రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం;మంత్రి మోపిదేవి

103

రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని మార్కెటింగ్, పశు, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనతికాలంలోనే సంక్షేమ పథకాల అమలు, రైతులను ఆదుకునే విప్లవాత్మకమైన మార్పులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు రైతుల సమస్యలను అధిగమించేందుకు ఆలోచన చేస్తూ ప్రత్యేక అజెండాను రూపొందిస్తున్నారన్నారు. గడిచిన నాలుగు నెలల్లో ప్రతినెలలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు సమీక్షలు నిర్వహించిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరల కోసం ఇప్పటికే రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు అందులో వీలుకాని శనగ, టమాటా, ఉల్లి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరిష్కార మార్గాలను చూపిస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా రాయలసీమలోని 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లో శెనగ పంట వేసి నష్టపోయిన 5 ఎకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ. 45 వేల చొప్పున అదనపు ఆర్థిక సహాయం అందించిన ఘనత ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 వేల మంది శనగ రైతుల వివరాలను పరిశీలించి 30 వేల మంది రైతులకు ఇప్పటికే రూ.75 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. మరో 28 వేల మంది రైతులకు త్వరలో నష్టపరిహారం అందించనున్నామని పేర్కొన్నారు. ఈ-క్రాఫ్ బుకింగ్ విధానం చేసుకోవడానికి వీలులేని శనగ రైతులు వేరొక పంట పేరుతో సాగు చేసి గోదాములలో పంటలను నిల్వ చేసుకొని ధరలు లేక ఇబ్బందిని ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. పలువురు రైతులు గిట్టుబాటు ధరలు లేక సమస్యలు పడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో వెంటనే వారికి ఈ-క్రాఫ్ బుకింగ్ విధానంతో సంబంధం లేకుండా గోదాముల్లో నిల్వ చేసుకున్న పంటలను పరిశీలించి వాటికి గిట్టుబాటు ధరలతో సంబంధం లేకుండా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు.ఇటీవల మార్కెట్లో ఉల్లిధరలు అమాంతంగా పెరిగిపోవడం, దళారులు కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మహారాష్ట్ర, కర్నూలు జిల్లాలనుంచి 32 రూపాయలకు ఉల్లిని కొనుగోలు చేసి 85 రైతులబజార్ల ద్వారా ప్రజలకు కేవలం 25 రూపాయలకే అందించారన్నారు. దీని వలన ప్రభుత్వంపై రూ.2 కోట్ల అదనపు భారం పడిందని పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా పత్తికొండలో దళారుల వ్యవస్థ వల్ల టమాట ధరలు పడిపోయిన విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మార్కెట్ విభాగాల ద్వారా కొనుగోలు చేసి తిరుపతి, ఆదోని, పలు ప్రాంతాల్లో వినియోగదారులకు 11 రూపాయలకే అందించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. దళారీ వ్యవస్థ ద్వారా రైతులు నష్టపోకుండా ఉండేందుకు మినుములు, పెసలు, శనగలు వంటి పంటల నష్టనివారణకు రూ.100 కోట్లు నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. మార్క్ ఫెడ్ ద్వారా గోదాముల్లో నిల్వ చేశామన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల సుబాబుల పంట వేసిన రైతులకు దళారీ మోసం చేసి వెళ్లిపోవడంతో రైతులకు ఏడున్నర కోట్లు అందించి ఆదుకున్నామన్నారు. క్రమశిక్షణతో తమ ముఖ్యమంత్రి ఆర్థిక రంగం ప్రక్షాళన చేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణన్నారు. గత ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినప్పటికీ రూ.5 కోట్లుకూడా ఖర్చు చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు. అస్తవ్యస్థ పరిపాలనతో అదుపుతప్పిన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కూరగాయలు, పండ్లతోటలు డీ నోటిఫై చేయడం వలన మార్కెట్ యార్డుకు గతంలో వచ్చిన దళారీవ్యవస్థల వలన రైతులు నష్టపోయారని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం పంటల నిర్ధిష్ఠ ప్రణాళికతో వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపడుతోందన్నారు.అవసరమైతే పీపీఏ విధానంలో రైతులకు మేలు చేసే విధానాలను ఆలోచన చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో సీసీఎల్ఏ ప్రత్తి కొనుగోళ్ల అంశంలో జరిగిన అవినీతిపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందని తెలిపారు. మార్కెట్ యార్డుల ద్వారా అధికారులే స్వయంగా రైతుల వద్దకు వెళ్లి ప్రత్తి కొనుగోళ్లు చేసేలా చర్యలు చేపడతామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here