రివ్యూ: ‘నేను లోకల్’ మెప్పించాడులే!

Nani-Nenu-Local-Movie-apvarthaluతారాగణం: నాని – కీర్తి సురేష్ – నవీన్ చంద్ర – సచిన్ ఖేడ్కర్ – పోసాని కృష్ణమురళి – ఈశ్వరి రావు – తులసి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: నిజార్ షఫి
రచన: ప్రసన్న కుమార్ – సాయికృష్ణ – త్రినాథరావు నక్కిన
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన
రేటింగ్: 3
నాని ట్రాక్ రికార్డు గత రెండేళ్లుగా ఎలా వుందో అందరికీ తెలిసిందే. విడుదలైన ప్రతి సినిమా.. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించింది. ఇప్పటికే వరుసగా ఐదు హిట్లు కొట్టేసి ఊపు మీదున్నాడు నాని. హీరోయిన్ కీర్తి సురేష్ ‘నేను శైలజ’తో.. నిర్మాత దిల్ రాజు ‘శతమానం భవతి’తో.. దర్శకుడు త్రినాథరావు నక్కిన ‘సినిమా చూపిస్త మావ’తో హిట్లు కొట్టిన వాళ్లే. ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘నేను లోకల్’. మరి లోకల్ కుర్రాడిగా నాని ఎలా మెప్పించాడో చూద్దామా?
స్టోరీ: బాబు (నాని) బీటెక్ పూర్తి చేసి.. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా తిరిగే అకతాయి కుర్రాడు. ఎన్నో సార్లు డుంకీలు కొట్టి బి.టెక్ పాసయిన బాబును ‘నెక్ట్స్ ఏంటీ?’ అనే మాటకు శివాలెత్తి పోతుంటాడు. అలాంటి సమయంలో అతనికి కీర్తి (కీర్తి సురేష్) పరిచయమవుతుంది. ఆమెను ప్రేమలోకి దింపడమే లక్ష్యంతో తను ఎంబీఏ చదివే చోటే తనూ చేరతాడు. ముందు బాబును కీర్తి అసహ్యించుకున్నప్పటికీ నెమ్మదిగా అతడి వైపు మొగ్గుతుంది. ఆమె తన ప్రేమను బాబుకు చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే సిద్ధు (నవీన్ చంద్ర) వీళ్ల మధ్యకు వస్తాడు. ఎస్సైగా పని చేసే సిద్ధుకే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కీర్తి తండ్రి. మరి కీర్తిని తన దాన్ని చేసుకోవడానికి బాబు ఏం చేశాడు.. ఆమె తండ్రిని ఎలా మెప్పించాడనేది మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: నేను లోకల్ లో కొత్తదనమేదీ లేదు. అలా కోరుకునే వారికి ఈ సినిమా అస్సలు నచ్చదు. ఎందుకంటే.. ఇలాంటి పాత్రలను ఇది వరకే రవితేజ లాంటి వాళ్లు చేసేసి మొహం మొత్తేలా చేసేశారు. అలాంటి ప్లాట్ నే నాని కూడా ఒప్పుకోవడం ఒకింత ఆశ్చర్యమేసినా… అయితే టీనేజ్ కుర్రాళ్లను దృష్టిలో వుంచుకుని తెరకెక్కించిన సినిమా అని అర్థమైపోతుంది. ఈ సినిమాపై క్రిటిక్స్ తారా స్థాయిలో విమర్శలు గుప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకుంటే అంత పరమ రొటీన్ సినిమా ఇది. సినిమా ప్రారంభంలోనే పోసాని మురళి ఓ డైలాగ్ కొడతాడు. ‘ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలందరూ వెధవలకే పడతారు’ అంటాడు. దీన్ని బట్టే అర్థమైపోతుంది ఈ సినిమా నుంచి మనం ఏం ఆశించొచ్చనేది. హీరో ఎందుకూ పనికి రాని వాడు… బొత్తిగా బాధ్యత లేనోడని అతన్ని చూడగానే హీరోయిన్ ఓ అండర్ స్టాండింగ్ కి వచ్చేస్తుంది. అంతేనా… హీరోయిన్ తండ్రి కూడా ఇంచు మించు అదే కోణంలో చూస్తాడు. మరి ఇలాంటి కుర్రాడు తన ప్రేమించిన యువతిని… అసహ్యించుకున్న మామను ఎలా మెప్పించి పెళ్లి చేసుకున్నాడనేదాన్ని దర్శకుడు చాలా కన్వెన్సింగ్ గా పతాక సన్నివేశాల్లో చెప్పేసి.. శుభం కార్డు వేసేశాడు. దాంతో ప్రేక్షకులు ‘నేను లోకల్’తో పాజిటివ్ కోణంలో బయటకొచ్చేస్తారు.
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసేశాడంతే. కంటెంట్ లేకపోయినా.. తన నటనతో సినిమాను మొత్తం లాగిపడేశాడు. పతాక సన్నివేశాల్లోనైతే… ఎప్పట్లాగే చెలరేగిపోయాడు. కీర్తి సురేష్ మరీ బొద్దుగా వుంది. నేను శైలజ సినిమాలో పర్వాలేదనిపించినా… ఈ చిత్రంలో మాత్రం మరి చబ్బిగా కనిపిస్తుంది. అయితే హావభావాల్లో మాత్రం మెప్పించింది. పోలీసు పాత్రలో నవీన్ చంద్ర పాత్రకు సరిపోయాడు. అతణ్నుంచి ఇంతకంటే ఆశించడం అత్యాశే. సచిన్ ఖేడ్కర్ పాత్ర కూడా అంతే. పోసాని.. ఈశ్వరి రావు.. తులసి.. వీళ్లందరూ పాత్రలకు తగ్గట్లుగా ఒదిగిపోయారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే…. వీరే ఈ చిత్రానికి ప్రధాన బలం. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. ‘నెక్స్ట్ ఏంటి’. ‘సైడ్ ప్లీజ్’ పాటలు కుర్రకారును బాగా ఆకట్టుకుంటాయి. నేపథ్యం సంగీతం సినిమాకు తగ్గట్లుగా ఉంది. నిజార్ షఫి ఛాయాగ్రహణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సినిమా అంతటా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. రైటింగ్ లో ప్రసన్న కుమార్.. సాయికృష్ణ.. త్రినాథరావు.. ఈ ముగ్గురి పాత్రా ఉంది. కథ రొటీనే కానీ.. స్క్రీన్ ప్లే బాగుంది. డైలాగులు ట్రెండీగా.. ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. దర్శకుడు త్రినాథరావు నేలవిడిచి సాము చేయలేదు. మామూలు కథతోనే ఎంటర్టైన్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *