రివ్యూ: జనతా గ్యారేజ్

75

తారాగణం- ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యా మీనన్, సచిన్ ఖేద్కర్, ఉన్ని ముకుందన్, సాయికుమార్, దేవయాని, సురేష్, సితార, అజయ్ తదితరులు
ఛాయాగ్రహణం- తిరునావుక్కరసు
సంగీతం- దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు- నవీన్, రవిశంకర్, మోహన్
రచన-దర్శకత్వం- కొరటాల శివ
రేటింగ్: 3/5
టెంపర్… నాన్నకు ప్రేమతో లాంటి వైవిధ్యమైన పాత్రలతో నటిస్తూ… పూర్తిగా ఓ కొత్త పంథాలో నడుస్తున్న ఎన్టీఆర్… మిర్చి… శ్రీమంతుడు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అంటేనే అటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ… ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ లో ఏమేమి రిపేర్లు చేశారో చూద్దామా?

స్టోరీ: ‘జనతా గ్యారేజ్’ పేరుతో ఒక మెకానిక్ షెడ్డు నడిపే సత్య(మోహన్ లాల్) అనే ఓ వ్యక్తి… ఎవరైనా కష్టాల్లో ఉంటే.. వారిని ఆదుకుంటూ… అండగా నిలబడతాడు. దాంతో అతనికి హైదరాబాద్ లో తిరుగుండదు. దాంతో అతనికి శత్రువులు పెరిగిపోతారు. అందులో భాగంగానే తన పెద్ద తమ్ముడిని… అతని భార్యను చంపేస్తారు. వాళ్ల కొడుకు ఆనంద్(ఎన్టీఆర్)ను అతడి మేనమామ(సురేష్.. ఒకప్పటి హీరో) ముంబైకి తీసుకెళ్లిపోతాడు. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడై తిరిగి.. అనుకోకుండా తన పెదనాన్న ఉండే హైదరాబాద్‌కే వస్తాడు. ఆయనకే అనుచరుడిగా మారతాడు. వీళ్లిద్దరూ కలిసి ‘జనతా గ్యారేజ్’లో ఏమేమి రిపేర్లు చేశారనేదే మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని హీరో ఎదిరించడం… ఆ హీరో జనాలకు దేవుడిగా కనిపించడం.. సాయం కోసం క్యూ కట్టడం… అతను విలన్లకు శత్రువుగా మారడం… ఇలాంటి స్టోరీలు చాలనే చూశాం. ఇది పాత కథే. కానీ ఇందులోనే ఇద్దరు హీరోలను తీసుకుని… టేకింగ్ పరంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడు కొరటాల శివ. కథ పాతదే అయినా.. మోహన్ లాల్ పాత్రను ప్రధానంగా తీసుకుని… ఆ తరువాత ఎన్టీఆ‌ర్‌ను ‘గ్యారేజ్’లోకి తీసుకురావడం… ఓ స్టార్ హీరో అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడం ఇక్కడ భిన్నమైన విషయం. మోహన్ లాల్ ను జనాల్ని ప్రేమించే వ్యక్తిగా… ఎన్టీఆర్‌ను ప్రకృతి ప్రేమికుడిగా చూపించడం.. ఇలాంటి వ్యక్తులిద్దరూ ఒక్కటైతే… పీడించబడే ప్రజలకు ఎలాంటి లాభం వుంటుందనే దాన్ని చాలా కొత్తదనంగా చూపించడానికి ట్రై చేశాడు దర్శకుడు. కాకపోతే… తన మునుపటి చిత్రాల్లోనే ఈ సినిమాను మొదట నెమ్మదిగా నడిపించాడు. ఆ తరువాత కూడా సినిమా గ్రాఫ్ అమాంత పెరిగి మళ్లీ తగ్గడం.. చివరకు శ్రీమంతుడు సినిమాలో లానే ఓ రొటీన్ క్లైమాక్స్ తో ముగించడం వల్ల అంతకు ముందు చూసిన కొత్తదనం అంతా మర్చిపోతారు. అయితే ఎమోషన్స్ ను బాగా క్యారీ చేయడంతో… ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే ఎక్కుతుంది. ఎక్కడా బూతులు… డబుల్ మీనింగ్ కామెడీలు లేకుండా సీరియస్ గా సాగిపోయే.. జనతా గ్యారేజ్ లో చాలా ఆసక్తి గొలిపే అంశాలే వున్నాయి. దాంతో పాటు ఫ్యాన్స్ ను నిరాశ పరిచే అంశాలున్నాయి. వాటిని బ్యాలెన్స్ చేయడంలో కొరటాల కొంత తడబడ్డాడనే చెప్పొచ్చు. జనతా గ్యారేజ్ విషయంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన విషయం ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషనే. వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐతే ఆ అంచనాలకు తగ్గట్లే మంచి సన్నివేశాలే పడ్డాయి సినిమాలో. ఇద్దరూ కలిసే తొలి సన్నివేశమే గొప్పగా అనిపిస్తుంది. ఇద్దరి స్థాయికి తగ్గట్లుగా చక్కగా సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు కొరటాల. అసలు ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ సన్నివేశంతోనే ‘జనతా గ్యారేజ్’ సినిమా మొదలవుతుంది. అప్పటిదాకా పాత్రల పరిచయానికి.. కొన్ని సాదాసీదా సన్నివేశాలు.. మూడు పాటలకే స్క్రీన్ టైం చాలా వరకు ఖర్చవుతుంది. ఎన్టీఆర్ పాత్ర వరకు బాగున్నా.. ప్రథమార్ధంలో వచ్చే మిగతా సన్నివేశాలేవీ కూడా ఫ్యాన్స్ కు అంతగా ఆసక్తి రేకెత్తించవు. తారక్-లాల్ కలిసే తొలి సన్నివేశం మాత్రం భలేగా అనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ మారి.. సీరియస్‌గా సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు ప్రేక్షకులు. ఇక ద్వితీయార్ధం అంచనాలకు తగ్గట్లే చక్కగా ఆరంభమవుతుంది. ‘ఎక్కడ ఆగిందో అక్కడే మొదలుపెడదాం’ అంటూ రాజీవ్ కనకాల పాత్రను తెరమీదికి తీసుకు రావడంతో ఒక్కసారిగా ప్రేక్షకుడిలో ఊపు.. ఉత్తేజం వస్తాయి. రాజీవ్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ ఎపిసోడ్ 20 నిమిషాలు ప్రేక్షకుడు తెరకు కళ్లు, చెవులు అప్పగించేయాల్సిందే. ఆ ఎపిసోడ్ అంత బాగా పండింది. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ఇక్కడే తెలుస్తుంది. అతడి నటనలోని ఇంటెన్సిటీని ప్రతి ప్రేక్షకుడూ ఫీలవుతాడు. కొరటాల మాటలు తూటాల్లా పేలాయి ఇక్కడ. ఎమోషన్ అద్భుతంగా పండిన ఈ సన్నివేశం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత వచ్చే టైటిల్ సాంగ్.. ఎన్టీఆర్ ఎవరో మోహన్ లాల్‌కు తెలిసే సన్నివేశం కూడా చాలా ఉద్వేగంగా సాగుతాయి. ఐతే ఇక్కడే కొరటాల సంతృప్తి పడిపోయినట్లున్నాడు. ఏదో ఒక రొటీన్ క్లైమాక్స్‌తో ముగించేద్దామని చూశాడతను. ఎంతో ఎమోషనల్‌గా నడుస్తున్న సినిమా కాస్తా.. రొటీన్ కమర్షియల్ సినిమాల్లాగా టర్న్ తీసుకుని అనాసక్తికరంగా సా..గడం మొదలుపెడుతుంది. దీంతో చివరి అరగంటలో సినిమా గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతుంది. అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ ను దెబ్బ తీసింది తప్ప చివరి అరగంట సినిమాకు ఏ రకంగానూ ఉపయోగపడలేదు. అంతకుముందు ఒక్కసారిగా పైకి లేచిన గ్రాఫ్ కాస్తా… చివర్లో ఒక్కసారిగా కింద పడుతుంది. ఓవరాల్‌గా బాగుందనిపిస్తూనే.. కొంచెం అసంతృప్తినీ మిగిలుస్తుంది ‘జనతా గ్యారేజ్’.
హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. సమంత, నిత్యామీనన్ ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. మోహన్ లాల్ పాత్ర మరీ అంత గొప్పగా లేదు కానీ.. ఆయన నటన మాత్రం అమోఘం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కాజల్ ఐటెం సాంగ్ సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్. విలన్ల పాత్రలు కూడా పెద్దగా ఎలివేట్ కాలేదు. దేవిశ్రీ పాటలు.. నేపథ్య సంగీతం బాగున్నాయి. తిరు ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. కొరటాల శివ మాటల రచయితగా కూడా మరోసారి సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌ను బాగా డీల్ చేశాడు. క్లైమాక్స్ ను ఇంకాస్త బాగా కేర్ తీసుకుని తెరకెక్కించి వుంటే ఓవరాల్ గా ఫ్యాన్స తో పాటు… సగటు ప్రేక్షకుడు కూడా సాటిస్ ఫై అయ్యేవాడు.

-నాగరాజు చౌదరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here