మా భూమి మాకు అప్పగించండి మహాప్రభో..!

కృష్ణా జిల్లా జన్మభూమిలో నల్ల రిబ్బన్లతో నిరసన దీక్షలు… జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడు రెవెన్యూ గ్రామ ఆర్ ఎస్ నెంబర్లు 136/1బి2లో 55 సెంట్లు, మరియు134లో 10 సెంట్ల మెట్ట వ్యవసాయ భూమిని 7వ విడత భూపంపిణీలో 2008లో అప్పటి ప్రభుత్వం అదే గ్రామానికి చెందిన బెజ్జం బుజ్జి w/o శ్రీను అనే నిరుపేద మహిళకు కేటాయించింది. ఇందుకు పట్టా నెంబరు 060409250006 అనే పట్టాను కూడా ప్రభుత్వం ఇచ్చినది. ఈమె కుటుంబం కొన్నేళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటోంది. 2012లో బుడమేరు వరదల కారణంగా పంట నష్టం జరిగితే వెలగలేరు సొసైటీ ద్వారా ఇన్ పుట్ సబ్సిడీ కింద 1350 రూపాయలను కూడా ప్రభుత్వం మంజూరు చేసినది. తర్వాత రుణం కోసం వెలగలేరులో మరో జాతీయ బ్యాంకుకి వెళితే అడంగల్ రికార్డుల్లో బెజ్జం బుజ్జికి బదులుగా వేరే వ్యక్తి పేరు నమోదై ఉన్నట్లు గుర్తించారు. అప్పటినుండి బెజ్జం బుజ్జి కుటుంబం పోరాటం ప్రారంభించింది.గత రెండేళ్లుగా కొండపల్లి నివాసి అయిన… ఒక రైల్వే రిటైర్డ్ ఉద్యోగి…. ఈ భూమి తమదేనని…..నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, బెజ్జం బుజ్జి కుటుంబాన్ని మానసికంగా హింసకు గురి చేస్తున్నారు. ఈ భూమి తమదేనని వాళ్ళు, నిరుపేదరాలైన బెజ్జం బుజ్జి కుటుంబాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు భూస్వామ్యులకు కౌలుకు కూడా ఇస్తున్నారు. బెజ్జం బుజ్జిని సదరు అసైన్డ్ భూమిలోకి రానివ్వకుండా, నకిలీ పాస్ పుస్తకాలు పొందిన వారు గత కొంతకాలంగా నరకయాతనకు గురి చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమకు అన్యాయం జరిగుతోందని, కనీసం దీనిపై విచారణ కూడా నిర్వహించలేదని ఆరోపించింది. రిటైర్డ్ ఉద్యోగి సృష్టించిన పాస్ పుస్తకాల్లో అంతా కొట్టివేసినట్లు, వైట్ నర్ తో దిద్ది మరొకరి పేరు వ్రాసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా… అటువంటి ఫోర్జరీ, నకిలీ పాస్ పుస్తకాలను తక్షణమే ఎందుకు రద్దు చేయడం లేదని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. నకిలీ పాస్ పుస్తకాల మంజూరులో గతంలో పనిచేసిన కొందరు రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాత్ర కూడా వున్నట్లు బాధితుల ఆరోపణలను బట్టి తెలుస్తోంది.ఈ వ్యవహారంపై జి.కొండూరు పోలీసు స్టేషన్లో, తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఫిర్యాదులు చేసినట్లు బెజ్జం బుజ్జి తెలిపింది. దీనిపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ బెజ్జం బుజ్జి కుటుంబం కోరుతోంది. అప్పటి వరకు జి.కొండూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేస్తామని తెలిపింది.తమ భూమి తమకు దక్కని పక్షంలో కుటుంబంతో సహా ఆత్మాహుతికైనా సిద్దమేనని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపై సమగ్రంగా విచారించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *