వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగ దీక్ష‌

15

నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేష‌న్ విష‌యంలో తెలుగుదేశం ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా, వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల *నిరుద్యోగ దీక్ష‌* ను ప్రారంభించారు. *అన్ని జిల్లా కేంద్రాల‌లో* దీక్షలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు… ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, నాలుగేళ్లయినా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం నిరుద్యోగులకు నమ్మక ద్రోహం చేసిన తెలుగు దేశం పార్టీకి.. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పనున్నామని హెచ్చరించారు.

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు *సలాం బాబు*, ఇంటికో ఉద్యోగం, నెల‌కు రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు, నిరుద్యోగులకు నమ్మకద్రోహం చేశాడని విమర్శించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న *2.12 లక్షల* ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజ‌య‌వాడ‌ ధర్నా చౌక్ లో విద్యార్థి సంఘం దీక్ష‌ల‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసుల వైఖరిపై మండిపడ్డ విద్యార్థి నేతలు, విజయవాడ వైసీపీ కార్యాలయంలో దీక్షను ప్రారంభించారు.

అనంతపురంలో వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం నేతలు తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించారు. దీనికి నిరసనగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద విద్యార్థి నేతలు ఆందోళన నిర్వహించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వందలాది మంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. బలవంతంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలను మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం పరామర్శించారు. పోలీసుల చర్యను నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ప్రారంభించిన నిరుద్యోగ దీక్ష‌ లకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు మద్దతుగా నిలిచారు. ఔట్ సోర్సింగ్ పోస్టులను టీడీపీ నేతలు అమ్ముకుని, అర్హులకు అన్యాయం చేశారన్న వైసీపీ నేతలు.. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here