సంపద సృష్టికర్తలు కార్మికులు, శ్రమజీవులే;సీఎం చంద్రబాబు

105

శ్రమ సమాజమే సమ సమాజానికి మూలమని, సంపద సృష్టికి మూలమైన శ్రమను గౌరవించడం అందరి కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర కార్మికులు, కష్టజీవులు, శ్రామికులకు ఆయన మే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షికాగో నగరంలో 8 పని గంటల సాధనలో కార్మికవర్గ విజయసంకేత స్ఫూర్తిగా నిర్వహించే మేడే అంతర్జాతీయ శ్రామికలోకానికి స్ఫూర్తి అని చంద్రబాబు అలన్నారు. దేశప్రగతికి పారిశ్రామికాభివృద్ధిని గీటురాయిగా భావిస్తారని, అలాంటి పారిశ్రామికాభివృద్ధికి బాటవేసేది కార్మికులు, కష్టజీవులేనని ఏపీ సీఎం అన్నారు. 2014 జూన్ 8న తమ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర కార్మికుల భవిష్యత్తుకు, భద్రతకు భరోసా కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
విప్లవాత్మకం చంద్రన్న బీమా
తాము తీసుకొచ్చిన చంద్రన్న బీమా పథకం విప్లవాత్మకమైనదని, రాష్ట్రంలో 2.57 కోట్లమందికి వర్తింపజేశామని చంద్రబాబు చెప్పారు. వీరిలో 7.77లక్షల మంది రైతుకూలీలేనన్నారు. ఈ ఏడాది 48,541దరఖాస్తులు అప్ లోడ్ చేయగా 45,416 సెటిల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దురదృష్ట వశాత్తు గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన కార్మిక, శ్రామిక కుటుంబాలవారికి చంద్రన్న బీమా పథకం వల్ల రూ.671 కోట్ల లబ్ది చేకూరిందని ముఖ్యమంత్రి తెలిపారు. గత నాలుగేళ్లలో 2.04 కోట్ల దరఖాస్తులు అప్ లోడ్ చేయగా,1.94 కోట్ల దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. (95%). చంద్రన్న బీమా వల్ల నాలుగేళ్లలో రూ.2,348కోట్ల ప్రయోజనం కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
వేతనాల పెంపు, ఆదరణ-2
కాంట్రాక్టు కార్మికులు, హోమ్ గార్డులు, అంగన్ వాడీల దగ్గర నుంచి అనేక వర్గాల వేతనాలను తమ ప్రభుత్వం పెంచిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. సహస్ర వృత్తుల సమస్త జీవులకు అండగా ఉండటానికే ఆదరణ-2 పథకం తీసుకొచ్చామని తెలిపారు. అంతరించి పోతున్న 125 కుల వృత్తులపై దృష్టిపెట్టి సంబంధితులకు నైపుణ్య శిక్షణ ఇచ్చామని 11 బీసీ ఫెడరేషన్లను బీసీ కార్పొరేషన్లుగా మార్చి అండగా నిలిచిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. ఆదరణ పథకం-2 ను ప్రవేశపెట్టి రాష్ట్రంలో మెగా గ్రౌండింగ్ మేళాస్ నిర్వహించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలకు రూ. 900 కోట్లు కేటాయించామన్నారు.
రూ.10 కోట్లతో డ్రైవర్ల సాధికార సంస్థ
రూ. 10కోట్లతో డ్రైవర్ల సాధికార సంస్థ నెలకొల్పుతున్నామని, ట్రాక్టర్లపై జీవిత కాల పన్ను తొలగింపు-అంగన్ వాడి, ఆశా వర్కర్లు,హోంగార్డులు,చిరుద్యోగుల వేతనాల పెంపు లాంటి నిర్ణయాలు కార్మిక సంక్షేమానికి ఉద్దేశించినవేనన్నారు. యువత ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు రాబట్టిన అంశాన్ని వివరిస్తూ గత ఐదేళ్లలో 3 పారిశ్రామిక సదస్సులు నిర్వహించామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మన రాష్ట్రానికి వరుసగా అగ్రస్థానం లభించడం తమ ప్రభుత్వ కృషేనని, ఉద్యోగులు, అధికారులు అందరూ కష్టపడటంతో రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. గత ఐదేళ్లలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడుల రాకకు మార్గం సుగమం చేశామని, 9 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించామని, 30 లక్షల ఉద్యోగాల కల్పనకు ఎంవోయూలు చేసుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కియా మోటార్స్, ఇసుజి, హీరో లాంటి ఆటోమొబైల్ పరిశ్రమలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ను దేశ పారిశ్రామికాభివృద్ధిలో ధీటుగా నిలబెట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములైన కార్మిక వర్గ సంక్షేమానికి తమప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here