వాట్సాప్‌లో ఈ మార్పులు వస్తున్నాయ్!

77

చిన్న వ్యాపారుల కోసం వాట్సాప్ ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. దీని పేరు వాట్సాప్ బిజినెస్.

ప్రస్తుతం ఈ యాప్‌ను అమెరికా, బ్రిటన్, ఇటలీ, ఇండోనేషియా, మెక్సికోలలో విడుదల చేశారు. భారత వినియోగదారులకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.

వినియోగదారులతో వ్యాపారపరమైన లావాదేవీలు, సంప్రదింపులు జరిపేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.

ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది.

భారతదేశంలో చిన్న సంస్థలు, వ్యాపారుల సంఖ్య చాలా ఎక్కువ. వీరికి వాట్సాప్ బిజినెస్ యాప్ ఒకరకంగా వెబ్‌సైట్‌లా పని చేస్తుంది.

ఈ బిజినెస్ యాప్‌లోని ప్రత్యేకతలను ఓసారి చూద్దాం..

బిజినెస్ ప్రొఫైల్ : వ్యాపార వివరాలను ఇక్కడ పొందుపరచవచ్చు. వెబ్‌సైట్, ఇ-మెయిల్, సంస్థ లేదా షాపు చిరునామా, మొబైల్ నెంబరు వంటి వాటిని అధికారికంగా ఇక్కడ పంచుకోవచ్చు.

మెసేజింగ్ టూల్స్: వినియోగదారులతో సంప్రదింపులకు ఈ టూల్స్ ఉపయోగపడతాయి. కస్టమర్లు తరచూ అడిగే ప్రశ్నలకు ఆటోమేటిక్‌గా సమాధానాలు ఇచ్చే సదుపాయం ఉంది. అలాగే హలో, హాయ్, వెల్‌కం అంటూ వినియోగదారులను పలకరించొచ్చు.

మెసేజ్ స్టాటిస్టిక్స్: ఎన్ని సందేశాలు పంపారు? ఎంత మందికి చేరాయి? ఎన్ని సందేశాలను చదివారు? వంటి గణాంకాలను ఈ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు.

వాట్సాప్ వెబ్: వాట్సాప్ బిజినెస్ యాప్‌ను కంప్యూటర్‌ ద్వారా వాడుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ధ్రువీకరణ: వాట్సాప్ బిజినెస్ యాప్ వినియోగించడం ప్రారంభించిన కొద్ది కాలం తరువాత అధికారికంగా ధ్రువీకరణ కూడా లభిస్తుంది. మొబైల్ ఫోను నెంబరు పక్కన ఆకుపచ్చ రంగులో టిక్ మార్క్ కనిపిస్తుంది.

వారికి అక్కర్లేదు

ఈ బిజినెస్ యాప్‌ను వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ యాప్ నుంచే సంప్రదింపులు జరపొచ్చు.

వారు అంగీకరిస్తేనే

వినియోగదారులతో వ్యాపారులు సంప్రదింపులు జరపడానికి, వారి అనుమతి అవసరమని గత ఏడాది టెక్నాలజీ వెబ్‌సైట్ టెక్‌క్రంచ్‌కు వాట్సాప్ వెల్లడించింది.

మిశ్రమ స్పందన

అమెరికాలో ఈ యాప్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. అకౌంట్ తెరచేటప్పుడు ఇ-మెయిల్, పాస్‌వర్డ్ వంటి భద్రతాపరమైన సదుపాయాలు లేవని కొందరు వ్యాపారులు తెలిపారు. ఇండోనేషియా, మెక్సికోలలో వ్యాపారులు సానుకూలంగా స్పందించారు.

ప్రస్తుతానికి ఉచితం

ప్రస్తుతం ఈ యాప్‌ను ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే భవిష్యత్తులో వ్యాపారుల నుంచి ఫీజు వసూలు చేసే ఆలోచన ఉన్నట్లు వాట్సాప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్ ఇడేమా గత ఏడాది సెప్టెంబరులో వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here