రివ్యూ: భావోద్వేగాల ‘శతమానం భవతి’

91

Sathamanam-Bhavathi-apvarthalu
తారాగణం: శర్వానంద్ – అనుపమ పరమేశ్వరన్ – ప్రకాష్ రాజ్ – జయసుధ – నరేష్ – ఇంద్రజ – సిజ్జు – ప్రవీణ్ – జబర్దస్త్ రవి – ప్రభాస్ శీను – తనికెళ్ల భరణి – రవిప్రకాష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాతలు: దిల్ రాజు – శిరీష్
కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: వేగేశ్న సతీష్
రేటింగ్: 3
గత ఏడాది ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున చిత్రాలు విడుదలవుతున్నాయని తెలిసినా… ‘ఎక్స్ ప్రెస్ రాజా’తో వచ్చి హిట్ కొట్టాడు శర్వానంద్. ఈసారి కూడా పొంగల్ రేస్ లో మెగాస్టార్.. బాలకృష్ణ తమ తమ ల్యాండ్ మార్క్ మూవీస్ తో వస్తున్నారని తెలిసి కూడా.. ‘శతమానం భవతి’ అంటూ మన ముందుకొచ్చాడు. రెండు పెద్ద సినిమాల మధ్య అడ్రస్ గల్లంతవుతుందేమో అనుకున్నా… నిర్మాత దిల్ రాజు మాత్రం తన ప్రాడక్ట్ మీద వున్న ఎంతో నమ్మకంతో లిమిటెడ్ థియేటర్లలో విడుదలచేశాడు. మరి దిల్ రాజు నమ్మకం ప్రేక్షకులు ఏమాత్రం నిలబెడతారో చూద్దాం.
స్టోరీ: ఆత్రేయపురం అనే ఓ పల్లెటూరిలో రాఘవరాజు (ప్రకాష్ రాజ్) అనే పెద్ద మనిషి తన భార్య జానకి (జయసుధ)తో కలిసి హుందాగా బతుకుతుంటాడు. అయితే తన పిల్లలు మాత్రం ఇతర దేశాల్లో ఉద్యోగ రీత్యా సెటిల్ అయిపోతారు. అయితే పిల్లలను చూడాలని జానకి పరితపిస్తూ వుంటుంది. పిల్లలు మాత్రం డ్యూటీతో బిజీ అంటూ అదిగో వస్తాం… ఇదిగో వస్తాం అంటూ కాలయాపన చేస్తూ వుంటారు. దాన్ని జానకి భరించలేక తనే పిల్లల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే వాళ్లను రప్పించడానికి ఓ పథకం వేస్తాడు రాఘవరాజు. అది ఫలించి ఆయన పిల్లలు తమ కుటుంబాలతో కలిసి ఇక్కడికి వస్తారు. ఆత్రేయపురంలోనే ఉంటూ రాఘవరాజు కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించే రాజు (శర్వానంద్).. ఆయన మనవరాలు నిత్య (అనుపమ పరమేశ్వరన్)కు దగ్గరవుతాడు. మరి పిల్లల్ని రప్పించడానికి రాఘవరాజు వేసిన పథకమేంటి.. అది తెలిశాక ఆయన భార్య ఎలా స్పందించింది.. మరోవైపు రాజు-నిత్యల ప్రేమ ఫలించిందా? లేదా అనేదే మిగతాకథ.
స్టోరీ విశ్లేషణ: ‘శతమానం భవతి’ స్టోరీ లైన్ కొత్తదేమీ కాకపోయినా… టేకింగ్ మాత్రం కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే వారికి అనుగుణంగానే వుంది. గతంలో ఇలాంటి సినిమాలు చాలానే చూసుంటాం. కానీ ఎక్కడా అలాంటి ఫీలింగ్ రాకుండా కొత్తడైరెక్టర్ వేగేశ్న సతీష్ జాగ్రత్త పడ్డాడు. ఎన్నో అనుభూతులు… భావోద్వేగాలను… కామెడీని జోడించి ఓ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా మొదలైంది మొదలు… అంచనాలకు తగ్గట్లుగానే కథ సాగుతున్నా.. సన్నివేశాలకు తగ్గట్టుగా పాత్రలు ప్రవర్తించడంతో అందరూ కన్వెన్స్ కాకతప్పదు. సుమారు రెండు గంటలా ఇరవై నిమిషాల పాటు సినిమా వున్నా.. ఎక్కడా మలుపులు లేకుండా సాగిపోతుంది. దాంతో ప్రేక్షకులు పెద్దగా ఊపిరి పీల్చుకోకుండా నిశ్చింతగా సినిమాను చూసేసి బయటకొస్తారు.
శర్వానంద్ సింపుల్ గా రాజు పాత్రను పండించాడు. తన సహజ నటన వల్ల రాజు పాత్రతో చాలా ఈజీగా కనెక్టయిపోతాం. తన తొలి రెండు సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన అనుపమ.. ఈసారి మోడరన్ అమ్మాయిగానూ ఆకట్టుకుంది. ఆమె డబ్బింగ్ ఎన్నారై అమ్మాయి పాత్రకు సరిపోయింది. ప్రకాష్ రాజ్ తక్కువ సన్నివేశాలతోనే మెప్పించాడు. రాఘవరాజు పాత్రలో హుందాగా నటించాడు. క్లైమాక్సులో నటుడిగా తన స్థాయి ఏంటో చూపించాడు. జయసుధ కూడా పాత్రకు తగ్గట్లుగా నటించింది. బంగర్రాజు పాత్రలో నరేష్ అదరగొట్టాడు. సినిమాలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించేది ఆయన పాత్రే. ఇంద్రజ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. సిజ్జు.. ప్రవీణ్.. ప్రభాస్ శీను.. ప్రవీణ్ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… ఈ చిత్రానికి సంగీతం.. ఛాయాగ్రహణం సినిమాకు బలంగా నిలిచాయి. మిక్కీ జే మేయర్ సంగీతం ‘సీతమ్మ వాకిట్లో..’ లాంటి సినిమాల్ని గుర్తుకు తెచ్చినప్పటికీ సినిమాకు సరిపోయింది. మమతలు పంచే ఊరు.. పాట వెంటాడుతుంది. నేపథ్య సంగీతం కూడా ఓకే. సమీర్ రెడ్డి కెమెరా పనితనం సినిమాకు కలర్ ఫుల్ లుక్ తీసుకొచ్చింది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా అందంగా చూపించాడు సమీర్. పాటల చిత్రీకరణ చాలా బాగుంది. ముఖ్యంగా శర్వా-అనుపమలను వింటేజ్ లుక్ లో చూపించే పాటను చాలా బాగా తీశాడు. నిర్మాణ విలువలు దిల్ రాజు బేనర్ స్థాయికి తగ్గట్లే ఉన్నాయి. సతీష్ వేగేశ్న రచయితగా.. దర్శకుడిగా మెప్పించాడు. సినిమాలో గుండెకు హత్తుకునే మాటలు చాలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here