మల్లీఫ్లెక్స్ థియేట‌ర్ల యాజ‌మాన్యానికి రూ.25లక్షల జరిమానా

44

వినోదం కోసం వ‌స్తే అందిన‌కాడికి అధిక రేట్లతో వినియోగదారులను దోచుకుంటున్న మల్లీఫ్లెక్స్ థియేటర్లపై విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం కొరడా ఝళిపించింది. నగరంలోని ఐదు మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ యాజమాన్యాలకు భారీ జరిమానా విధించింది. వినియోగదారులు బయట నుంచి తెచ్చుకునే తినుబండారాలు, మంచినీరును థియేటర్లలోకి అనుమతించాలని సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలు త‌క్ష‌ణం అమలయ్యేలా చూడాలని తూనికలు, కొలతల శాఖను ఆదేశించింది. విజయవాడలోని కొన్ని మల్లీఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్లు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కొందరు వినియోగదారులు మార్గదర్శక సమితి సహకారంతో గతేడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఎల్‌ఈపీఎల్‌, ట్రెండ్‌సెట్‌, పీవీఆర్‌, పీవీపీ, ఐమ్యాక్స్ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై మల్లీఫ్లెక్స్ యాజమాన్యాలు, తూనికలు, కొలతల శాఖను న్యాయస్థానం ప్రతివాదులుగా చేర్చింది. గతేడాది నుంచి దీనిపై పలుమార్లు వాద ప్రతివాదనలు జరిగాయి. సమగ్ర విచారణ చేసిన న్యాయమూర్తి మాధవరావు ఈ అంశంపై సంచలన తీర్పు వెలువరించారు. నగరంలోని ఐదు థియేటర్ల యాజమాన్యాలు తినుబండారాలపై ఎమ్మార్పీ కంటే మూడురెట్లు అధికంగా ధర ముద్రించి వినియోగదారులను మోసం చేసినట్లు న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు. దీంతో వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలను ఆదేశించారు. ఒక్కక్కరికి రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.25లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రెండు నెలల లోపు జిల్లా వినియోగదారుల ఫోరం వద్ద జమ చేయాలని తీర్పులో ఆదేశించారు. ఇలాంటి మోసాలకు పాల్పడటం తీవ్రమైన తప్పిదమని పేర్కొంటూ భవిష్యత్‌లో ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థియేటర్లకు వచ్చే వినియోగదారులకు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అనుమతించాలని ఆదేశించారు. వినియోగ‌దారుల న్యాయస్థానం సంచ‌ల‌న తీర్పుతో న‌గ‌ర‌వాసుల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. వినియోగ‌దారుల న్యాయ‌స్థానం ఆదేశాలు థియేట‌ర్ల‌లో స‌క్ర‌మంగా అమ‌ల‌య్యేలా అధికారులు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here