లూలూ గ్రూప్’పై అంతా అసత్య ప్రచారమే .. ఎటువంటి అధికారిక ప్రకటన లేదు..మంత్రి మేకపాటి

17

గత ప్రభుత్వంలో ఒప్పందాలు కుదిరి విశాఖపట్నంలో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటళ్లపై పెట్టుబడులు పెట్టాలనుకున్న లూలూ గ్రూప్ భవిష్యత్ లో పెట్టుబడులు పెట్టదని ప్రకటించినట్లు మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. పత్రికాప్రకటన, మెయిల్ వంటి అధికారిక ప్రకటనలు లేకుండా జరుగుతున్న అసత్య కథనాలు, ప్రచారాన్ని మంత్రి ఖండించారు. గత ప్రభుత్వం హయాంలో 2018 ఫిబ్రవరిలో లూలూ ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు. ఆ లూలూ ప్రాజెక్టుకు కేటాయించిన 13.83 ఎకరాల భూమి కేసుల్లో ఉందని, న్యాయపరమైన చిక్కులున్న భూమిని అప్పగించడంపై నాటి ఏపీఐఐసీ ఎండీ రాసిన లేఖను గురించి మంత్రి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మొదటి నుంచి చెబుతున్నట్లు పారదర్శక పాలనకే పెద్దపీట వేస్తున్నామన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ప్రచారాలు, కథనాలు రాసినా అబద్ధాలు నిజం కాబోవన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. తప్పును తప్పని చెప్పకుండా అదే తప్పుదారిలో వెళ్లడం సరైంది కాదని, అందుకే గత ప్రభుత్వంలోని ఇష్టారీతిన జరిగిన లోపాయికారి ఒప్పందాలను నేరుగా ప్రజలముందుంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సచివాలయంలోని ప్రచారవిభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..లూలూ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని మంత్రి వివరించారు. లూలూతో ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసుకోవడానికి బిడ్డింగ్ లో పారదర్శకత లేకపోవడం మొదటి కారణం కాగా, లూలూకు కేటాయించిన భూమి చాలా విలువ ఉన్నా.. అది చాలా తక్కువ ధరకే అప్పగించడం ప్రజాధనం వృథా చేయడంగా భావించి లూలూతో రద్దు చేసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. లూలూకు కేటాయించిన భూమికి మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుత ధర ఎకరాకు సుమారు రూ. 40-42 కోట్ల వరకూ ఉంటుందని మంత్రి తెలిపారు. అంత విలువైన భూమికి సరిగ్గా లెక్కేస్తే గత ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఒక్కో చదరపు అడుగుకు 5 రూపాయలు కూడా రాదని మంత్రి వ్యాఖ్యానించారు. తక్కువ ధరకే అద్దెకు ఇవ్వడం కారణంగా సుమారు 500 కోట్లపైనే ఏడాదికి ప్రజాధనం వృథా అవుతుందనే కోణంలో ఆలోచించి తమ ప్రభుత్వం లూలూతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టును రద్దు చేసుకుందని మంత్రి మేకపాటి వివరించారు. గత ప్రభుత్వం రూ.2200 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని పత్రికల్లో వార్తలకోసం చేసిన ఆర్భాటపు ప్రచారాల వల్లే ఇదంతా జరిగిందన్నారు మంత్రి. గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం చేసుకుని తర్వాత కూడా అదే ప్రభుత్వం సంవత్సరకాలం వరకూ పాలన కొనసాగినా లూలూ ఏ పనులు చేపట్టకపోయినా చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. ఇదంతా కేవలం గత ప్రభుత్వ తప్పిదం, నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. ఏపీఐఐసీలో ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ ఉందని, అది వినియోగించుకుని అధునాతన భవనాలు నిర్మించగలమని మంత్రి హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్స్ ఉదాహరణగా చెప్పారు.

*‘వీరా వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్’తో ఒప్పందం*

రూ. 1000 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ అయిన ‘వీరా వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్’ అనంతపురంలో రాబోతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఒప్పందం పూర్తయిందని మంత్రి తెలిపారు. 120 ఎకరాల్లో ఏర్పాటు కానున్న మానుఫాక్చరింగ్ యూనిట్ లో ఏడాదికి 3వేల ఎలక్ట్రిక్ బస్సులు తయారు కానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం కోల్పోని విధంగా చాలా తక్కువ మొత్తాన్ని ప్రోత్సహకాలుగా ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్ రాయితీలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనలో కూడా పరిమితులకు లోబడి ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

*గమనిక : పత్రికా ప్రకటనకు సంబంధించిన ఫోటోలు జతచేయడమైనది.*

*జారీ చేయువారు: పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here