రైతులకు భరోసా ఇచ్చే విధంగా వైఎస్సార్ రైతు దినోత్సవం!

98

రైతులకు భరోసా ఇచ్చే విధంగా జులై 8న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ మిషన్ ఏర్పాటుపై శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం మీడియాతో మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి కార్యక్రమంగా వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించే రైతు దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోమోహన్‌రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. తొలిసారి జరిగిన అగ్రికల్చర్‌ మిషన్‌ సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. ప్రతినెలా విధిగా సమావేశం అవ్వాలని, రైతు సంబంధింత అంశాలను చర్చించాలని అధికారులకు సూచించారన్నారు. మూడు వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇది అగ్రికల్చర్‌ మిషన్‌ పరిధిలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

గతంలో రైతుల మార్కెటింగ్‌ అంశాన్ని పూర్తిగా విస్మరించారని, రూ.2000 కోట్లతో ఏర్పాటు చేసే విపత్తు సహాయ నిధి కూడా ఈ మిషన్‌ పరిధిలోనే ఉండాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయిల్‌పామ్‌ రైతులకు తెలంగాణ తరహాలోనే చెల్లింపులు చేపడతామని.. పొగాకు, కొబ్బరి రైతులను కూడా ఆదుకుంటామని పేర్కొన్నారు. నాఫెడ్‌ కొనుగోలు చేసే కొబ్బరి మార్కెట్‌ సెస్‌ను రద్దు చేశామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి మాట్లాడుతూ కౌలు చట్టంలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అందులో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. అవసరం అయితే చట్ట సవరణ చేస్తామని, భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉందని నాగిరెడ్డి తెలిపారు. భూ యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా ఈ చట్టం తీసుకువస్తామని ఆయన తెలిపారు. సహకార రుణాలు సక్రమంగా అందించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకులు రైతుల మీదకు ఒత్తిడి తేకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేలా 60 శాతం ఫీడర్ ల ఆధునీకరణ చేస్తామన్నారు. ఇందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. త్వరలోనే రైతు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అదే విధంగా నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తామన్నారు.గతంలో నామినేట్ చేసిన వ్యక్తులే రద్దు చేసినప్పటికీ కొనసాగుతున్నారన్నారు.

విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ను ఓ లాబ్ ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారని నాగిరెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. వచ్చే సీజన్ కు విత్తన సరఫరా కు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు అమల్లోకి రాబోతున్నాయని వెల్లడించారు.

ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం లో మంత్రులు కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, శాఖాధికారులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here