రివ్యూ: ఆహ్లాదంగా నవ్వించే..’అ ఆ‘

68

 

A.Aa-Movie-New-First-Look-Poster-Download-e1455598709844
తాగాగణం: నితిన్, సమంత, నదియ, నరేష్, రావు రమేష్, అజయ్, గిరిబాబు, అవసరాల శ్రీనివాస్, అనన్య, హరితేజ, ప్రవీణ్, షకలక శంకర్, పోసాని, సన, చమ్మక్ చంద్ర,, ఈశ్వరీరావు, అనుపమ పరమేశ్వరన్, రఘుబాబు తదితరులు
సంగీతం: మిక్కీ జె.మేయర్
సినిమాటోగ్రఫీ: నటరాజ్ సుబ్రమణ్యం
నిర్మాత: సూర్యదేవర చినబాబు
రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
రేటింగ్: 3.5/5

మాటల మాంత్రికుడి చమత్కారపు పలుకులు… ఫ్యామిలీ భావోద్వేగాలు కలిపితే.. త్రివిక్రమ్ సినిమా అవుతుంది. అతడు రాసే టన్నుల కొద్ది పంచ్ డైలాగులకు హాస్యం తోడైతే.. సినిమాలో నవ్వులే నవ్వులు. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ. తాజాగా నితిన్, సమంతతో కలిసి ‘అ..ఆ’లు దిద్దించాడు. మరి ఈ రెండక్షరాలు వెండితెరపై ఎంత అందంగా కనిపించాయో చూద్దాం.

కథ: అనసూయ (సమంత).. మహాలక్ష్మి(నదియ) అనే ఓ బిలియనీర్ కూతురు. ఆ ఇంట్లో మహాలక్ష్మీ చెప్పినట్టే వినాలి. మహాలక్ష్మీ భర్త రామలింగం(నరేష్) కూడా భార్య చెప్పినట్టే వింటుంటాడు. ఎలాంటి డిస్కషన్స్ లేకుండా శేఖర్(అవసరాల శ్రీనివాస్) అనే కుర్రాడితో పెళ్లి చూపులు అనగానే ఆత్మహత్యకు పాల్పడుతుంది అనసూయ. దాంతో ఆ నిర్ణయం కాస్త వాయిదా పడుతుంది. ఈ గ్యాప్ లో మహాలక్ష్మీ ఓ మీటింగ్ పనిమీద చెన్నై వెళ్లటం.. ఆ గ్యాప్ లో అనసూయ  రిలీఫ్ కోసం తన బావ ఆనంద్ విహారి(నితిన్) ఇంటికి వెళుతుంది. అక్కడ అనసూయ.. ఆనంద్ విహారికి దగ్గరవుతుంది. అయితే విహారి తండ్రి(జయప్రకాష్) అదే గ్రామానికి చెందిన పల్లం వెంకన్న(రావు రమేష్) వద్ద అప్పు చేసి చనిపోతాడు. మీ నాన్న చేసిన అప్పు తీరుస్తావా? లేక నా కూతురుని(అనుపమ పరమేశ్వరన్) చేసుకుని సుఖపడతావా? అని పల్లం వెంకన్న నిలదీయడంతో.. చేసేది లేక  వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అయితే ఆనంద్ విహారి కుటుంబం తన అమ్మ వల్లే కష్టాల్లో వుందని తెలుసుకున్న అనసూయ… ఆనంద్ విహారికి దగ్గరయై తన ప్రేమను ఎలా దక్కించుకుందన్నదే మిగతా కథ.

కథ-కథనం విశ్లేషణ:  ఎప్పుడో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మీనా’ అనే సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ‘అ..ఆ’గా తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్. సుప్రసిద్ధ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి రాసిన నవల ఆధారంగా ‘మీనా’ అనే సినిమాను తెరకెక్కించారు విజయ నిర్మల. ఇప్పుడు ఆ సినిమా స్టోరీలైన్ ను తీసుకుని నితిన్, సమంత జంటగా ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలిసిన స్టోరీనే అయినా.. ఈతరం యూత్ కి అనుగుణంగా మలిచి వెండితెరపై ఓ అందమైన దృశ్యకావ్యంగా మలిచాడు. ఎప్పటిలానే తన కలం నుంచి జాలువారిన పంచ్ డైలాగులు.. కాస్తంత హ్యూమరస్ జోడించి ఈ సిినిమాను తెరకెక్కించాడు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో లాగనే ఇందులో కూడా అన్నా… చెల్లెళ్ల సెంటిమెంటునే తీసుకుని కథ అల్లుకున్నాడు. స్వతంత్రంగా ఆలోచించే నదియ.. ఏదైనా వ్యాపారం చేసి కోటీశ్వరురాలు కావాలనుకుంటుంది. అందుకోసం తన అన్న జయప్రకాష్ వద్ద నున్న పొలాల దస్త్రాలను బ్యాంకులో ష్యూరిటీ పెట్టి కంపెనీ పెడుతుంది. తీరా కంపెనీకి లాభాలొచ్చే సమయంలో ష్యూరిటీ పెట్టిన పొలాలన్నీ వేలానికొస్తాయి. కొంత కాలం ఆగితే…. వేలంలో పోయిన పొలాల కంటే రెట్టింపు భూమిని కొందువుగాని అని నదియ తన అన్నతో  చెబుతుంది. అయితే.. పొలాలను వేలం వేస్తే.. ఊరిలో తన పరువుపోతుందని భావించి.. జయప్రకాష్ ఆత్మహత్య చేసుకోవడం.. దాని వల్ల ఆనంద్ విహారి కుటుంబం వీధిన పడటం జరిగిపోతుంది. అయితే తన భర్త మరణానికి నదియానే కారణం అని ఆనంద్ విహారి తల్లి భావించి.. ఆ కుటుంబానికి దూరంగా జీవిస్తూ వుంటుంది. నదియా కూడా తన అన్న కుటుంబానికి ఏమీ సంబంధం లేనట్టుగా స్టేటస్ సింబల్ గా జీవిస్తూ వుంటుంది. ఇలాంటి కుటుంబాలు మళ్లీ ఒక్కటి ఎలా అవుతాయనేదానికి రాసుకున్న కథనం బాగుంది.

మరోసారి త్రివిక్రమ్ తన పెన్ పవర్ చూపించి బోలెడన్ని డైలాగులతో ఆద్యంతం ప్రేక్షకులను కుర్చీ నుంచి కదలనీయకుండా చేశాడు. ఫస్టాఫ్ ఎలాంటి కథ లేకుండానే సాగిపోయి ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఆ తరువాత అసలు స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. స్టార్టింగ్ లో ఆగిపోయిన సమంత పెళ్లి వ్యవహారం సెకెండాఫ్ లో మళ్లీ టేకాఫ్ అవుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టి.. తను విహారితో సెటిల్ కావాలనుకునేందుకు సమంత వేసే ఎత్తులు… అనన్యకు.. అవసరాల శ్రీనివాస్ దగ్గరయ్యేలా చేసేందుకు సమంత పడే పాట్లు అన్నీ చాలా ఫన్నీగా వుంటాయి. అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్లు అనవసరంగా వున్నాయనిపించినా… చివరకు అవేమీ గుర్తుండవు. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటకొస్తారు. నితిన్.. సమంతల మధ్య సాగే లవ్ ఎపిసోడ్ సింప్లీ సూపర్బ్.నితిన్ చాలా మెచ్యూర్ వున్న క్యారెక్టర్ చేశాడు. ఇంతకు ముందు ఇలాంటి క్యారెక్టర్లో అతన్ని చూసుండం. ఇందులో తన ఫేవరేట్ స్టార్ పవన్ లాగే చాలా చోట్ల ఎమోషన్ డైలాగులను తన స్టైల్లో పలికాడు. ఎక్కడా ఓవర్ అనేది కనిపించదు. ఇక సమంత గురించి చెప్పాల్సి వస్తే.. సినిమానే సమంత.. సమంతనే సినిమా అనేంతలా ఇందులో నటించింది. సమంత ఇంతకు ముందు ఇంతటి లెంగ్త్ వున్న రోల్ చేసుండదు. ఎప్పటిలానే త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఎదో డిఫెక్ట్ వున్న అమ్మాయిలా కనిపించడం పరిపాటే. ఇందులో కూడా స్ట్రెస్ గురయ్యే అమ్మాయిలా చూపించాడు. గతంలో సన్నాఫ్ సత్యమూర్తిలో సుగర్ పేషంట్ గానూ.. అంతకు ముందు అత్తారింటికి దారేదిలో మతిమరపు వున్న అమ్మాయిలా కనిపించింది సమంత. ఇక నెగిటివ్ పాత్రలో నటించిన రావు రమేష్.. ఎప్పటిలాగే అదరగొట్టేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా వున్నాయి… ఇప్పుడు మన జీవితం ఎలావుందంటే.. రోడ్ వైండింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లా తయారైందనే డైలాగ్ తో థియేటర్లో నవ్వులే నవ్వులు. ఇంకా ఇలాంటి డైలాగులు అతనితో పలికించాడు. మినరల్ వాటర్ తో మొహం కడుక్కుంటున్నాం అంటే అంతా బలుపు అనుకుంటారు.. లేబుల్ తీసేయ్ అనే డైలాగ్.. ఇలా చాలానే వున్నాయి. నదియా ఎప్పటిలానే తన క్యారెక్టర్ కు న్యాయం చేసింది. ఇక హీరో చెల్లులుగా నటించిన అనన్య.. హీరోయిన్ ఫ్రెండ్ గా, పనిమనిషిగా నటించిన హరితేజ.. నితిన్ స్నేహితుడిగా నటించిన ప్రవీణ్.. నదియాకు నమ్మిన బంటుగా.. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.. ఆమె భర్తగా సీనియర్ నటుడు నరేష్…సమంతను చేసుకోవాలనుకునే పెళ్లికొడుకుగా అవసరాల శ్రీనివాస్.. అతని తాతగా గిరిబాబు.. రావు రమేష్ కుమారుడిగా అజయ్.. అతని కూతురుగా అనుపమ.. ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా పల్లెటూరి వాతావరణాన్ని చూపించడంలో నటరాజ్ సుబ్రమణ్యం నైపుణ్యం కనిపిస్తుంది. మిక్కీ జె.మేయర్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత చినబాబు ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here