రైతులకు కావలసిన సమయం లో విద్యుత్ సరఫరా !

రైతుల అభీష్టం మేరకు వారికి కావలసిన సమయం లో విద్యుత్ పంపిణి ఒకటి లేదా రెండు షిఫ్ట్ ల ద్వారా పగలైనా సరే పంపిణీకి సిద్ధంగా వుండాలని ఆంద్రప్రదేశ్ శాసన మండలి కమిటీ ఆన్ పేపర్స్ లెయిడ్ ఆన్ ది టేబుల్ చైర్మన్ వై వి రాజేంద్రప్రసాద్ అన్నారు.మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రంలో ఏ పి ఎస్ పి డి సి ఎల్ పరిధి లోని 8 జిల్లాలలో విద్యుత్ పంపిణీ ఆడిట్ రిపోర్ట్ ల పై కమిటీ చర్చించింది.ఈ సందర్భం గా చైర్మన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు విద్యుత్ ఆదా కు చేపట్టిన చర్యలను వివరించమని అధికారులకు సూచించారు.

ఎస్ పి డి సి ఎల్ డైరెక్టర్ టి. పుల్లారెడ్డి వివరిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా 24 గంటలు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయానికి 7 గంటలు నిరంతరంగా అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ పంప్ సెట్లు ఎస్ పి డి సి ఎల్ పరిధి లో 13,62,710 ఉన్నాయని, కాలం చెల్లిన పంప్ సెట్లకు ఉచితంగా మార్పిడితో పాటు కొత్త కనెక్షన్ లకు రూ. 3,30,000 విలువ గల సోలార్ పంప్ సెట్లు రూ.55 వేలకే అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఆదా కోసం ఇప్పటికే ప్రతి ఇంటికి ఎల్ ఇ డి బల్బ్ లు 2 వంతున ఎస్ సి, ఎస్ టి లకు 4 వంతున 9 వోల్ట్ బల్బ్ లను అందించామని తెలిపారు. చైర్మెన్ మాట్లాడుతూ ప్రతి పంచాయతిలో పంచాయతి రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఎల్ ఇ డి వీధి దీపాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఎస్ పి డి సి ఎల్ ప్రతి గ్రామంలో 3వ వైర్ వేయించాలని సూచించారు. పంచాయతి పాత బకాయిలు రూ.2,200 కోట్లను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుతం పక్కన పెట్టి, 2017 ఏప్రిల్ మాసం నుండి ప్రతి పంచాయతి సర్పంచ్ పంచాయతి బిల్లులను చెల్లించాలని అన్నారు. ఆడిట్ రిపోర్ట్ మండలికి, శాసన సభకు 2015-16 వరకు సమర్పించారని 2016 – 17 ను త్వరగా సమర్పించాలని సూచించారు.ఈ సమీక్షలో సభ్యులైన శాసన మండలి సభ్యులు పి.చలపతిరావు, ఎస్పిడిసిఎల్ ఇడి ప్రాజెక్ట్ వనజ, సిఇ నంద కుమార్, నరేగా కౌన్సిల్ సభ్యులు సింగంశెట్టి సుబ్బరామయ్య, ఎస్ పి డి సి ఎల్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *