రివ్యూ: రజినీకాంత్ ‘కాలా’

425

తారాగణం: రజినీకాంత్, నానా పటేకర్, హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావు, సముద్ర ఖని, షాయాజీ షిండే, సంపత్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్
నిర్మాత: ధనుష్
కథ: ఫా.రంజిత్, అధవన్ ధీచన్య
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పా.రంజిత్

సూపర్ స్టార్ రజినీకాంత్… కబాలి చిత్రం తరువాత పా.రంజిత్ దర్శకత్వంలో మరోసారి వరుసగా నటించిన చిత్రం ‘కాలా’. కబాలి కొంత నిరాశ పరిచినా… పా.రంజిత్ కు మరో అవకాశం ఇచ్చి నటించారు సూపర్ స్టార్. కాలా టైటిల్ కి మంచి స్పందన రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందులోనూ పట్టణ పేదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మొదలుకొని, టీజర్, ట్రయిలర్స్ దాకా అన్నీ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. దాంతో అటు అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ‘కాలా’ మెప్పించాడో లేదో చూద్దం పదండి.

కథ: ముంబైలో వుండే అతి పెద్ద స్లమ్ ధారావి. ఆ స్లమ్ స్థలం విలువ సుమారు రూ.40వేల కొట్లు పైమాటే. అందులో నివసించే పేదలకు పెన్నిధిగా వుంటాడు కాలా. అయితే ప్యూర్ ముంబై పేరుతో ఆ స్లమ్ ను తొలగించి.. అక్కడ నివసించే వారికి ఓ చిన్న పాటి అపార్టు మెంటు గదులు నిర్మించి.. మిగతాది తాను ఆక్రమించేసుకోవాలనుకుంటాడు ముంబైలో పేరు మోసిన రాజకీయ నాయకుడు హరి దాదా(నానా పటేకర్). అయితే కాలా అందుకు ఒప్పుకోడు. స్లమ్ లో నివసించడమే బాగుందని… ఆ స్థలాన్ని ఖాళీ చేసేది లేదని తెగేసి చెబుతాడు. దాంతో కాలా.. హరి దాదాల మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. ఈ వార్ లో ఎవరిది పై చేయి అయింది.. ధారావి స్లమ్ ను ఖాళీ చేయించారా? లేదా? అనేదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: పా.రంజిత్ మరోసారి తనకు పేదల పట్లవున్న కమిట్ మెంట్ ను ‘కాలా’లో చూపించారు. పట్టణాల్లో మురికివాడల్లో నివసించే పేదలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుంటారు.. వారి జీవన విధానం ఎలా వుంటుందో అనేదాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. అలానే మురికి వాడలపై రాజకీయనాయకుల కన్ను ఎంతలా వుంటుందనేది కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు. అందులోనూ ముంబైలాంటి హార్ట్ ఆఫ్ ది సిటీలో వుండే ధారావిలాంటి స్లమ్ పై పొలిటీషియన్స్ కన్ను ఏ విధంగా వుంటుంది.. దాన్ని ఆక్రమించుకోవడం కోసం ఏందాకైనా వెళ్లడానికి వెనుకాడరనే దాన్ని చాలా బాగా చూపించారు. బస్తీ జీవన విధానం.. అందులో నివసించే బస్తీ నాయకునిగా రజినీకాంత్ పాత్రను చాలా చక్కగా తెరమీద చూపించారు పా.రంజింత్. రజినీకాంత్ చెప్పినట్టు ఇందులో కమర్షియల్ ఎలిమెంట్లు ఏమీ లేవు. కానీ.. హృదయాన్ని తాకే స్లమ్ జీవిత విధానం మనసును తాకుతుంది. స్లమ్ ఎంత అసౌకర్యంగా వున్ననూ.. వారి మధ్య వుండే బంధాలు.. బంధుత్వాలను ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా తెరమీద చూపించి సక్సెస్ అయ్యాడు పా.రంజిత్. ఎక్కడా హీరోయిజం అనే మాట తలెత్తకుండా… రజినీ హై ఓల్టేజ్ పెర్ ఫార్మెన్స్ ను అక్కడక్కడ ఎలివేట్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్ కూడా రొటీన్ కి భిన్నంగా ముగించడం బాగుంది.

రజినీకాంత్ అంటే.. మాస్.. క్లాస్ ప్రేక్షకులను మెప్పించే భారీ డైలాగులు.. ఫైట్లు వుంటాయని ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ ఇందులో ఓ ఫైట్ తప్ప.. మిగతాదంతా ఎమోషన్స్ తోనూ సాగిపోతుంది. కాలా పాత్రలో రజినికాంత్ చూపించిన పెర్ ఫార్మెన్స్ అదుర్స్. అరవై ఏళ్లు పైబడిన పాత్రలో చక్కగా నటించారు. అతనికి జోడీగా నటించిన ఈశ్వరీరావు కూడా భార్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమెతోనే బోలెడన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ను పండించారు దర్శకుడు. అలానే హీరోకు బ్యాగ్రౌైండ్ లో లవర్ గా.. ఆ తరువాత పేదల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలిగా హ్యూమా ఖురేసీ నటన.. ఆమె హావభావాలు బాగున్నాయి. నానా పటేకర్ హరిదాదా పాత్రలో చూపించిన పెర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రజినీకాంత్.. నానా పటేకర్ల మధ్య వచ్చే సీన్స్.. సంభాషణలు హైలైట్. అలానే సాయాజీ షిండేతో పోలీస్ స్టేషన్లో తీసిన సీన్ చిత్రానికే హైలైట్. సంపత్ కాసేపు వున్నా.. చక్కగా నటించారు. ఇంకా రజినీ కాంత్ కుమారుని పాత్రలో నటించిన ఇద్దరూ బాగా నటించారు. దర్శకుడు సముద్ర ఖని.. రజినీకాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్లో అక్కడక్కడ కామెడీ చేస్తూ మెప్పించారు.

పా.రంజిత్.. మరోసారి పట్టణ పేదల బతుకు చిత్రాన్ని వెండితెరమీద చక్కగా ఆవిష్కరించారు. మురికి వాడల్లో నివసించే వారి మధ్య వుండా బాంధవ్యాలు చక్కగా చూపించారు. తనలో వున్న రైటర్ కు పదును పెట్టి రాసుకున్న కథ.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా రాసుకున్న ఈ కథ.. అతని కెరీర్లో ఓ మంచి మైలురాయిగా మిగిలిపోతుంది. అయితే స్లో నెరేషన్ కారణంగా అక్కడక్కడా కొంత బోరింగ్ అనిపిస్తుంది. అలానే రజినీకాంత్ ను చాలా చోట్ల క్యారెక్టర్ ఆర్టిస్టులాగా చూపించారు. కొన్ని చోట్లైనా హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చూపించి వుంటే బాగుండేది. రజీనికాంత్ అన్నట్టు ఇది కొంత వరకు ఆర్ట్ ఫిలిం లానే వుంటుంది. సంగీతం ఈ చిత్రానికి పెద్ద మైనస్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. స్లమ్ ను బాగా చూపించారు. అలానే ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. స్లమ్ సెట్టింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువవలు బాగున్నాయి. రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ ఖర్చు బాగా పెట్టేశారు. ఓవరాల్ గా ‘కాలా’ రజినీకాంత్ చిత్రాల్లోకెల్లా భిన్నమైన చిత్రం. తప్పక చూడాల్సిందే.

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here