శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై సిఎస్ సమీక్ష

62

ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సమీకరణ అంశంపై దేవస్థానం ఇఓతోపాటు దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దేవస్థానంలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు సంబంధించి దేవస్థానానికి చెందిన స్వంత నిధులతో పాటు ఇంకా అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చేపట్టిన పనులన్నిటినీ పూర్తి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని సిఎస్ ఇఓకు స్పష్టం చేశారు. ముఖ్యంగా శ్రీశైలం ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.అదేవిధంగా దేవస్థానం పరిధిలో పెద్దఎత్తున పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని ఇందుకు అటవీ, ఉద్యాన వన,గ్రామీణాభివృద్ధి శాఖల సహాయం తీసుకోవాలని అన్నారు.ఉపాధిహామీ పధకాన్ని ఇందుకు వినియోగించుకోవాలని,నర్సరీని స్థానికంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. శ్రీశైలం తరహాలోనే రాష్ట్రంలోని రెండు మూడు ప్రధాన దేవాలయాల్లో ఇదే తరహా అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు సిఎస్ దినేష్ కుమార్ సూచించారు. సమావేశంలో శ్రీశైలం దేవస్థానం ఇఓ నారాయణ భరత్ గుప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దేవస్థానంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల ప్రగతిని వివరించారు. ముఖ్యంగా దేవస్థానం పరిధిలో 331 కోట్ల 97 లక్షల రూ.లు అంచనాతో 15 ప్రాజెక్టులను చేపట్టగా ఇప్పటికే 8ప్రాజెక్టులను పూర్తిచేయగా మరో 6ప్రాజెక్టులు తుది దశకు చేరుకోగా మరో ప్రాజెక్టుకు టెండర్లు పిలవాల్సి ఉందని వివరించారు. ఇప్పటి వరకూ ఆయా ప్రాజెక్టులకు 126 కోట్ల రూ.లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.మిగతా ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసేందుకు ఇంకా 205 కోట్ల రూ.లు కావాల్సి ఉండంగా తక్షణ అవసరం కింద 80కోట్ల రూ.లు వరకూ అవసరం ఉందని తెలిపారు. చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రధానంగా షాపింగ్ కాంప్లెక్సు,తాగునీటి సరఫరా ఫధకం,పాతాల గంగ,పిలిగ్రిమ్స్ షెడ్డు,అంతర్గత రహదారులు, అవుటర్ రింగ్ రోడ్డు,200రూములతో కూడిన చౌల్ట్రీ,రాజగోపురం,మాడవీధులు,గోశాల,ఎల్ఇడి దీపాల ఏర్పాటు వంటివి చేపట్టడం జరిగిందని ఇఓ పేర్కొన్నారు. ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు,దేవాదాయశాఖ కమీషనర్ వైవి.అనురాధ,ఎపి అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజిమెంట్ లిమిటెడ్ ప్రతినిధులు ప్రకాశ్ గౌర్,విఎస్.రామన్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here