వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు :తిరుమల జెఈవో

192

వేసవి సెలవులు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ అధికంగా వున్నందున, టిటిడిలోని  అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎండ వేడిమి నుండి ఉపశమనం కొరకు చలువ పందిళ్లు, భక్తులు నడిచే మార్గాలలో వైట్‌ పెయంట్‌, మాఢ వీధుల్లో తిరిగే భక్తులకు కాళ్లు కాలకుండా నీటి తుంపర్లు ఏర్పాటు, త్రాగునీరు, మజ్జిగ అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనాలు, సర్వదర్శనం, కాలినడక భక్తుల క్యూ లైన్లు, వి.క్యూ.సి2లలో భక్తులకు నిరంతరాయంగా శ్రీవారిసేవకులతో మజ్జిగ, పాలు, అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్ర, శని, ఆది వారాలలో ప్రోటోకాల్‌  వి.ఐ.పిలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.

తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ఉదయం ఆగమోక్తంగా ప్రారంభమయిందన్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకు కళాకర్షణ ద్వారా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి అవాహనంచేయనున్నట్లు తెలిపారు. ఈ కుంభంతో పాటు ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉంచి, గర్భగుడిలో స్వామివారికి జరుగు కైంకర్యాలన్ని యాగశాలలోని కుంభానికి నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్‌ 25న అష్టదిగ్భందనం, ఏప్రిల్‌ 26న మహాశాంతి హోమం, ఏప్రిల్‌ 28న మహాసంప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 27వ తేదీన ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భక్తులకు శ్రీవారి ఆలయంలో దర్శనం ఉండదన్నారు. కావున టిటిడి ఇంజినీరింగ్‌ విభాగం  ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 23వ తేదీ రాత్రి 10.00 గంటల నుండి శ్రీవరాహస్వామివారి గర్భా లయం, విమాన గోపురం, ఆలయంలో ఇతర మరమ్మత్తు పనులను రెండు రోజులలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

పాపావినాశనం మార్గంలో టిటిడి నూతనంగా నిర్మిస్తున్న వకుళామాత భవనం మరో 2 నెలలో భక్తులకు అందుబాటులోనికి రానున్నట్లు తెలిపారు. అదేవిధంగా మహిళా శ్రీవారి సేవకులకు కేటాయించిన పిఏసి-3లో మరమ్మత్తులు పూర్తి చేసి మే 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఇటీవల రూ. 70 కోట్లతో ఆమోదం పొందిన పిఏసి-5 పనులు త్వరిత గతిన ప్రారంభించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సి.ఇ. శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ -2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శ్రీవేణుగోపాల్‌ ,ఆరోగ్యశాఖ అధికారి డా|| శర్మిష్ఠ, డెప్యూటీ ఈవోలు శ్రీమతి పార్వతి, శ్రీమతి నాగరత్న, శ్రీ దామోదరం, విఎస్‌వో శ్రీ మనోహర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here