సరస్సు నుంచి 20 వేల ఎకరాలకు మినహాయింపు;సీఎం

59

ఎన్నోఏళ్లుగా కొల్లేరు రైతులు ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మాటిచ్చినట్టుగా కొల్లేరు సరస్సులో మూడో కాంటూరు నుంచి ఐదవ కాంటూరు వరకు వున్న జిరాయితీ, డి పట్టా భూముల రైతులకు వరాలను ప్రకటించారు.

5,600 ఎకరాల డి పట్టా భూములు, 15 వేల ఎకరాల పట్టా (జిరాయితీ) భూములను ‘కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ’ పరిధి నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జిరాయితీ భూములు,

డి-పట్టా యజమానులకు ఒకే ప్రాంతంలో భూములు వుండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.

ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో వందలాది మంది సన్నచిన్నకారు రైతులకు ఊరట లభించినట్టయ్యింది. ప్రస్తుతం మూడో కాంటూరు నుంచి ఐదవ కాంటూరు వరకు సుమారు 78 వేల ఎకరాల్లో విస్తరించిన సరస్సు ఈ ప్రాంతంలో 58 వేల ఎకరాలకు పరిమితం కానుంది. తద్వారా ఈ ప్రాంతంలో స్థానికులకు ఇబ్బందులు తొలగనున్నాయి.

కొల్లేరు సరస్సు నుంచి జిరాయితీ – పట్టా భూముల మినహాయింపు, సరస్సు పరిరక్షణ, డ్రైనేజీల ఆధునీకరణ, పర్యాటకాభివృద్ధి తదితర అంశాలపై అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్షించారు. రైతులను,

స్థానికులను సంతోషపరచడంతో పాటు కొల్లేరు పరిరక్షణ కూడా చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.
కొల్లేరుకు పట్టిసీమ నుంచి నీరు
అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు ఎప్పుడూ నిండుగా నీటితో సమృద్ధిగా వుండాలని ఇందుకోసం పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కొల్లేరుకు నీటిని తరలించే కాలువలు, అలాగే అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, ఆధునీకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే కొట్టాడ దగ్గర తక్షణం రెగ్యులేటర్ నిర్మించాలని,

చిన్నగొల్లపాలెం దగ్గర తలపెట్టిన రెగ్యులేటర్ నిర్మాణంపై అధ్యయనాన్ని త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.

ఇక నుంచి 15 రోజులకోసారి సమీక్ష
ఇక నుంచి కొల్లేరుపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష జరుపుతానని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. కొల్లేరు అభివృద్ధికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుతో పాటు,

పనుల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ఆర్డీవోని నియమించాలని సూచించారు.
సరస్సు అభివృద్ధికి బృహత్ ప్రణాళిక
కొల్లేరులో పర్యాటకాభివృద్ధికి ప్రస్తుతం వున్న రహదారి మార్గాలను పటిష్ట పరిచి,

శాశ్వత ప్రాతిపదికన బృహత్ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. కొల్లేరును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని, వన్యప్రాణి సంరక్షణ-పర్యావరణ పరిరక్షణ చేస్తూనే పర్యాటకాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ప్రస్తుతం సరస్సులో వున్న రిసార్టులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకర్షించాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని చెప్పారు.

రుణం తీర్చుకుంటాం : ముఖ్యమంత్రితో కొల్లేరు రైతులు
తమ భూములను ‘కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ’ పరిధి నుంచి మినహాయించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రైతులు తాము రుణం తీర్చుకుంటామని చెప్పారు.

కొల్లేరువాసులకు మరింత న్యాయం చేస్తామని, పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు విస్తృత పరుస్తామని రైతులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సమావేశంలో మంత్రి పితాని సత్యనారాయణ,

ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, గన్ని వీరాంజనేయులు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర,

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here