రాష్ట్రంలో అతిపెద్ద కాగిత పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఏపీపీ

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్, పేపర్’ (APP) రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఏపీపీ ప్రతినిధులు భారతదేశంలోనే అతిపెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. పెద్దఎత్తున ముడిపదార్ధాలను దిగుమతి చేసుకునేందుకు, చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తూర్పు తీరంలో వున్న ఏపీలో తమ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందుకోసం ఏదైనా నౌకా తీరానికి సమీపంలో రెండున్నర వేల ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూ కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసరప్రాంతాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. తమకు భూమిని కేటాయించిన రెండున్నరేళ్లలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి ఏపీపీ ప్రతినిధులు వివరించారు. రోజుకు సరాసరి 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ పరిశ్రమను నెలకొల్పుతామని ఇందులో నాలుగో వంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *