ముస్లింలకు చంద్రబాబు బక్రిద్ పండుగ శుభాకాంక్షలు

131

త్యాగానికి ప్రతీకగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పండుగ బక్రిద్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్రంలోని ముస్లింసోదర సోదరీమణులకు ఆయన బక్రిద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆధ్యాత్మిక, చారిత్రక పండుగ అని అన్నారు. మక్కా, మదీనా సందర్శన సందర్భంలో హజ్ యాత్ర పూర్తయిన మరుసటి రోజు బక్రిద్ వేడుకలు చేసుకోవటం సంప్రదాయంగా వస్తోందన్నారు.

మనిషిలో ప్రతికూల శక్తులు నశించి, సానుకూల దృక్పథం ఏర్పడేందుకు బక్రిద్ ఆధ్యాత్మిక సంపత్తిని అందించే పండుగగా నిలిచిపోతుందన్నారు. చరిత్రలో త్యాగానికి నిదర్శనంగా నిలిచిన ఇబ్రహీం జీవితాన్ని స్మరించుకుంటు బక్రీద్‌ను జరుపుకుంటునట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజల మధ్య సుహృద్భావం, సామరస్యం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహ్మద్ ప్రవక్త మానవత్వాన్ని బోధించారని, మానవులంతా కలసిమెలసి జీవించాలని ప్రబోధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముస్లింలంతా ప్రార్ధనలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గతంలో మరే ప్రభుత్వం చేపట్టలేదని, మైనారిటీల సంక్షేమానికి 2018-19 బడ్జెట్ లో 1101.90 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. చంద్రన్న పెళ్లికానుకగా అందిస్తున్న దుల్హన్ పథకం కింద ముస్లిం నవవధువులకు రూ.50 వేలు అందిస్తున్నామని, 2018-19లో ఈ పథకానికి రూ.80 కోట్లు కేటాయించామని, పదహారు వేలమందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. చరిత్రలో తొలిసారిగా ఇమామ్స్‌కు, మౌజన్లకు పారితోషికం ప్రవేశపెట్టిన ఘనత తమదేనని చంద్రబాబు నాయుడు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here