సీమను రతనాల సీమగా తయారు చేస్తా…చంద్రబాబు

chandrababu naiduకడప జిల్లా అలంఖాన్‌పల్లెలో నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కష్టాలను సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. 2050కు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా ఏపీ ఉండాలని ఆకాంక్షించారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరు ప్రతి ఒక్కరినీ ఆందోళనపరిచిందని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హేతుబద్ధత లేని విభజన చేశారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. పొలాల్లో నీటి గుంటలు తవ్వుకుని రెయిన్‌గన్‌ ద్వారా పంటలను రక్షించుకోవచ్చన్నారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని పునరుద్ఘాటించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే అభివృద్ధి సాధ్యమని సీఎం తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. నదుల  అనుసంధానం ద్వారా సీమకు నీరు అందిస్తామన్నారు. ఇబ్బందులున్నా రుణమాఫీ చేశామని, రాష్ట్రంలో మిగులు కరెంట్‌ సాధించామని ఆయన అన్నారు. ప్రజల ఆదాయం పెరగాలి… ఆర్థిక అసమానతలు తగ్గాలని అన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. త్వరలోనే హజ్‌హౌస్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ముస్లిం సోదరులను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడతామన్నారు. పేదలు సంక్షేమ పథకాలపైనే ఆధారపడటం మంచిదికాదన్న బాబు ఆదాయ మార్గాలను పెంచుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *