వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు షోకాజ్

21

వైకాపా ప్రభుత్వం పనితీరు, పార్టీ విధానాలను ప్రశ్నించిన నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు ఆ పార్టీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులో పేర్కొంది. వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసు జారీ చేశారు. అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందుకుగాను ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఇటీవలకాలంలో సొంత పార్టీ నేతలపై వరుసగా విమర్శలు చేస్తున్నారు. అలాగే పార్టీ విధివిధానాలు, ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల విషయంలో విమర్శలు చేశారు. ఇసుక విధానం, ఆంగ్ల మాధ్యమం, తిరుమల ఆస్తుల వ్యవహారం… ఇలా చాలా అంశాల మీద రఘు రామకృష్ణ రాజు మీడియా ఎదుట తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు, ఎంపీకి మధ్య విమర్శల పర్వం కొనసాగింది.
దీంతో ఈ వ్యవహారం సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లింది. అదే సమయంలో తనకు భద్రత ఇవ్వాలంటూ ప్రధానమంత్రి, హోం మంత్రి, పార్లమెంట్‌ స్పీకర్‌కు ఎంపీ లేఖ రాశారు. మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్‌ విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఎంపీ వ్యవహార శైలిలో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎంపీకి షోకాజ్‌ జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here