రాజధాని నిర్మాణానికి రూ. 1,28, 575 విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ఆటోడ్రైవర్ అందజేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ మాజీ కార్పొరేటర్ పి.శివ సాయి ప్రసాద్ తో కలిసిన సురేష్ ఈ మేరకు చెక్కును సమర్పించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి పడుతున్న తపన, కృషికి స్పూర్తి పొంది విరాళమిచ్చినట్లు విజయవాడ గుణదలకు చెందిన ఆటోడ్రైవర్ పి. సురేష్ బాబు పేర్కొన్నారు. ఆటో సొంతంగా నడుపుకుంటూ ఒక్కో రూపాయి చేసుకున్న పొదుపు నుంచి ఉదారతతో విరాళమిచ్చారు. రాజధాని నిర్మాణం పట్ల సురేష్ తన భాగస్వామ్యాన్ని, సేవా తత్పరతను చాటుకున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. సురేష్ ను స్పూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాలని సీఎం ఆకాంక్షించారు.