మంగళగిరిలో కొలువుదీరిన 16 ఐటీ కంపెనీలు


న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిని ఐటీ కేంద్రంగా రూపుదిద్దుతామ‌ని రాష్ట్ర పంచాయ‌తీ రాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ప‌ష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతమైన మంగళగిరిని మైటెక్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ కార్యరూపం దాల్చింది. ఈ క్రమంలో మంగళగిరి ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కు (13), ఆటోనగర్‌ ఐటీ పార్కు(3)ల్లో 16ఐటీ కంపెనీలను మంత్రి లోకేష్‌ బుధవారం ఉద‌యం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీల‌తో తక్షణం 600 మందికి ఉపాధి లభిస్తుంద‌న్నారు. ఏడాదిలో మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తార‌ని తెలిపారు. సాంకేతిక విద్య చదివిన రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతిలోనే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని మంత్రి వెల్ల‌డించారు. మంగళగిరి ఆటోనగర్‌ ఐటీ పార్కులో ఇప్పటికే మూడు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయ‌ని, వీటిలో 500 మంది పని చేస్తున్నార‌ని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ ప్రాంతం హైటెక్‌ సిటీగా పేరుగాంచిన విధంగా మంగళగిరిలో ఐటీ ప్రాంతం మైటెక్‌ సిటీగా అభివృద్ధి చెందుతుందని ఏపీ ఎన్‌ఆర్‌టీ సీఈవో రవి వేమూరి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు న‌క్కా ఆనంద్‌బాబు, కొల్లు ర‌వీంద్ర‌, డీజీపీ మాల‌కొండ‌య్య‌, వివిధ ఐటీ కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *