రివ్యూ: ‘హైపర్’ సూపర్!

81

001 copy
తారాగణం: రామ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ, సుమన్, ప్రభాస్ శ్రీను, తులసి, షాయాజీ షిండే, కె.విశ్వనాథ్, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: జీబ్రాన్, మణిశర్మ(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్)
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
నిర్మాతలు: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంతోష్ శ్రీన్ వాస్
రేటింగ్: 3
రామ్ ను కరెక్ట్ గా వాడుకుంటే అతనిలో ఎంత ఎనర్జీ వుంటుందో గతంలో వచ్చిన రెడీ, కందిరీగ సినిమాలు రుజువు చేశాయి. అలాగే అతనితో దర్శకుడికి కావాల్సినట్టు చేయించుకుంటే… ఎలాంటి హిట్టు కొట్టొచ్చో ‘నేను శైలజ’తో నిరూపించాడు. పూర్తిగా ఎలాంటి ఓవర్ యాక్షన్ సీన్స్ లేకుండా చేసిన సినిమా ఇది. అందుకే నేను శైలజ మూవీకి ముందు రామ్ నటించిన సినిమాలన్నీ ఓ ఎత్తైతే… నేను శైలజ మూవీ నుంచి రామ్ నటించిన సినిమాలు ఓ ఎత్తని చెప్పొచ్చు. ఏమాత్రం ఓవర్ యాక్షన్ లేకుండా ‘నేను శైలజ’ చిత్రంలో నటించేశాడు రామ్. తనలో వున్న ఎనర్జీని కేవలం నటన కోసమే ఉపయోగించడంతో.. ఆ సినిమా ఓ ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది. ఆ సినిమా తరువాత ‘హైపర్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడంటే… మళ్లీ రామ్ తన పూర్వపు నటనతో విసిగిస్తాడేమో అనుకున్నారంతా. ట్రైలర్లో నాన్న మీద అతి ప్రేమ చూపించే కుమారునిగా చూపించినా.. పాటలు.. ఫైటింగులు చూసి.. రొటీన్ సినిమానే అనుకున్నారంతా. అయితే.. ఇంటర్వూల్లో మాత్రం.. ఇందులో ఓ మంచి మెసేజ్ వుంటుంది… అది తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హైపర్’ మూవీలో ఎలాంటి మెసేజ్ వుందో… దానికి ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అయ్యారో తెలుసుకుందాం పదండి.

కథ: నాన్న మీద అతిగా ప్రేమను చూపించే సూర్య(రామ్).. తన తండ్రిని గజ(మురళి శర్మ) అనే వ్యక్తి కాపాడటంతో అతనితో స్నేహం చేసి.. అతనికి సహాయపడుతుంటాడు. అలానే తన తండ్రి(సత్యరాజ్) ఓ అమ్మాయిని(రాశి ఖన్నాను) చూసి.. ఈ అమ్మాయి ఎవరి ఇంటికి కోడలు అవుతుందో.. చాలా లక్షణంగా వుంది అనగానే… ఆమెను కోడలుగా తీసుకొచ్చేయడానికి ప్రేమలో పడతాడు. ఇలా తండ్రికోసం ఏమైనా చేసే సూర్య… తండ్రిని కొంత మంది ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తన తండ్రిని వారు ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు? అతని నుంచి వారేమి ఆశిస్తున్నారు? వారి నుంచి తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా కథ.

కథ..కథనం విశ్లేషణ: హైపర్… అనగానే ఇదో రొటీన్ స్టోరీ.. అవే ఫైటింగులు.. అవే పాటలు… అదే ఓవర్ యాక్షన్ వుంటుందనుకున్నారంతా. తండ్రి మీద అతి ప్రేమను చూపించే కొడుకు అంటే… ఇదేదో తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ వుండే స్టోరీ అయివుంటుంది అనుకున్నారు. అయితే.. సినిమా ఓ అరగంట చూసిన తరువాత ఇవేవీ కాదని తెలిసిపోతుంది. మొదట అరగంట ఏమాత్రం రుచించని సీన్లతో విసుగు తెప్పించినా… రావు రమేష్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోతుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి ఎదురు తిరిగితే.. ఎలా వుంటుందో అనే విషయాన్ని దర్శకుడు ఓ చక్కటి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీయడం నిజంగా అభినందనీయం.
గతంలో కరప్షన్ కి వ్యతిరేకంగా చాలా సినిమాలే వచ్చాయి. అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి. ప్రేక్షకులకు నచ్చేలా ఇదే పాయింట్ ను తీసుకుని మళ్లీ ఓ చక్కటి కథనంతో ముందుకు తీసుకు వెళ్లాడు దర్శకుడు. తను నమ్ముకున్న నిజాయతీతో కడదాకా వుండాలనే తండ్రి… అలాంటి వ్యక్తికి స్వార్థ పరులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా… వారి నుంచి కాపాడే కొడుకు… ఇలాంటి కథ..కథనాలు చివర దాకా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూసేలా చేశాయి. రభసతో ఫ్లాప్ అందుకున్న దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్… మళ్లీ తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ‘హైపర్’ను ఎలాంటి ఓవర్ లేకుండా చక్కగా తెరకెక్కించాడు. అక్కడక్కడా రొటీన్ మాస్ మసాలా అంశాలున్నా… ప్రధాన స్టోరీ ముందు ప్రేక్షకులకు గుర్తుండవు.
రామ్ మరోసారి తన ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ చూపించాడు. నేను శైలజ మూవీలో కొంత మాస్ ఎలిమెంట్స్ కి దూరంగా వున్నా… ఇందులో మాత్రం ఆ అంశాలను టచ్ చేస్తూనే.. తన నటనతో ఆకట్టుకున్నాడు. పాటలు.. ఫైటింగు లాంటి రొటీన్ అంశాలున్నా… సత్యరాజ్ తో కలిసి రామ్ నటించిన సీన్లన్నీ హైలైట్. ఇక సత్యరాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే. ఓ సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగిగా.. చక్కగా నటించాడు. ఇందులో సత్యరాజ్ పాత్రే హైలైట్. రావు రమేష్ తో గానీ.. సాయాజీ షిండేతో గానీ.. ప్రభుత్వం ఉద్యోగి సంతకం గొప్పదనం గురించి చెప్పే సంభాషణలు చిత్రానికే హైలైట్. రావు రమేష్ విలన్ గా చాలా బాగా నటించాడు. ఇగో వున్న పొలిటీషియన్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అలాగే మురళీ శర్మ పాత్ర కూడా కీలకమైనదే. కొడుకు గొప్పదనం గురించి తండ్రి వద్ద చెప్పే సీన్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది.
దర్శకుడు రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లకుండా ఏదైనా మెసేజ్ ఇవ్వాలని భావించి.. ఈ కథను తెరకెక్కించడం బాగుంది. కథనం కూడా బాగా రాసుకోవడంతో ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇందులో సత్యరాజ్ పాత్ర… జనతా గ్యారేజ్ లో రాజీవ్ కనకాల పాత్రను పోలి వుంటుంది. అందులో ఆ పాత్రకు ఎంతగా అప్లాజ్ వచ్చిందో… ఇందులో కూడా సత్యరాజ్ పాత్రకు అంతే అప్లాజ్ రావడం ఖాయం. అబ్బూరు రవి రాసిన సంభాషణలు ఈ పాత్రకు ప్రాణం పోశాయని చెప్పొచ్చు. కర్షన్ పై మరోసారి మంచి సంభాషణలు రాశాడు. ప్రభుత్వ ఉద్యోగులే అవినీతికి వ్యతిరేకంగా పాలకులపై పోరాడటం అనే కాన్ సెప్ట్ కి సంభాషణలు కూడా తోడు కావడం ప్లస్ అయింది. జీబ్రాన్ సంగీతం అంతంత మాత్రంగానే వుంది. ఓ రెండు పాటలు మినహా… మిగతావన్నీ బోరింగ్. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here