రివ్యూ: సరైనోడు… ఊరమాస్!

74


నటీనటులు: అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్, శ్రీకాంత్, సాయికుమార్, ఆది పినిశెట్టి, పృథ్వీ, కాటరాజ్, బ్రహ్మానందం, విద్యుల్లత, సురేఖావాణి తదితరులు
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: అల్లు అరవింద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శీను
రేటింగ్: 3.25/5
బోయపాటి సినిమా అంటే చాలు.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ వుంటాయి. మాస్ కు నచ్చే అన్ని రకాల ఎలిమెంట్స్ వుంటాయి. హీరో.. విలన్ల మధ్య జరిగే వార్ ఓ రేంజ్ లో వుంటుంది. అలాంటి హై ఓల్టేజ్ సీన్లను మరోసారి బన్ని-ఆది పినిశెట్టి మధ్య చూపించడానికి ‘సరైనోడు’ సినిమాను తెరకెక్కించారు బోయపాటి. గతంలో టాలీవుడ్ కి జగపతిబాబు లాంటి స్టైలిష్ విలన్ ను అందించిన బోయపాటి.. ఇసారి యువ హీరో ఆది పినిశెట్టిని విలన్ గా ఈ చిత్రంతో పరిచయం చేయబోతున్నాడు. మరి ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం.

కథ: గణ(బన్ని) కొద్దికాలం పాటు మిలిటరీలో పనిచేసి.. ఇంటివద్దనే వుంటాడు. న్యాయవాది అయిన తన బాబాయ్ శ్రీపతి(శ్రీకాంత్)తో కలిసి భూకబ్జాదారులకు తనదైన శైలిలో బుద్ధి చెబుతూ వివాదాలు పరిష్కరిస్తూ.. పేదలకు న్యాయం చేస్తుంటాడు. అలా తన జీవితాన్ని గడుపుతున్న గణకు పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి ఉమాపతి(జయప్రకాష్). అందుకోసం తన మిత్రుడైన జయప్రకాష్(సాయికుమార్) కూతరుని చూసి రమ్మని చెబుతాడు. తీరా అక్కడికి వెళితే… ఆమెను రౌడీలు కిడ్నాప్ చేసుంటారు. ఇది తెలుసుకుని రౌడీల నుంచి ఆమెను రక్షిస్తాడు. ఇంతలో ఈ విషయాన్ని వైరం ధనుష్(ఆది పినిశెట్టి) చెవిలో పడుతుంది. అది తెలుసుకుని.. జయప్రకాష్ ను.. అతనికి అండగా నిలిచిన పర్ణశాల గ్రామస్తులను కిరాతకంగా చంపుతాడు. దాంతో జయప్రకాష్ కూతరు మహాలక్ష్మి అలియాస్ జానూ… ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రౌడీలు వెంబడిస్తుండగా సిటీలో వున్న గణ వద్దకు వస్తుంది. మరి జాను వాళ్ల నాన్నను ఎందుకు చంపారు? జానును విలన్ ఎందుకు కిడ్నాప్ చేయించాడు? మరి విలన్ బారి నుంచి జానును ఎలా కాపాడాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం విశ్లేషణ: ఇది పూర్తిగా బోయపాటి మార్క్ మాస్ మసాలా సినిమా. ఆయన గతంలో తెరకెక్కించిన చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు. మాస్ ను మెప్పించే హై ఓల్టేజ్ ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ మూవీ ఇది. మాస్ కు నచ్చే  యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఈ సినిమాలో వున్నాయి. బోయపాటి టేకింగ్ కు.. బన్ని ఎనర్జీ తోడైతే… బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. అలానే ఈ సినిమాను మాస్ బాగా ఇష్టపడటం ఖాయం. మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించినా… బన్నీ ఫ్యాన్స్ మాత్రం అది ఇది అని తేడా లేకుండా అన్ని సెంటర్లలోనూ చూడటం ఖాయం. అయితే ఎక్కువగా  బి.సి.సెంటర్ల లో రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువగా వుంటారు కాబట్టి.. వారికి కచ్చితంగా ఫుల్ మీల్ లాంటిదే సరైనోడు. సాధారణంగా బోయపాటి సినిమాల్లో పెద్దగా కథేమీ వుండక్కరలేదు. ఒక చిన్న లైన్ ను తీసుకుని.. దానికి మాస్ ను మెప్పించేలా స్క్రీన్ ప్లే రాసుకుంటాడు. కథతో పెద్దగా పనిలేకుండా టేకింగ్ మాత్రం కొత్తగా వుండేలా చూసుకుంటాడు. ఈ సినిమాలో కూడా  అదే చేశాడు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమా చేసినప్పుడు చేసిన తప్పులను ఇందులో చేయకుండా సినిమా గ్రాఫ్ ను ప్రతి సీనులోనూ అలా పెంచుకుంటూ వెళ్లాడు. దాంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కడా నిరాశ పరచదు.

వ్యవస్థలన్నింటినీ శాసించే ఓ బలమైన విలన్.. అతని పని పట్టే.. అంతకంటే బలమైన హీరో పాత్రలు ఇంతకు ముందు బోయపాటి సినిమాల్లో చూశాం. వీరిద్దరి మధ్య సాగే పోరాటం ఎలావుంటుందో చూశాం. ఇలాంటి భారీ యాక్షన్ సీన్లు ఇందులో చాలానే వున్నాయి. హీరో ఇంట్రడక్షన్ సీన్ తోనే బోయపాటి… మును ముందు బన్ని ఎనర్జీని ఏ లెవల్లో చూపించబోయేది చెప్పకనే చెప్పేశాడు. ఓల్డ్ సిటీకి చెందిన వస్తాదులను ఓ రేంజ్ లో ఉతికారేయడం చూస్తే… ఇలాంటి యాక్షన్ సీన్లను బోయపాటి తప్ప.. మరే దర్శకుడు తీయరని తెలిసిపోతుంది. ఎప్పటిలాగే తన మార్క్ బౌన్స్ లు ఇందులో చాలానే వున్నాయి. అవన్నీ మాస్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ కలిగింఛేవే. ఇప్పటి వరకు బన్ని ఎనర్జీని ఏ దర్శకుడూ సరిగా చూపించలేదని ఈ సినిమాను చూస్తే అర్థం అవుతుంది. ఇందులో బన్ని తన కండబలాన్ని ఎంతలా చూపించాడంటే.. దాన్ని తెరమీద చూస్తేగానీ అర్థం కాదు. అలాగే ఓ మేనరిజాన్ని ఫాలో అయ్యేలా బన్నితో చేయించాడు. టైటుగా వున్న షర్టును యాక్షన్ సీన్లలో రెండు చేతులతో సర్దుకోవడం చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇందులో బన్ని ఓ మిలిటరీ ఉద్యోగిగా పనిచేసి.. రిజైన్ చేసిన యువకునిగా కనిపించాడు. సాధారణంగా మిలిటరీలో పనిచేశాడంటేనే.. అతనిలో దేశభక్తి ఎక్కువ.. అన్యాయాన్ని సహించడని తెలిసిపోతుంది. అలాంటి వాడు విలన్ అరాచకాలపై తిరగబడితే… ఇక థియేటర్లో కూర్చీలో కూర్చున్న బన్నీ ఫ్యాన్స్ కు కనువిందే.

మొదటి అర్ధ భాగాన్ని ఫ్యామిలీ ఎమోషన్స్… బ్రహ్మీ కామెడీతో నడిపించేసి… ద్వితీయార్థంలో అసలు కథలోకి ఎంటర్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లోనే ద్వితీయార్థం ఎలా వుండబోతోందో చెప్పేశాడు బోయపాటి. మొదటి భాగంలో వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్.. అలాగే  పబ్ లో ఆదర్శ్ బాలకృష్ణను స్కేటింగ్ చేస్తూ కాలు నరికే ఎపిసోడ్… అన్నీ ఆకట్టుకుంటాయి. ఆ తరువాత ఇంటర్వెల్ బ్యాంగ్.. ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్ సీన్లన్నీ.. మాస్ ను విపరీతంగా అలరించేవే. బన్ని ఎనర్జీ లెవెల్స్ ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉన్నాయి. ఈ తరహా యాక్షన్ సీన్లకు పర్ ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడు బన్ని. అలాగే ప్రతినాయకునిగా పనిచేసిన హీరో ఆది కూడా చాలా ఎనర్జీగా… స్టైలిష్ గా కనిపించాడు. అతనికి కచ్చితంగా తెలుగులో మంచి భవిష్యత్తే వుంది. అయితే మొదటి హాఫ్ లో తక్కువగా కనిపించినా..  ద్వితీయార్థంలో హీరోతో పాటు అతని క్యారెక్టర్ క్యారీ అయింది. అయితే ప్రీ క్లైమాక్స్… క్లైమాక్స్ వరకు హీరో.. విలన్ల మధ్య పోరాట సన్నివేశాలుగానీ… ఇంట్రెస్టింగ్ సీన్లు గానీ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.

జగపతిబాబు లానే.. మరో యంగ్ స్టైలిష్ విలన్ తెలుగు ఇండస్ట్రీకి దొరికినట్టే.. ఓ వైపు విలన్ వేషాలు వేస్తూ… హీరోగా ట్రై చేస్తే.. టాలీవుడ్లో మంచి భవిష్యత్తే వుంటుంది. ఎం.ఎల్.ఎ.గా కేథరిన్… జానుగా రకుల్ బాగానే నటించారు. వాలెంటీర్ రిటైర్ మెంట్ తీసుకున్న ఐ.ఎ.ఎస్.అధికారి జయప్రకాష్ పాత్రలో సాయికుమార్ నటించిమెప్పించాడు. అలాగే బన్ని తండ్రిగా చీఫ్ సెక్రెటరీ పాత్రలో నటుడు జయప్రకాష్ నటించాడు. న్యాయవాది శ్రీపతి పాత్రలో శ్రీకాంత్ నటన బాగుంది. బన్ని బాబాయ్ గా బాగా నటించాడు. బ్రహ్మానందం క్యారెక్టర్ పర్వాలేదు. భార్య మీద వేసే సెటైర్లు పురుషులకు కొంత నవ్వు తెప్పించినా… మహిళలు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అలాగే విద్యుల్లత ‘సాంబార్’ కామెడీ.. అరవం మాట్లాడే అమ్మాయిగా కాసేపు నవ్వించింది. చాన్నాళ్ల తరువాత అన్నపూర్ణమ్మ నటించింది. అయితే ఆమెది పూర్తిస్థాయిలో వున్న పాత్ర కాదు.తమన్ అందించిన రెండు మూడు పాటలు బాగున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎడిటింగ్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా వుంటే బాగుండేది. దాదాపు 2.40 గంటల సినిమాను ఓ పాతిక నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుంటుంది. సినిమా టోగ్రఫీ బాగుంది. అల్లు అరవింద్ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.  బోయపాటికి ఏది కావాలో అన్నీ సమకూర్చాడు అల్లు అరవింద్. ఈ వేసవిలో కచ్చితంగా మాస్ కోరుకునే బన్ని ఫ్యాన్స్ కు పండగే.

-వడ్డె మను
www.apvathalu.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here