మతతత్వంపై పోరాటం ప్రకాశ్‌రాజ్‌ పిలుపు

రాజకీయాలంటే తనకు ఆసక్తి లేదనీ, పదేపదే సవాలుచేస్తే మాత్రం రాజకీయాల్లో వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. ‘ఈ ఏడాది (2017) వ్యక్తి’ పురస్కారంతో ప్రకాశ్‌రాజ్‌ను బెంగళూరు ప్రెస్‌ క్లబ్‌ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘దేశంలో మతతత్వ రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగింది. హిట్లర్‌ పాలనలో ప్రబలంగా ఉన్న మెజారిటేరియనిజం, నిరంకుశ తత్వం ప్రబలంగా ఉంది. మనదేశంలో అది మరింతగా పెరుగుతోంది. అది జరగనివ్వకుండా చేద్దాం. దానికి వ్యతిరేకంగా మా స్వరాన్ని వినిపించాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. వారి లక్ష్యాలను సాధించడానికి హింసాత్మక మార్గాల ను మతతత్వ శక్తులు ఉపయోగించుకుంటున్నా యని ప్రకాశ్‌ రాజ్‌ విమర్శించారు. ఈ హింసాత్మక దళాలను ఓడించడం ద్వారా వారికి ఒక పాఠం నేర్పాలన్నారు. ఈ దళాల గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటినీ సందర్శించాలి. రాబోయే ఎన్నికల్లో వారిని ఓడించడంలో ఇది మనకు సహాయపడుతుంది’ అన్నారు. నరేంద్రమోడీ, అమిత్‌ షా సహా బీజేపీ నాయకులపై ప్రకాశ్‌ రాజ్‌ గత కొన్ని రోజులుగా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యోదంతం తనలో మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న దారుణాలపై గళమెత్తాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సీనియర్‌ పాత్రికేయులే తనకు ప్రశ్నించే ధైర్యాన్నిచ్చారని, వారి మార్గదర్శకత్వంలో పెరిగిన ఏకలవ్య శిష్యుడినని అన్నారు సమాజంలో బాధ్యతగా మాట్లాడేందుకు ప్రెస్‌క్లబ్‌ అందించిన పురస్కారం మరింత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *