రివ్యూ: ప్రేక్షకులకు ‘తిక్క’ పుట్టడం ఖాయం

233

తారాగణం: సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనెస్, మన్నారా చోప్రా, సప్తగిరి, వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్, రఘుబాబు, అజయ్, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: థమన్
స్క్రీన్ ప్లే-కథ: షేక్ దావూద్
నిర్మాత: రోహిన్ రెడ్డి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సునీల్ రెడ్డి
రేటింగ్: 1.5/5
వరుస సినిమాలతో దూసుకుపోతున్న సాయిధరమ్ తేజ్… తిక్క సినిమాతోనూ హిట్టు అందుకుంటాడనే టాక్ వినిపించింది. సుబ్రమన్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలు వరుసగా హిట్టయ్యాయి. తిక్క కూడా హిట్ అయ్యి హ్యాట్రిక్ అందుకోవాలనుకున్నాడు సాయిధరమ్ తేజ్. అలాగే సునీల్ రెడ్డి కూడా తన మొదటి సినిమా ఓం త్రీడీ సినిమా ఫ్లాప్ కావడంతో.. తిక్కతోనైనా విజయం సాధిద్దాం అనుకున్నాడు. మరి వీరిద్దరి అంచనాలను ‘తిక్క’ మూవీ ఏమాత్రం నెరవేర్చిందో చూద్దామా?
కథ: ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. స్నేహితులతో జాలీగా గడిపేసే ఆకతాయి కుర్రాడు ఆదిత్య(సాయిధరమ్ తేజ్). కనిపించిన అమ్మాయిలందరినీ ప్రేమించేస్తుంటాడు. అయితే ఎవరితోనూ కంటిన్యూ కాడు. అలాంటి కుర్రాడి కారును అంజలి(లారిస్సా బోనెస్) యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్లో తన కారు డ్యామేజీ అయినా.. దాన్ని చేసింది అందమైన అమ్మాయి కాబట్టి.. ఆమెను తొలిచూపులోనే ప్రమించేస్తాడు ఆదిత్య. అంజలి కూడా ఆదిత్యను ప్రేమిస్తుంది. అయితే ఓ అనుకోని సంఘటన వల్ల అంజలి తన ప్రేమకు బ్రేకప్ చెబుతుంది. దాంతో ఆదిత్య విషం తాగా ఆత్మహత్య చేసుకోవాలనుకంటాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతు అతన్ని పోలీసులు అరెస్టు చేయడానికి ఇంటికి వస్తారు? మరి అతన్ని పోలీసులు అరెస్టు చేశారా? అతను తాగింది విషమేనా? చివరకు అంజలితో తన ప్రేమను గెలిపించుకున్నాడా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ..కథనం విశ్లేషణ: కథ.. కథనం కుదిరితే సాయిధరమ్ తేజ్ ఎలా రెచ్చిపోతాడు ఇంతకు ముందు వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలను చూస్తే అర్థం అవుతుంది. అవేవీ కురనప్పుడు ఎలా తేలిపోతాడో రేయ్ సినిమా చూస్తే తెలిసిపోతుంది. అలాంటి రేయ్ సినిమా కోవకు చెందినదే ‘తిక్క’ సినిమా కూడా. ఏమాత్రం కథను తయారుచేసుకోకుండా… పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకోకుండా కేవలం కామెడీ పేరుతో వండి వార్చిన నాసిరకం మూవీ తిక్క. అసలే ఫ్లాపుతో వున్న సునీల్ రెడ్డి… తన రెండో సినిమాతోనైనా ఇండస్ట్రీలో నిలదొక్కుంటాడేమో అనుకున్నారంతా. కానీ ఈ చిత్రం అంతకు ముందు కళ్యాణ్ రామ్ తో తీసిన ఓం త్రీడీ మూవీ కంటే.. అధ్వాన్నంగా తెరకెక్కించాడు. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు… ఆంగ్లంలో వచ్చిన ‘హ్యాంగోవర్’ చిత్రంలోని మెయిన్ పాయింట్ ను తీసుకుని కథను అల్లుకున్న ఈ ‘తిక్క’ మూవీని చూసిన ప్రేక్షకుల పరిస్థితి తిక్క తిక్కగా వుంటుందనడంలో సందేహం లేదు.
అయితే సాయిధరమ్ తేజ్.. ఈ సినిమాను రేయ్.. పిల్లా నువ్వులేని జీవితం తరువాత ఒప్పుకున్నాడని… దాంతో ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం ఈ సినిమా చేయాల్సి వచ్చిందనే ప్రచారం మొదలైంది. అదే.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. సుప్రీమ్ తరువాతనైతే.. ఈ సినిమాను ఒప్పుకునేవాడు కాదని అంటున్నారు మెగా కాంపౌండ్ కు చెందిన కొంతమంది. సాయిధరమ్ తేజ్ వరకు తన పాత్రకు న్యాయం చేశాడు. ఇందులో హీరోయిన్ గా కొత్త అమ్మాయి లారిస్సా బోనెస్ నటించింది. ఏమాత్రం ఎక్స్ ప్రెషన్స్ చూపలేని ఈ అమ్మాయి కేవలం ఉత్సవ విగ్రహంలా వుంది. అలాగే మనన్నారా చోప్రా ఓ లేడీ విలన్ పాత్రను పోషించింది. ఆమె పాత్ర కూడా ఏమంత ఆకట్టుకోదు. ఇక సీనియర్ నటుడు హ్యాస్య కిరీటి రాజేంద్రప్రసాద్, సప్తగిరి, వెన్నెల కిశోర్ కామెడీ ఏమాత్రం సినిమాను నిలబెట్టడంలో వర్కవుట్ కాలేదు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే కన్ ఫ్యూజన్ ఛేజింగ్ కామెడీ నవ్వు కాదు కదా… ఇరిటేషన్ తెప్పిస్తుంది. సినిమా నిడివి సుమారు రెండు గంటలా ఇరవై నిమిషాలుండటంతో.. సినిమా బాగా లెంగ్తీ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుండాల్సి వుండేది. దాదాపు ఓ అరగంట సినిమాకైనా కత్తెర వేయొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత ఎక్కడా ఖర్చు కు వెనకాడలేదు. అయితే సినిమాను మాత్రం పంపిణీ దారులు కొనేశారు. బాగానే బిజినెస్ అయింది. మరి పంపిణీ దారులు బయటపడతారా? లేక మునిగిపోతారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here