రథసప్తమికి విస్తృతంగా ఏర్పాట్లు : జెఈవో

తిరుమల శ్రీవారి ప్రధానమైన ఉత్సవాల్లో ఒకటైన రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ పర్వదినం ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టిటిడి అధికారులతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయా విభాగాల అధికారులు వివరణాత్మకంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి ఏర్పాట్లను వివరించారు.

– జనవరి 24న సూర్యజయంతి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.

– ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆర్జితసేవలు, విఐపి బ్రేక్‌ దర్శనం, వయోవృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేయడమైనది.

– దివ్యదర్శనం టోకెన్లు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు యథావిధిగా ఉంటాయి.

– భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు. ఇందుకోసం 8 లక్షల తాగునీటి ప్యాకెట్లు, 1.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుతారు.

– వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా 19 ఎల్‌ఇడి స్క్రీన్లు. ప్రత్యేకంగా పుష్పాలంకరణలు.

– 3 వేల మంది శ్రీవారి సేవకులు, 800 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందిస్తారు.

– భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు మాడ వీధుల్లో సీనియర్‌ అధికారులకు విధులు కేటాయిస్తారు.

– వాహనసేవల్లో సర్కార్‌ హారతి మాత్రమే ఉంటుంది. ఇతర హారతులు ఉండవు.

– సూర్యప్రభ వాహనసేవలో ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు.

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవల ప్రత్యక్షప్రసారం.

– జనవరి 25 నుంచి 28వ తేదీ వరకు ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్‌ దర్శనాలను పరిమితం చేయడం జరిగింది.

అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఆరోగ్యశాఖాధికారిణి డా|| శర్మిష్ట ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *