయ్య పాల్గొన్నారు. అనంతరం జగన్‌ పర్యటనను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ అసుబంధ సంఘాల బాధ్యులతో సజ్జల సమావేశమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here