విశాఖ మెట్రో పనులుపై సీఎం సమీక్ష

44

విశాఖ మెట్రోను సాధ్యమైనంత త్వరగా చేపట్టి, వేగంగా పూర్తిచేసి విశాఖవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ, అమరావతి మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో విశాఖ మెట్రోపై సమీక్ష జరిపిన సీఎం మెట్రో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఇన్నోవేటివ్ పీపీపీ పద్దతిలో రూ. 8300 కోట్లతో మూడు కారిడార్లలో 42.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది. మొత్తం ప్రాజెక్టులో ప్రభుత్వం కీలకమైన ప్రజా మౌలిక సదుపాయాల కల్పన చేపట్టనుంది. రూ. 4200 కోట్లతో ఎలివేటేడ్ కారిడార్లు, స్టేషన్లు నిర్మించనుందని, ఈ మొత్తాన్ని అత్యంత తక్కువ వడ్డీకి వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించనున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంపికైన అభివృద్ధిదారు మిగతా రూ. 4100 కోట్లతో 5 ఏళ్ళలో మొత్తం 42.5 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం చేసి, 30 ఏళ్ళపాటు నిర్వహణ చేయనున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు. మెట్రో నిర్మాణం కోసం 5 కంపెనీలను షార్ట్ లిస్టు చేసినట్టు తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని, పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్‌కు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని, దానిని అభివృద్ధి చేసి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మెట్రో నిర్మాణానికి తీసుకున్న రుణాన్ని తీర్చవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. అనుమతులు పొందిన 60 రోజుల్లోగా టెండర్లు పిలవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here