హస్తినలో చంద్రబాబు కోసం ఎదురుచూపులు ఎందుకు?

21

మరోసారి కేంద్ర రాజకీయాల్లో దక్షినాది నాయకుడు కీలకంగా మారుతున్నాడు. నియంత మాదిరి ప్రవర్తిస్తున్న ప్రధాని మోడీని ఎదుర్కోవడానికి నేను సిద్దం అని చెప్పకనే చెప్పాడు. రాష్ట్ర సమస్యలను వివరించడానికి ఢిల్లీ వచ్చాను తప్ప రాజకీయం చేయడానికి కాదు అని ప్రకటించాడు. కాని సీన్ చూస్తే ఆయన కోసం బిజెపిలో తలలు పండిన నేతలు సహా..కాంగ్రెస్ ఇతర విపక్షాలు, బిజెపి మిత్రపక్షాలు తపించిపోయాయి. చంద్రబాబు ఎప్పుడు వెళ్ళిపోతారో ఏమో, మేము వెళ్లి కలవాలి అన్నట్టు చంద్రబాబు కోసం ఎదురు చూశారు.

మూడంటే మూడు గంటల్లో మూడేళ్ళ బాధకు ఆయనే ఒక పరిష్కారంలా కనిపించాడు. ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో గడిపిన మూడు గంటలు ఆయనే కేంద్ర బిందువుగా మారారు. కాంగ్రెస్‌, బీజేపీతో పాటు అన్ని పార్టీల ఎంపీలు ఆయనతో మాట్లాడేందుకు, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఉభయ సభలు 12.30 లోపే వాయిదా పడినప్పటికీ ఎంపీలు ఇళ్లకు పోకుండా సెంట్రల్‌ హాలులో చంద్రబాబును కలిసేందుకు వేచి చూశారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, అకాలీదళ్‌, శివసేన, బీజేడీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, డీఎంకే, అన్నా డీఎంకే ఎంపీలు చంద్రబాబును కలిశారు. ఇక ఇక్కడే ఒక కీలక సన్నివేశం జరిగింది. బిజెపి సీనియర్ నేత మురళి మనోహర్ జోషి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారట. చంద్రబాబు ఆయనకు నమస్కరించగా జోషి నవ్వుతూ ఆయన చేతుల్ని పట్టుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ‘నేను మీ ప్రభుత్వ బాధితుడిని’ అని చంద్రబాబు చెప్పగా… ‘ఈయన కూడా మోదీ బాధితుడే’ అని అక్కడే ఉన్న ఒక విలేకరి అన్నారు. అది విని జోషి చిరునవ్వు నవ్వారు తప్ప కాదని చెప్పలేదు.

రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని, తమకు చాలా అన్యాయం జరిగిందని చంద్రబాబు తెలిపారు. ‘మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను’ అని జోషి స్పందించారు. ‘మీరు ఎన్డీయే(ఎం) ఏర్పాటు చేస్తే చంద్రబాబు మీతో ఉంటారు’ అని ఓ విలేకరి అన్నప్పుడు… జోషి పెద్దగా నవ్వారు. ఇప్పటికే మోడీపై బిజెపి నేతలు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్న తరుణంలో జోషి తీరు చర్చనీయంశంగా మారింది.

ఇది ఇలా ఉంటే ఉత్తరాదికి చెందిన బలమైన నేతలు అందరూ చంద్రబాబు కోసమే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. మోడిని ఎదుర్కొనే నాయకుడు మరొకరు లేరని రాహుల్ గాంధీ ఉన్నా ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం త్వరలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో ఆయన అందరిని కలుపుకుని పోయే అవకాశం లేదు. మమత బెనర్జీ ఉన్నా ఆమె బెంగాల్ వదిలి వచ్చే అవకాశం లేదు. ఇక ఇతర నేతలు ఉన్నా వారు అంతగా వ్యూహాత్మకంగా వ్యవహరించే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబే మోడీ వ్యతిరేక కూటమికి కీలకంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here