రైల్వే ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌

 

రైళ్లల్లో తరచుగా చోరీలు, దాడులు, ఆకతాయిల ఆగడాలతో ప్రయాణికులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమ రైల్వే జోన్‌ కేంద్రస్థానమైన ముంబయిలో గవర్నమెంటు రైల్వే పోలీసులు(జీఆర్పీ) ఓ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సర్వీసు ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉందని వారు తెలిపారు.

రైళ్లల్లో, రైల్వే ప్లాట్‌ఫారాలపై జరిగే నేరాలను అరికట్టేందుకు 1512 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను వారం రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నట్లు స్థానిక జీఆర్పీ అధికారి ఒకరు తెలిపారు.

కదులుతున్న రైల్లో ప్రయాణికులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే వారు 1512కి ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే చాలు. రైలు తదుపరి స్టేషన్‌కు చేరుకునే సమయానికి అక్కడ పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఈ సర్వీసు దేశంలో పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. రైళ్లల్లో నేరాలను తగ్గు ముఖం పట్టించాలన్న ఉద్దేశంతోనే ఈ హెల్ప్‌లైన్‌ నంబర్‌ని తీసుకువచ్చినట్లు అధికారి వివరించారు.

జీఆర్పీలో ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ ఈ సర్వీసును విజయవంతంగా నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది దోపిడీ కేసులు 35శాతం తగ్గాయని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *