మాది ధర్మపోరాటం.. విజయం సాధించి తీరుతాం!

27

విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని అడుగుతుంటే కేంద్రం తమపై ఎదురుదాడి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రధాని అభ్యర్థిగా రాష్ట్రానికి వచ్చిన మోదీ ఇచ్చిన హామీలపై శాసనసభలో చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగేళ్ల క్రితం ఓ జాతీయపార్టీ రోడ్డున పడేస్తే.. ఇప్పుడు మరో జాతీయ పార్టీ అన్యాయం చేస్తోందన్నారు.

‘ఎన్నికల ముందు హామీలిచ్చిన భాజపా.. ఇప్పుడు వాటిని ఎందుకు నెరవేర్చడం లేదు. నమ్మినవాళ్లు మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి. రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తి కేంద్రంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్న జరిగిన అఖిల సంఘాల సమావేశానికి భాజపా, జనసేన, వైకాపా మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. పార్టీలకతీతంగా విభజన హామీలపై పోరాడాలని అందరూ ముక్తకంఠంగా నినదించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడాల్సిన సమయంలో కొందరు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని మాత్రమే కేంద్రాన్ని కోరుతున్నాం. ఒక రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా?. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై నిరసన తెలిపేందుకు నల్లబ్యాడ్జీలు ధరించాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరినీ కలుపుకొని వెళ్లాలన్నదే ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగా అడుగుతున్నా… ప్రధాని సమాధానం చెప్పాలి.

పోలవరానికి సంబంధించి ఎప్పటికప్పడు లెక్కలు చెప్పినా ఇబ్బంది పెడుతున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడితే భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారు. కేంద్రం ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదు. సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలగదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here